రైతు బంధు పథకం రెండో దఫాకు నిధులు లేవా...నవంబర్ నెల సగం గడిచినా ఈ పథకంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు...... ఖజానా నిండుకుందా.... ఆర్ధిక భారం తగ్గించుకోవడానికి పథకంలో మార్పులు చేసి పది ఎకరాల పరిమితి విధించబోతున్నారా.....రైతు బంధు నిధుల విడుదల ఆలస్యంపై ప్రత్యేక కథనం...
తెలంగాణా ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతుబంధు పథకానికి నిధుల కొరత ఏర్పడిందని సమాచారం..ఇంతవరకు రెండో దఫా నిధుల విడుదల పై ప్రభుత్వంలో కదలికే లేదు.ఈ పథకం మొదటి విడతను మే, జూన్ నెలలో, రెండో విడతను అక్టోబర్, నవంబర్ లలో విడుదల చేస్తామని ప్రకటించారు..అయితే మొదటి దఫా నిధులే ఇంకా పూర్తిగా విడుదల చేయలేదు.హుజుర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో సూర్యాపేట జిల్లాలో పెండింగులో ఉన్న నిధులు ఒకేసారి విడుదల చేశారు. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.ఒక విడత రైతుబంధు కు ఆరు వేల కోట్లు ఖర్చవుతుంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల కోట్లే విడుదలయ్యాయి... నిధుల కొరత కారణంగా ఒకేసారి ఇవ్వలేక దశల వారిగా విడుదల చేస్తున్నారు..మరో ఐదు వందల కోట్లు ఇంకా విడుదల కావాల్సి ఉంది.
మొదటి దఫా పూర్తి కాకుండానే రెండో విడత సమయం వచ్చింది.గత ఏడాది ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా నవంబర్ నెలలోనే ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ రైతు బంధు చెక్కుల పంపిణీని నిలిపివేసింది.ఈసీ అనుమతించాక సరిగ్గా పోలింగ్ కు రెండు మూడు రోజుల ముందు నుంచి నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసింది ప్రభుత్వం.అయితే ఈ ఏడాది నవంబర్ నెల మధ్యలోకి వచ్చినా రెండో విడత నిధుల ఊసే ఎత్తడం లేదు..ఆర్థిక మాంద్యం ఉందని బడ్జెట్ నే కుదించారు. ఈ ఏడాది నిధుల కటకట ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు.అందుకే రెండో విడత జాప్యమవుతోందని తెలిసింది..రాష్ట్రానికి ఉన్న రుణపరిమితి ని ఇప్పటికే సగానికి పైగా వినియోగించుకున్నారు. అప్పు తీసుకొని ఇతర అవసరాలకు వాడుకున్నారు. మళ్ళీ అప్పు కోసం మరో రెండు నెలలు ఆగక తప్పదు.నిధులు లేక రెండో విడత రైతు బంధుపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని అంటున్నారు అధికారులు.ఆర్థిక శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఈ సారి రైతు బంధు రెండో విడత అలస్యమయ్యే అవకాశం ఉందని తెలిసింది.
మరోవైపు ఈ పథకాన్ని పునఃసమీక్షించే యోచనలో ఉన్నట్లు సమాచారం..నిధుల కొరత సాకుతో ఈ పథకాన్ని పది ఎకరాల లోపు రైతులకే పరిమితం చేసే యోచనలో ఉన్నారని తెలిసింది.దీని వల్ల ఏటా రెండు వేల కోట్లు ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు..టిఆర్ఎస్ మొదటి ప్రభుత్వ హయాంలో మెప్పు కోసం ప్రకటించిన కొన్ని విషయాల్లో పునఃసమీక్షించే అవకాశం ఉందని అంటున్నారు.దీనికి ఆర్టీసీ, ఉద్యోగుల జీతాల పెంపుపై సిఎం ఇప్పటి వైఖరినే ఉదాహరణగా తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.కేసీఆర్ మొదటి సారి సీఎం అయ్యాక ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల జీతాల పెంపు విషయంలో ఉదారంగా వ్యవహరించారు.కానీ రెండోసారి అధికారంలోకి రాగానే ఆర్టీసీ, ఉద్యోగుల జీతాల పెంపుపై కఠినంగా ఉంటున్నారు.ఇదే విధంగా రైతు బంధు పథకంలో కూడా 10 ఎకరాల పరిమితి విధించే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి ఇప్పటి ఆర్థిక పరిస్థితి ని కారణంగా చూపి ప్రజల ను మెప్పించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం..
Comments
Post a Comment
Your Comments Please: