Skip to main content

ఏపీలో న్యూ ప్రొడక్షన్ విత్ మోడీ డైరెక్షన్

ఏపీలో జనసేన ఇకపై క్రియాశీల పాత్ర పోషించబోయే అవకాశం కనిపిస్తోంది. అందుకు బీజేపీ నేతల డైరెక్షన్ చాలా కీలకంగా మారుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి పవన్ నేర్చుకున్న పాఠాలతో బీజేపీతో దోస్తీ కట్టడం తప్పదన్న సంకేతాలు ఆ పార్టీ పరివారం నుంచి పొక్కుతున్నాయి. అయితే ఎన్నికల్లో పార్టీ విఫలమైనా తామేం కుంగిపోలేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రశ్నిస్తూనే ఉంటామన్న పవన్... భవిష్యత్తు ప్రణాళికలను ఢిల్లీ పెద్ద కనుసన్నల్లోనే రచించుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. 



ఎన్నికల్లో ఓటమి అనంతరం జనసేన ఇపుడిపుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే పార్టీ ఓటమి నుంచి తేరుకుంటున్న పవన్ కు మరో నాలుగేళ్లు పార్టీని నడపడం మాత్రం కత్తి మీద సామే అవుతుంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో నియోజకవర్గాలవారీగా నిర్వహిస్తున్న సమీక్షలో పార్టీ నేతల వ్యాఖ్యలు కూడా దీనికి అద్దం పడుతున్నాయి.  ఏపీలో అధికార పార్టీ దూకుడుని తట్టుకుని నిలబడటం పవన్ కు సాధ్యమయ్యే పనికాదని, దీనికితోడు పవన్ కు ఆర్థికంగా అండదండలు కూడా లేకపోవడం అందుకు మరోకారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షానికి పరిమితమైన టీడీపీ క్యాడర్ కూడా బలీయంగా గానే ఉంది. ఇదే విషయాన్ని కార్యకర్తల సమీక్షలో పవన్ వెల్లడించారు. దీంతో పార్టీకి అండగా ఉన్న అభిమానులను, కార్యకర్తలను కాపాడుకోవాలని పవన్ వ్యూహ రచన చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమినుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలీయమైన శక్తిగా మారుస్తానని ప్రతిన బూనారు. బీజేపీతో కలిసి వెళ్తే తప్ప పార్టీని బతికించుకోలేమన్న నిర్ణయానికి వచ్చిన పవన్ .. ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.  జనసేన భవిష్యత్ కార్యాచరణపై పవన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్ ను ఢీకొట్టేందుకు బీజేపీతో చేతులు కలపడం తప్ప మరో గత్యంతరం లేదని జనసేన నేతలు భావిస్తున్నారు.  


2014 లో టీడీపీ తో కలిసి పోటీ చేసి 4 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ పరిస్థితి ఇటీవలి ఎన్నికలతో మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చటంతో ఏపీలో నెగ్గుకు రావటం ఆ పార్టీకి కష్టంగా మారింది. ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. పీపీఏల విషయం లోను, లేదా ప్రజావేదికను కూలగొట్టడంపైనా జగన్ సర్కార్ వైఖరిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ ముఖ్య నేత రామ్ మాధవ్ కూడా రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయిందని జగన్ ప్రభుత్వ పాలన పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ నేత పురంధేశ్వరి కూడా ప్రత్యేక హోదాపై చంద్రబాబు చేసినట్లే జగన్ కూడా రాద్ధాంతం చేస్తున్నారని తీవ్రంగా విమర్శిస్తు్న్నారు. అయితే బీజేపీ వైసీపీని టార్గెట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకే వైసీపీ ని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలను ఇప్పటికే తమ పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో ఇక వైసీపీని ఢీ కొట్టడమే తరువాయి అన్నట్టుగా అడుగులు వేస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయడానికి సిద్దమనే సంకేతాలు ఇస్తోంది. ఒకవైపు టీడీపీ నేతల చేరికలు, మరోవైపు జనసేనతో పొత్తు ఉంటే.. వైసీపీని ఢీ కొట్టడం సులభమవుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.  



మరోవైపు ఏపీలో ఉనికి కోసం పోరాడుతున్న బీజేపీ... జనసేనను తమ పార్టీలో విలీనం చేయాలని తానా మహాసభల్లో రాం మాధవ్ కోరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై పార్టీనేతలు ఎవరూ నోరుమెదపలేదు. అయితే బీజేపీలో జనసేన విలీనంపై చర్చ జరిగిన సందర్భంగా విలీనం కంటే బీజేపీతో సఖ్యతగా ఉండటమే మేలని  నేతలు సూచించిట్లు తెలుస్తోంది.  పార్టీ విలీనమైతే ఎన్నికల్లో ఘోర ఓటమి కారణంగా జనసేనకు అంతగా ప్రాథాన్యమివ్వరని నేతలు అభిప్రాయ పడుతున్నారు.  దీంతో బీజేపీతో సఖ్యతగా ఉంటేనే  మేలని పవన్ సన్నిహితులు వ్యాఖ్యానించినట్లు సమాచారం. బీజేపీలో జనసేనను విలీనం చేస్తే ప్రజల్లో అభాసుపాలు కాక తప్పదని పార్టీనేతలు చెప్పినట్లు సమాచారం. అన్న చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేసినట్లే తమ్ముడు కూడా పార్టీని విలీనం చేశాడనే అపవాదు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రజారాజ్యం విషయంలో జరిగిన ఏ తప్పూ.. జనసేన విషయంలో రిపీట్ కాదని పవన్ గతంలో పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు.  అనుభవరాహిత్యం వల్ల అప్పట్లో అన్నయ్య మోసపోయారని పవన్ వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందరూ వ‌చ్చి.. ఎన్నికల్లో ఓడిపోగానే అందరూ బయటకు వెళ్లిపోయారని.. దాంతో తప్పని పరిస్థితుల్లో అన్నయ్య కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు వన్ కళ్యాణ్.


మరోవైపు ఏపీలో పార్టీని విస్తరించేందుకు దూకుడుగా వెళుతున్న బీజేపీ ...మెగాస్టార్ చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఏపీలో చిరంజీవికి ఆయన సామాజిక వర్గంతో పాటు మిగతా అన్ని వర్గాల్లో అభిమానులు ఉన్నారు. దీంతో ఆయన కున్న ఇమేజ్ ను క్యాష్ చేసుకునేందుకు  బీజేపీ అగ్ర నాయకత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఈ సందర్భంగా బీజేపీ నేత మాజీ మంత్రి మాణిక్యాలరావు చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. చిరంజీవి బీజేపీలోకి వస్తే సంతోషంగా స్వాగతిస్తామని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు.  2009 ఎన్నికల తర్వాత పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్‌లో చేరారు. అయితే, 2014 ఎన్నికల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన చిరు, కాంగ్రెస్‌తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందే చిరంజీవి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ, ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సైతం దూరంగా ఉండడం గమనించాల్సిన అంశం. ఇక పవన్ మరో సోదరుడు నాగేంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో తమ్ముడి గెలుపు కోసం శ్రమించారు. ఫలితాలు చూసిన కంగు తిన్న నాగబాబు.. ఆ ప్రభావం నుంచి ఇంకా తాము కోలుకోలేదని, అయినా రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తామని వ్యాఖ్యానించడం విశేషం. దీంతో ఈ ముగ్గురిని లాగేస్తే.. ఏపీలో బీజేపీ పవర్ ఫుల్ శక్తిగా అవతరిస్తుందని భావిస్తున్నారు. 
  
ఈ క్రమంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో అన్నా దమ్ముల వ్యవహారం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి నిర్ణయం ఏపీ భవిష్యత్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటు టీడీపీ భవిష్యత్తు కూడా మెగా బ్రదర్స్ నిర్ణయం మీదే ప్రధానంగా ఆధారపడి ఉందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి.. కొణిదెల బ్రదర్స్ నిర్ణయం ఎలా ఉంటుంది, రానున్న రోజుల్లో ఏపీ రాజకీయ యవనికపై ఎలాంటి ప్రభావం చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. 


- టి.రమేశ్ బాబు


- Email: rameshbabut@hotmail.com


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన ...