- అల్లర్లలో అసువులు బాసిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్, తుపాకీతో కాల్పులు జరుపుతున్న ఆందోళనకారుడు
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు శ్రుతి మించుతున్నాయి. నిరసన మాటున అసహనం హద్దు మీరుతోంది. సీఏఏ ను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ పంతం పట్టిన ఆందోళనకారులు ఢిల్లీని రణరంగంగా మార్చేశారు. మూడు రోజులుగా షాహీన్ బాగ్ లో నిరసనకారులను ప్రజాస్వామ్య పద్ధతిలో దారికి తెచ్చుకునేందుకు నేరుగా సుప్రీంకోర్టే రంగంలోకి దిగింది. నిరసన అనేది ప్రజాజీవితానికి భంగం కలిగించరాదన్న సుప్రీంకోర్టు కండిషన్ తో అది క్లియర్ అయిన సమయంలోనే.. ట్రంప్ భారత్ లో పర్యటించడం.. దాన్నే అదనుగా తీసుకున్న ఆందోళనకారులు జఫ్రాబాద్, మౌజ్ పూర్-బాబర్ పూర్ మెట్రో స్టేషన్లలో హడలెత్తించారు. సీఏఏకు, దేశానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ దుకాణాలపై రాళ్లు విసరడం, రాకపోకలకు అంతరాయం కలిగించారు. నిరసనకారులు పలు దుకాణాలను, మాల్స్ ను తగులబెట్టారు. మంటల్లో చిక్కుకొని పలు షాపులు దగ్ధమయ్యాయి. అటు ఫైర్ సిబ్బందిని కూడా సహాయ చర్యలు చేపట్టకుండా అడ్డుకోవడం ఆందోళన రేపుతోంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకురావడం పోలీసుల తరం కాలేకపోయింది.
గుంపును చెదరగొట్టేందుకు లాఠీచార్జీ, గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. ఈ ఘటనలో రతన్ లాల్ అనే కానిస్టేబుల్ చనిపోగా ఓ డీసీపీ కి గాయాలయ్యాయి. మరోవైపు సీఏఏ ఆందోళనలకు వ్యతిరేకంగా సీఏఏ ను సమర్థిస్తూ బీజేపీ మద్దతుదారులు కూడా ప్రదర్శనలకు పూనుకుంటున్నారు. అగ్ర రాజ్యాధినేత ట్రంప్ సకుటుంబ సపరివారంతో భారత్ లో పర్యటిస్తున్న దృష్ట్యా ప్రపంచంలో దేశ పరువుకు భంగం కలగరాదన్న లక్ష్యంతో బీజేపీ కార్యకర్తలు పోటీ ప్రదర్శనలకు దిగారు. దీంతో ఢిల్లీ ఓ రణరంగాన్ని తలపించింది.
అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిని అదుపు చేయాలంటూ హోంమంత్రి అమిత్ షాను కోరారు. అమిత్ షా సూచనలతో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ పోలీసులను తక్షణమే పరిస్థితిని అదుపులోకి తేవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Post a Comment
Your Comments Please: