కరోనా దెబ్బకు వలస కూలీలు విలవిల్లాడిపోతున్నారు. బుక్కెడు బువ్వ కోసం, పూట గడవకపోయినా కనీసం పిల్లలకైనా కాస్తోకూస్తో మంచి చదువులు దొరుకుతాయన్న ఉద్దేశంతో వందల కిలోమీటర్లయినా భారం అనకుండా పట్నం వెళ్లిన కూలీలు వీరు. ఇప్పుడు ఇల్లు చేరుకునేందుకు చుక్కలు చూడాల్సి వస్తోంది. దేశమంతా ఇదే పరిస్థితి. మొన్న ఢిల్లీ నుంచి పక్క రాష్ట్రాలకు తిరిగి వెళ్లేందుకు గుమిగూడిన జనంతో ఆనందవిహార్ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఎంత జనం వస్తారో.. అలా కనిపించింది ఆ జనాన్ని చూస్తే. దేశం లాక్ డౌన్ అయిన వారం తరువాత కూడా ప్రభుత్వాలు కూలీ జనం విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ దృశ్యం ద్వారా తెలుసుకోవచ్చు.
ఇక దేశ రాజధాని నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్న కేరళ, తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. తెలంగాణ విషాయనికే వస్తే ఎటూ 100, 200 కిలోమీటర్లకు పైబడ్డ దూరం నుంచే గాక... ఒడిశా, బీహార్, యూపీ, కోల్ కతా, కర్నాటక వంటి పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో కూలీలు బతుకుదెరువు కోసం వచ్చారు. వారంతా ఇక్కడే స్లమ్ ఏరియాల్లో, సిటీ ఔట్ స్కర్ట్స్ లో గుడిసెలు వేసుకొని లేదా ఓపెన్ ప్లేస్ లలో గుడారాలు వేసుకొని బతుకుబండి లాగిస్తున్నారు. వీరిలో కొందరైతే కేవలం పిల్లల చదువుల కోసమే వచ్చినవాళ్లు కూడా ఉండడం విశేషం. రోజంతా ఏదో కూలీ పని చేసుకొని సాయంత్రం అయ్యాక తిండిగ్రాసం కొనుక్కొని నివాసం చేరుకుంటారు. అలాంటివారి పరిస్థితి ఎటూ కాకుండా పోయింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15 కిలోల బియ్యం, కిలో పప్పు, ఖర్చుల కోసం 1500 రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించాయి. అయితే ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొట్ట కూటికి సరిపోతాయమే కానీ... సాధారణ ఖర్చుల కోసం ఆ 1500 ఏ మూలకూ సరిపోవు. ఈ క్రమంలో ఇంటిఅద్దె చెల్లించడం అనేది ఈ చిన్నజీవులకు అతిపెద్ద సవాలుగా మారుతోంది. ఇంటి యజమానులు ఫస్టు తారీఖు రాగానే అద్దె కట్టకపోతే వేధింపులు మొదలుపెడతారు. ఒక్క రెండు రోజులైనా ఆగని యజమానులు హైదరాబాద్ లో కోకొల్లలు. అతికొద్ది మంది మాత్రమే అర్థం చేసుకునే యజమానులుండడం విశేషం. ప్రభుత్వాలు మూడు నెలల వరకు ఇంటిఅద్దె విషయంలో రిలీఫ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినా.. దాని అమలు విషయంలోనే ఈ వలస కూలీలకు నమ్మకం కుదరడం లేదని వారి మాటల్ని బట్టి తెలుస్తోంది.
(కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు, ట్రాఫిక్ సిబ్బంది బావుపేట నుండి ఒరిస్సాకు వెళ్తున్న కూలీలకు ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తున్న దృశ్యం. రాజస్థాన్ సేవా సంస్థ, రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో ఇది జరిగింది.)
స్థానిక ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు తిండి, వసతి ఏర్పాట్లకు ఉపక్రమించినా.. అవి వలస కూలీల తాకిడికి ఏమాత్రం సరిపోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ సక్సెస్ కావాలంటే ఎక్కడివారిని అక్కడే ఉంచాలి. అది జరగాలంటే.. వారు కదలకుండా చేసే నమ్మకం కలిగించాలి. ముఖ్యంగా ఇంటిఅద్దెలతో పాటు రాబోయే 3 నెలల వరకు వెసులుబాటు కల్పించే ఏర్పాట్లు చేయాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. పాలక ప్రభుత్వాలు ఈ సూచనలు ఎంతవరకు అమలు చేస్తారో చూద్దాం.
Comments
Post a Comment
Your Comments Please: