దేవుణ్ని నమ్మేవాళ్లు అందరూ ప్రతిరోజూ కాకపోయినా సందర్భానుసారమైనా ఆలయ దర్శనం, దైవ దర్శనం చేసుకుంటారు. అయితే గర్భగుడి అనే మాట గురించి అందరికీ తెలిసిదే. అసలు గర్భగుడి అంటే ఏమిటనేది చాలా మందికి తెలియదు. గర్భగుడి అనగానే విగ్రహాన్ని రక్షిస్తూ నాలుగు వైపులా గోడలు ఉండడం.. పైనేమో ఊర్వం.. అంటే విమానం గుర్తుకు వస్తుంది. విగ్రహ రూపంలో భగవంతుడు నెలకొని ఉన్న చోటే గర్భగుడి అని కొందరు.. గుడి గర్భం.. అంటే మధ్యభాగంలో భగవంతుడుంటాడు కాబట్టి గర్భగుడి అని మరికొందరు భావిస్తారు. అయితే ఆ గుడిగర్భంలో లేదా.. గర్భగుడిలో ఏముంటుంది? ఈ పేరు ఎలా ప్రచారంలోకి వచ్చిందనేది చాలా మందికి తెలియదు. అదే ఇప్పుడు తెలుసుకుందాం.
ఆగమ,శిల్పశాస్త్రాల్లో గర్భగుడిని.. ప్రాసాదం, సందనం,ధామం, నికేతనం, మందిరం, సౌధం, ఆలయం, నీలయం, ఆయతనం అనే పేర్లతో పిలుస్తారు. అవే గాక దాదాపు ఇంకా ముప్పైకి పైగా పేర్లున్నాయి. అదొక విశేషం. అయితే ప్రాచీనకాలంలో ఆలయాన్ని నిర్మించే ముందు ఆ ప్రదేశంలో గర్పన్యాసం అనే ప్రక్రియ నిర్వహించేవారు. ఒక రాగి కలశం తీసుకొని అందులో నవరత్నాలనూ, పంచలోహాలనూ, ఇంకా కొన్ని ధాతువులను, కొన్ని ఔషధమూలికలనూ ఉంచి పూజాదికాలు నిర్వహించి... గర్భస్థానంలో.. అంటే మధ్య భాగంలో ఉంచేవారు. ఇలా ఆ గర్భాన్ని గుడిలో ఉంచడం వల్ల అది ఆలయం అభివృద్ధికి కారణమౌతుంది. ఆ తర్వాత ఆ గర్భంపైనే ఆధార శిలను ఉంచి దానిపై విగ్రహాన్ని ప్రతిష్ఠిస్థారు. అప్పుడే ఆ విగ్రహానికి జీవం వస్తుంది. అలా దాని చుట్టూ నిర్మించే గుడి దేహంతో సమానం. ఇదొక పద్ధతి. ఈ విషయాన్ని ఈశాన శివగురుదేవ పద్దతి చాలా స్పష్టంగా చెప్పిందని ఆగమ పండితులు చెబుతున్నారు. ఇంకా పలు ప్రాచీన గ్రంథాల్లో కూడా ఈ వివరం ఉంది.
ఇక మరో సంప్రదాయం ప్రకారం ముందుగా ఆలయాన్ని నిర్మించి, ఆ తర్వాత అందులో విగ్రహం లేదా శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే దాన్ని గృహగర్భం అంటారు. అదే ముందు విగ్రహం ప్రతిష్టించి ఆపై దానికి గుడి కడితే దాన్ని గర్భగుడి అంటారు. మనకు ఈ రెండు సాంప్రదాయాల్లో గుళ్లు నిర్మించుకునే పద్ధతులు పారంపర్యంగా వస్తున్నాయి. అందువల్ల స్వయంభూ విగ్రహాలకు నిర్మించిన ఆలయాన్ని మాత్రమే గర్భగృహం లేదా గర్భగుడి అని వ్యవహరించాలని ఆగమ నియమం. గర్భగుడిలో నెలకొన్న దేవుడికంటే ముందు ఆ దేవుడికి ఆశ్రయంగా నిలిచిన గర్భగుడి సాక్షాత్తు భగవంతుని శరీరం అని వైష్ణవాగమాలు చెప్తున్నాయి. గర్భగుడిలోకి ప్రవేశించడం అంటే భగవంతునిలో లయం కావడమే. అందుకే దాన్ని ఆలయం అని పండితులు పిలుస్తున్నారు. దైవదర్శనం ఒక ఫలితాన్ని ఇస్తే.. గర్భగుడిలోకి వెళ్లి దేవుణ్ని దర్శించుకోవడం అనేది... మనల్ని దేవుడిలో లయం చేసే ప్రక్రియ అన్నమాట. ఇదండీ గర్భాలయం ప్రత్యేకత.
- కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు
Comments
Post a Comment
Your Comments Please: