Skip to main content

ఒవైసీ బ్రదర్స్ తో స్నేహం కేసీఆర్ కు సవాలేనా?

రాజకీయాల్లో ఒకరి నిర్లక్ష్యమే ఇంకొకరికి అవకాశంగా మారుతుంది. అవతలి వ్యక్తి అతి విశ్వాసమే ఇవతలి వ్యక్తికి ఆయుధం అవుతుంది. సంఖ్యాబలంతోనే సర్వత్రా నెగ్గుకొస్తానంటే కుదరదు. ప్రజల్లో పాదుకున్న సెంటిమెంట్లేంటో అర్థం చేసుకొని అడుగేయాలి. అలా కాకపోతే విపక్షం చేతిలోనే పరాభవం చవి చూడక తప్పదు. తెలంగాణలో వికసించేందుకు బీజేపీ శక్తినంతా ప్రయోగిస్తున్న సమయంలో... కేసీఆర్ విస్మరిస్తున్న కీలకమైన అంశాలేంటో చెప్పడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. 



తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ....స్వయంగా కేసీఆరే ఛాన్స్‌ ఇస్తున్నారా? కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు బీజేపీ ఇప్పటికే స్కెచ్ రెడీ చేసిందా? మిత్రపక్షమైన ఎంఐఎం ఏం మాట్లాడినా కేసీఆర్ ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? తెలంగాణలో మతసామరస్యానికి ముప్పు వాటిల్లిందా? అక్బరుద్దీన్ హేట్ స్పీచ్‌పై టీఆర్ఎస్‌ వైఖరేంటి? మత విద్వేషాలను రెచ్చగొట్టేలా అక్బర్ చేసిన కామెంట్స్ ను కేసీఆర్ ఉపేక్షిస్తే...జరిగే పరిణామాలేంటి? 


తెలంగాణ అంటే గంగా జమునా తెహజీబ్...కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా చెప్పే మాట ఇది. నిజానికి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే...తెలంగాణలో మతసామరస్యం చాలా ఎక్కువ. ఇది చాలా సార్లు నిరూపితమైంది కూడా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత కేసీఆర్ కూడా ఈ పాలసీ చెడిపోకుండా...మతపరమైన విషయాల్లో రాజకీయాలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇదంతా మూడేళ్ల క్రితం వరకు మాట. ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి. అప్పట్లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను అసదుద్దీన్ బయట పెట్టినప్పటి నుంచి ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా మారిపోయింది. వారు వ్యక్తిగతంగా కూడా ఆత్మీయ స్నేహితులుగా ఒక్కటయ్యారు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కూడా కేసీఆర్ మంచి సంబంధాలే నెరుపుతూ వచ్చారు. కానీ ఎంఐఎంను చేరదీయడం బీజేపీకి నచ్చలేదు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు పలుమార్లు బహిరంగంగానే చెప్పారు.


ప్రస్తుతం ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ హేట్ స్పీచ్‌తో కేసీఆర్ వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై నేరుగా కేసీఆర్ కాకపోయినా...కనీసం ఆ పార్టీ నేతల నుంచి కూడా ఒక్క ఖండనా రాలేదు. పైగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమా? కాదా? అన్న మీమాంస కూడా అవసరం లేదు. అక్బర్ వ్యాఖ్యలను ఎవరూ హర్షించరు. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి రియాక్షనే లేదు. బీజేపీ మాత్రం తమ పాలసీ ప్రకారం ఎంఐఎంపై ఎదురుదాడి ప్రారంభించింది. కానీ ఇన్నాళ్లూ ఎంఐఎంకు బీజేపీకి నడిచిన మాటల యుద్ధం వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. పైగా ఎంఐఎం ఆ పార్టీకి మిత్రపక్షం కూాడా. 


అక్బరుద్దీన్ దూకుడుకు ఆదిలోనే కళ్లెం వేయాల్సింది


అక్బరుద్దీన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తొలిసారేం కాదు. 2013లో కూడా నిజామాబాద్‌లో సేమ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పుడు కిరణ్ కుమార్‌ రెడ్డి అధికారంలో ఉన్నారు. నాడు అక్బర్‌పై చర్యలు తీసుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. దాంతో కేసీఆర్‌పై ప్రజల్లో నెగిటివ్ సంకేతాలు వెళ్తున్నాయి. ముఖ్యంగా హిందువుల్లో కేసీఆర్‌పై ఒక అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలను కోల్పోయేందుకు ఎన్నికల సమయంలో కేసీఆర్ హిందువులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంత డ్యామేజ్ జరిగిన తర్వాత కూడా కేసీఆర్ తేరుకోకపోవడం సరికాదంటున్నారు నిపుణులు. 


ఇక్కడ మరో విషయాన్ని కూడా రాజకీయ పండితులు ఉటంకిస్తున్నారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కత్తిమహేష్‌ను నగర బహిష్కరణ చేశారు. ఆ తర్వాత పరిపూర్ణానందను కూడా విద్వేషాలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలతో బహిష్కరించారు. ఆ సమయంలో కేసీఆర్ సర్కారు నిర్ణయాన్ని పలువురు స్వాగతించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్న సర్కారు వైఖరిని అభినందించారు. కానీ ఇప్పుడు అక్బరుద్దీన్ విషయంలో ఎందుకు సైలెంట్‌ అయిపోయారని సామాన్యుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా ఉదాసీన వైఖరితో ఉంటే బీజేపీకి ఛాన్స్ ఇచ్చిన వారవుతారని టీఆర్ఎస్‌ నేతలను హెచ్చరిస్తున్నారు.


కేసీఆర్ ఏం చేస్తారు? 


హిందుత్వంతో పాటు జాతీయవాదాలే ఎజెండాగా వెళ్తున్న బీజేపీకి...కేసీఆర్ చేసే ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఛాన్స్ ఇస్తాయని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకైతే మతపరమైన భావోద్వేగాలు పనిచేసే స్థితి లేకపోయినప్పటికీ...క్రమంగా ఆ పరిస్థితిని తీసుకొస్తే ముప్పు తప్పదంటున్నారు. అక్బర్ వ్యాఖ్యలపై కేసీఆర్ సర్కారు తన వైఖరిని ప్రకటించకపోయినప్పటికీ....కనీసం ఇప్పటికైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి రానున్న ప్రమాదాన్ని కేసీఆర్ గ్రహిస్తారా? గ్రహించి, తేరుకొని దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా? లేక ముస్లింలు అందరూ ఎంఐఎం వెంటే ఉన్నారని భ్రమించి, ఒవైసీ సోదరుల కోసం రాజకీయ, సామాజిక వాతావరణాన్ని చేజేతులా కలుషితం చేస్తారా? చూడాలి మరి. 


- టి.రమేశ్ బాబు


Mail ID: rameshbabut@hotmail.com


 


 


 


Comments

Popular posts from this blog

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?