Skip to main content

జగన్ ను, కేసీఆర్ ను నడిపిస్తున్న అదృశ్య శక్తులు

మఠాధిపతులు, పీఠాధిపతులు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారన్నది రాచరిక వ్యవస్థలో రాజ్యమేలిన సంగతి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న నేటి వ్యవస్థలో కూడా ఆనాటి పోకడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వ్యవస్థకు మంచిదా? కాదా? మంచి,చెడుల ప్రభావం పాజిటివ్ గా కనిపిస్తోందా, నెగెటివ్ గానా? అన్న విషయాన్ని వివరించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. 



తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో స్వామీజీలే చక్రం తిప్పుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో వేలు పెట్టకపోయినా... పాలకుల ప్రతీ అడుగులో అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు రాజగురువులు పోషించిన పాత్రను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పీఠాధిపతులే నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య సయోధ్య నుంచి నదీ జలాల పంపిణీ వరకు ఎన్నో కీలక నిర్ణయాల వెనుక పీఠాధిపతుల చొరవ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వాలున్న రాష్ట్రాల మధ్య కూడా లేని సఖ్యత, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఉందంటే... ఆ క్రెడిట్ తప్పకుండా పీఠాధిపతులకే దక్కుతుంది. 

రాజరిక వ్యవస్థలో చక్రవర్తుల కీలక నిర్ణయాల్లో నాటి రాజగురువుల పాత్ర అద్భుతమైనది. నాడు రాజగురువుల దిశానిర్ధేశం వల్లనే సుభీక్షమైన పాలన చేపట్టగలిగారు చక్రవర్తులు. సరిగ్గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతోంది. రెండు రాష్ట్రాల సీఎంలు వరుసగా తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు పీఠాధిపతులు తగు సూచనలు చేస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు వెనుకుండి సూచనలు చేసింది కూడా ఓ పీఠాధిపతే అంటున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాల మధ్య సఖ్యత కరువైంది. కేసీఆర్, చంద్రబాబు మధ్య ఉన్న రాజకీయ వైరం కారణంగా కొన్ని ఉద్రిక్తలు కూడా చోటు చేసుకున్నాయి. ఒకానొక సందర్భంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద నీటి కోసం ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య గొడవ కూడా జరిగింది. నాటి పరిస్థితులను చక్కదిద్దేందుకు గవర్నర్ మధ్యవర్తిర్వం వహించారనేది చాలా మందికి తెలిసిందే. ఆ సమయంలో కూడా పీఠాధిపతులు తెలుగు రాష్ట్రాల సీఎంలను ఒకతాటిపైకి తెచ్చేందుకు యత్నించినట్లు నిపుణులు చెప్తున్నారు. కానీ నాటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పీఠాధిపతుల మాట వినలేదని, పైగా వారితో కయ్యం పెట్టుకున్నారని అంతర్గత వర్గాలు చెప్తున్నాయి. కేవలం తనకు అనుయాయులుగా ఉండే ఇద్దరు పత్రికాధిపతుల సలహా తప్పితే....ఇతరుల మాటలు పెడచెవిన పెట్టేవారంటున్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విశాఖకు చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆయనకు సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి పనిచేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన సూచనలు అందించారు. కానీ స్వరూపానంద జోక్యంపై బాబు అభ్యంతరం చెప్పారు. విజయవాడలో దేవాలయాల కూల్చేవేతను స్వరూపానంద ఖండించారు. ఇలాంటివి తగవని చంద్రబాబుకు సూచనలు చేశారు. అయితే వాటిని బాబు పెడచెవిన పెట్టారు.  కానీ అదే సమయంలో కేసీఆర్ మాత్రం స్వరూపానంద సూచనలు పాటించి... వాటిని తన రాజనీతిని జోడించి అమలు చేశారు. ముఖ్యంగా కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు స్వరూపానంద సూచనలు కూడా ఒక కారణమనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో ఉండడం విశేషం. 

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సమయంలో పీఠాధిపతుల పాత్ర చాలా కీలకంగా మారింది. తెలంగాణలో కేసీఆర్ రెండో సారి అధికారంలోకి రావడం వెనుక, ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టడం వెనుక పీఠాధిపతుల సూచనలే కీలకమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వీరిద్దరికీ మధ్యవర్తిత్వం వహించడంలో శారదాపీఠాధిపతి స్వరూపానంద కీలకంగా వ్యవహరించారు.

స్వతహాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ముందు నుంచి యజ్ఞయాగాదులంటే ఆసక్తి ఎక్కువ. ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టేందుకు పీఠాధిపతుల సూచనలు, సలహాలు, ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకుంటారు. అయుత చండీయాగం, రాజశ్యామల యాగం వంటి పెద్ద పెద్ద యాగాలు కూడా నిర్వహించిన ఘనత కేసీఆర్‌దే. అంతేకాదు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు ముందు కూడా కేసీఆర్ శారదాపీఠానికి వచ్చి స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ కూడా ఎన్నికల ముందు స్వరూపానంద ఆశీస్సులు పలు సందర్భాల్లో తీసుకోవడం చూశాం.

ఏపీ సీఎంగా జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత స్వరూపానంద సరస్వతి ఆశీస్సుల కోసం విశాఖకు వెళ్లారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. స్వరూపానందతో జగన్‌ బంధం నేటిది కాదు. ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం కావడానికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం జగన్ నేరుగా విశాఖ వెళ్లి స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికలకు ముందు జగన్ కోసం స్వరూపానంద రాజశ్యామల యాగం కూడా నిర్వహించారు. ఈ విషయాన్ని స్వరూపానంద స్వయంగా ప్రకటించారు. జగన్ అంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్పారు.


జగన్, కేసీఆర్ మధ్య కెమిస్ట్రీ కుదిర్చిన స్వరూపానంద
అటు కేసీఆర్‌కు కూడా స్వరూపానంద సరస్వతి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు సీఎం కేసీఆర్ కూడా రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇది కూడా స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో కేసీఆర్ ఆయన్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఇలా ఇద్దరు సీఎంలకు స్వరూపానంద సరస్వతి రాజగురువుగా వ్యవహరించారనడంలో అతిశయోక్తి లేదు.

నిజానికి స్వరూపానంద సరస్వతి సూచనల వల్ల తెలుగు రాష్ట్రాల సీఎంలే కాదు, రెండు రాష్ట్రాల ప్రజలు కూడా లబ్ధిపొందారు. ఇద్దరు సీఎంల మధ్య స్వరూపానంద సంధానకర్తగా వ్యవహరించడం వల్లనే జల వివాదాలు, విభజన సమస్యలపై రెండు రాష్ట్రాలు ఒక అవగాహనకు వచ్చాయి. దేశంలో ఏ రాష్ట్రాల మధ్య లేనంత సఖ్యత తెలంగాణ, ఏపీల మధ్యన ఉందంటే దానిక్కారణం పరోక్షంగా శారద పీఠాధిపతి అనే చెప్పాలి. గోదావరి జలాలను నాగార్జున సాగర్‌కు తీసుకెళ్లే ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రెండు రాష్ట్రాల ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయి.

తెలుగు రాష్ట్రాల సీఎంలకు పరిపాలనా పరమైన నిర్ణయాల్లో సలహాలు ఇవ్వడమే కాదు, రాజకీయ వ్యవహారాల్లోనూ పీఠాధిపతుల సలహాలే కీలకంగా మారాయి. కొద్ది నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఇద్దరు సీఎంల కోసం వ్యూహ రచన చేసింది కూడా పీఠాధిపతులే. ఒకప్పుడు యుద్ధానికి ముందు రాజగురువులు ఎలా ఎత్తులు, పైఎత్తులపై చక్రవర్తులకు సూచనలు చేసేవారో.....గత ఎన్నికల సమయంలో కూడా అలాంటి పనే పీఠాధిపతులు చేశారు.

తెలంగాణకు ముందస్తు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం వల్ల కేసీఆర్‌కు లాభం చేకూరింది. ఆ సమయంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. అయితే కేసీఆర్‌ కూడా ఏపీ ఎన్నికల్లో జగన్‌కు బహిరంగంగా మద్దతు పలుకుతారని అంతా భావించారు. కానీ కేసీఆర్ మాత్రం స్వరూపానంద సరస్వతి సూచనతో ఎలాంటి రాజకీయపరమైన మద్దతు ప్రకటించలేదు. కేవలం వ్యూహాత్మకంగా ఏపీ ఎన్నికల్లో వేలు పెట్టకుండా జగన్‌కు తన వంతు సాయాన్ని వేరే విధంగా చేసినట్లు రెండు పార్టీల నేతలంటుంటారు. ఈ వ్యూహం కూడా స్వరూపానంద సరస్వతి సూచనతోనే అమలు చేసినట్లు కేసీఆర్, జగన్‌లకు సన్నిహితంగా ఉండే నేతలు చెప్తున్నారు.....స్పాట్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేవలం స్వరూపానంద సరస్వతి మాత్రమే కాదు, చిన్న జీయర్ కూడా రాజగురువులాంటి వారే. చాలా సందర్భాల్లో చిన్న జీయర్ ఆశీస్సులు తీసుకోనిది, కేసీఆర్ ఏ పని ప్రారంభిచేవారు కాదు. అయుత చండీయాగం, యాదాద్రి శంకుస్థాపన వంటి కార్యక్రమాల్లో చిన్నజీయర్‌కు కేసీఆర్ పెద్ద పీట వేశారు. అంతేకాదు వ్యక్తిగతంగా కూడా చిన్న జీయర్ చెప్పిన సూచనలను కేసీఆర్ తూ.చ. తప్పకుండా పాటిస్తారనే పేరుంది. అందుకే రెవిన్యూ శాఖపై కేసీఆర్‌ గరం అయినప్పుడు ఆ శాఖ ఉద్యోగులు నేరుగా చిన్నజీయర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంతేకాదు తమను మీరే రక్షించాలంటూ అభయం కోరారు...స్పాట్

రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి సాగేందుకు రాజగురువుల్లాంటి పీఠాధిపతుల సలహాలు, సూచనలే కారణమని అందరికీ తెలుసు. దీన్ని రాజకీయ కోణంలో చూసేవాళ్లు కూడా ఉన్నారు. కానీ పీఠాధిపతులంటే రాజకీయాలకు అతీతులు, సర్వసంగ పరిత్యాగులు, వాళ్లేం చేసినా లోక కళ్యాణం కోసమే. శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అయినా, చిన్నజీయర్ స్వామీజీ అయినా తెలుగు ప్రజల క్షేమం కోసం తప్పితే, స్వలాభం కోసం ఎత్తులు వేసే వ్యక్తులు కాదన్నది చాలా మంది వాదన. వారి సూచనల వల్లనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. ఇరువురు సీఎంలు కలిసి పని చేస్తూ తెలుగు ప్రజల దాహార్తిని తీర్చేందుకు, ఇతర విభజన సమస్యలు తీర్చేందుకు ముందుకు వచ్చారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి...స్పాట్

పీఠాధిపతులు, స్వామీజీల సూచనలను పాలకులు తీసుకోవడం, ఆచరించడం కొత్తేమీ కాదు. పూర్వ కాలం నుంచి ఇది కొనసాగుతూనే ఉంది.  సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీని 1674లో హిందూ సామ్రాజ్య పట్టాభిషేకం చేసేవరకు తన ప్రయత్నం కొనసాగించాడు. ధీరేంద్ర బ్రహ్మచారి వంటి వాళ్లను ఇందిరా గాంధీ గురువుగా స్వీకరించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా దయానందగిరిని తన గురువుగా స్వీకరించారు, గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన సలహాలు తీసుకునేవారు. ఇలా పాలనలో తాము రాజగురువుగా నమ్మే వ్యక్తుల సాయం తీసుకోవడం అనాదిగా వస్తూనే ఉంది. 


తెలుగు రాష్ట్రాల సీఎంలు స్వామీజీల సలహాలు తీసుకుంటారని ప్రజలందరికీ తెలుసు. వారెప్పుడూ రహస్యంగా వెళ్లి పీఠాల్లో రాజకీయాలు చేయలేదు. కేవలం ప్రజా సంక్షేమం కోసం యాగాలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు, ధర్మ సంకటం ఏర్పడ్డప్పుడు సలహాలు మాత్రమే స్వీకరించారు. ప్రతీ దానికి రెండు కోణాలుంటాయి. అలాగని పీఠాధిపతులు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం తప్పు అని భావించడం సబబు కాదు, ధర్మ సంస్థాపనార్ధాయ... అన్నట్లు ధర్మం కోసం వారు చేసే సూచనలు ప్రజాహితం కోసమేనని గుర్తించాలి.


 - టి.రమేశ్ బాబు


- 9032003022


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తో...