తెలంగాణ సర్కారు మీద దాదాపు 3, 4 ఏళ్లుగా పాత్రికేయ యుద్ధం చేస్తున్న తీన్మార్ మల్లన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులు తనను టార్గెట్ చేశారని, తన ప్రతి కదలిక పైనా నిఘా ఉంచారని, తనకే కాకుండా తన బంధువులకు, తన సన్నిహితులకు సైతం పోలీసులు ఫోన్లు చేసి ఇబ్బందిపెడుతున్నారని ఫిర్యాదు చేశారు. కనుక తనపై కొనసాగుతుున్న ఈ నిఘాను ఎత్తివేసి, ప్రైవసీకి భంగం కలిగించకుండా తెలంగాణ పోలీసులను ఆదేశించాలని ఆ లేఖలో కోరారు.
ఇటీవల జరిగిన హుజూర్ నగర్ బైఎలక్షన్లో మల్లన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అంతకుముందు, ఆ తరువాత, ఇటీవలి కాలంలో కూడా మల్లన్న తెలంగాణ సర్కారులో జరుగుతున్న రెవిన్యూ అక్రమాలను వివిధ సందర్భాల్లో వెలుగులోకి తీసుకొచ్చారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక వేధింపుల అంశాన్ని స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. తాను ఇలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నందుకే తనపై పోలీసు వేధింపులు కొనసాగుతున్నాయని మల్లన్న చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ చానల్లో పనిచేస్తున్న మల్లన్న తన యూ-ట్యూబ్ చానల్ ద్వారా కూడా తన వ్యూయర్స్ కి ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలపై ప్రత్యేక కథనాలు ఇస్తున్నానని అందుకే తనకు పోలీసులు మాటిమాటికీ ఫోన్లు చేసి, ఎక్కడున్నానో ఆరా తీస్తున్నారని, తన ప్రైవేటు కార్యకలాపాలను కూడా ఆరా తీస్తున్నారని, ఇది తనకెంతో ఇబ్బందికరంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.
వీ6లో తీన్మార్ వార్తల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న మల్లన్న గతంలో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆశించి భంగపడ్డారు. అక్కడి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికే పెద్దపీట వేస్తూ అనేక ఎక్స్ క్లూసివ్ న్యూస్ అందిస్తూ వస్తున్నారు. మీడియాలో ఇంత పాపులారిటీ సంపాదించుకున్న మల్లన్న ఇటీవల హుజూర్ నగర్ ఎన్నికలో మాత్రం పర్ఫామెన్స్ చూపించలేకపోయారు. మరోవైపు మల్లన్న కూడా జర్నలిస్టుగా తనకున్న మీడియా పాపులారిటీని ఉపయోగించుకొని ప్రైవేటు ల్యాండ్ సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Photo Credit: Manalokam
Comments
Post a Comment
Your Comments Please: