పుట్టుక నీది, చావు నీది...బ్రతుకంతా దేశానిది. కాళోజీ చెప్పిన ఈ మాటలు అచ్చుగుద్దినట్లు ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు సరిపోతాయి. ఆయన జీవితం తెలంగాణకే అంకితం అన్నట్లు సాగింది. తెలంగాణ కోసమే సార్ పుట్టారా? అన్నట్లు జీవించారాయన. నీళ్లు, నిధుల, నియామకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించారు. స్వయంపాలనతోనే తెలంగాణ అభివృద్ది చెందుతుందని, భావజాల వ్యాప్తితోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని నమ్మరాయన. చివరి వరకు అందుకోసమే పోరాడారు. అలాంటి తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సమున్నత గౌరవం లభించలేదని వాదనలున్నాయి. అధికారికంగా ఆయన జయంతి, వర్ధంతులను నిర్వహిస్తున్నప్పటికీ...సార్‌కు దక్కాల్సిన గౌరవం ఇది కాదంటున్నారు.
ఆచార్య కొత్త పల్లి జయంశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంత కర్త. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటి....జాతి మొత్తాన్ని చైతన్య పరిచిన వ్యక్తి. భావజాల వ్యాప్తితోనే తెలంగాణ సాధించుకోవచ్చని గట్టిగా నమ్మి...అందుకోసం జీవితమంతా ధారపోసిన మహోన్నతుడు. స్వరాష్ట్రం కోసం ప్రజలను పోరుబాట దిశగా జాగృతం చేసిన సిద్ధాంతకర్త. కొట్లాటలోనే కాదు, రాజకీయ ప్రక్రియలోనూ అన్నీ తానై వ్యవహరించారు. ఉద్యమపార్టీగా టీఆర్ఎస్‌కు, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు సలహాలు, సూచనలతో దిశానిర్దేశం చేసిన మార్గదర్శి.
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావమే ఆశగా, శ్వాసగా జీవించి తెలంగాణ పితగా ప్రజల గుండెల్లో కొలువయ్యారు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. ఆయన ఒకప్పటి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో 1934 ఆగస్టు 6న జన్మించారు. విద్యార్ధి దశ నుంచే సార్‌కు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవసరంపై స్పష్టమైన అవగాహన ఉండేది. అందుకే తొలిదశలోనే ఆయన ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఈ సందర్భంగా నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. 1952లో గైర్‌ముల్కీ ఉద్యమం మొదలు 1969లో జరిగిన ఉద్యమం వరకూ జయశంకర్ పాల్గొన్నారు.
తొలిదశ ఉద్యమంలో భాగంగా ఇడ్లీ-సాంబార్ గోబ్యాక్ ఉద్యమం, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ది నాయకుడిగా 1954లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చారు జయశంకర్ సార్. తెలంగాణ ఆవశ్యకతపై ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. దేశవిదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పారు. అధ్యాపకుడిగా కొనసాగుతూనే అలుపెరగకుండా ప్రత్యేక రాష్ట్రంకోసం శ్రమించారాయన. ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని నిత్యం చెప్పేవారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై గణాంకాలతో, సాధికారిక ప్రసంగాలతో ఉద్యమశ్రేణులను ఏకతాటిపైకి తెచ్చారు.
తెలంగాణ ఆవశ్యకతపై ఎంత సేపైనా అలుపనేదే లేకుండా...తెలుగు, ఉర్ధూ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడేవారు ఫ్రాఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసం ఆయన చేసిన పరిశోధన అలాంటిది. ఎంత సేపు మాట్లాడినా కూడా రెచ్చగొట్టేలా ఒక్క మాట కూడా ఆయన నోటి నుంచి వచ్చేది కాదు. హైదరాబాద్‌లో సీఫెల్ రిజిష్టార్‌గా, వరంగల్‌లో సీకేఎం కాలేజీ ప్రిన్సిపల్‌గా, కాకతీయ యూనివర్సిటీ రిజిష్టార్‌గా, వైస్‌చాన్స్‌లర్‌గా గణనీయమైన సేవలందించారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి సంప్రదాయాలపై ఆయనకు ఎంతో అభిమానం ఉండేది. తెలంగాణ వనరుల దోపిడీ, విధ్వంసం పట్ల ఆయన శాస్త్రీయ పద్ధతిలో, గణాంకాలు సహా ప్రసంగాలు చేసేవారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివక్షను తరచూ ఎత్తిచూపే వారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఏ విధంగా అభివృద్ధి సాధించవచ్చుననేది కూడా శాస్త్రీయంగా వివరించే వారు.
ఉద్యమ శ్రేణులను జాగృతం చేస్తూ వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేశారు ఫ్రొఫెసర్ జయశంకర్ సార్. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. అలా జీవితంమంతా తెలంగాణ సాధనకోసమే అర్పించిన సార్....2011 జూన్ 21న మనందరినీ విడిచి వెళ్లిపోయారు. తన జీవితాశమైన స్వరాష్ట్ర సాకారాన్ని చూడకుండానే లోకాన్ని వీడారు.
తెలంగాణ సాధనే జీవితంగా బ్రతికిన ఫ్రొఫెసర్ జయశంకర్ సార్‌కు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సరైన గౌరవం లభించలేదని ఉద్యమకారులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పత్తాకు లేని లీడర్లంతా ఇప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు. కానీ జీవితమంతా రాష్ట్ర సాధనకే అంకితం చేసిన సార్‌కు మాత్రం...సమున్నత గౌరవం లభించలేదు. కనీసం ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై కూడా పెట్టలేదు. హెల్త్ యూనివర్సిటీకి, భూపాలపల్లి జిల్లాకు ఆయన పేరు పెట్టారు. కానీ సార్ జయంతి, వర్ధంతి వేడుకలను ఒక్కసారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించింది లేదు. స్వరాష్ట్రం ఎలా ఉండాలని ఆయన కన్న ఆశయాలను దృష్టిలో పెట్టుకొని పని చేస్తే అదే ఆయనకిచ్చే గౌరవం.
- T.Rameshbabu
- Mail: rameshbabut@hotmail.com
Comments
Post a Comment
Your Comments Please: