రామాయణం లాంటి మహా ఇతిహాసంలో కొన్ని అపరిపక్వమైన అల్లికలు, జాతి నిందాపూర్వక వ్యాఖ్యానాలు కాలక్రమంలో చేరిపోయాయి. కొంచెం మనసు పెట్టి ఆలకిస్తే వాటి మూలాలను బట్టబయలు చేయొచ్చు. అలాంటి ఒక అనుమానమే ప్రస్తుతం డీడీ భారతిలో వస్తున్న రామాయణాన్ని వీక్షించడం ద్వారా తీరింది. అది నా లాంటి జిజ్ఞాసువులు ఎందరికో ఉపయోగపడుతుందని రాయాలనిపించింది.
జాతి నింద ఏముంది?
తెలుగువాడికి తెలిసిన రామాయణంలో సీతమ్మను అడవికి పంపిన ఘటన అపరిపక్వంగా ఉంది. ఆ నోటా ఆ నోటా తనదాకా వచ్చిన మాటను ఆధారం చేసుకొని రాముడు సీతను అడవికి పంపినట్టు లవకుశ వంటి రామాయణానికి సంబంధించిన సినిమాల ద్వారా, పాటల ద్వారా విన్నాం. అది నిజమని ఇప్పటికీ భ్రమిస్తున్నాం. "చాకలి నింద" కారణంగా రాముడు సీతను అడవి పంపాలన్న ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడన్నది మనకున్న అవగాహన. ఇప్పుడు కాస్త విడమరచి ఆలోచించే శక్తి ఉన్న టైమ్ లో… 33 ఏళ్ల క్రితం భారత ప్రజల్ని ఉర్రూతలూపిన ఉత్తర రామాయణాన్ని పరిశీలనగా వీక్షించే అవకాశం ఏర్పడింది కాబట్టి.. ఆ అభిప్రాయం తప్పనిపిస్తుంది.
వృత్తాంతాన్ని పరిశీలిద్దాం
రాముడు లంకా విజయం తరువాత పుష్పక విమానంలో అయోధ్య రావడం, పట్టాభిషేకం చేసుకొని రాజ్యపాలన చేస్తున్న క్రమంలో రాజ్యమంతా సుభిక్షంగా ఉంటుంది. రాముడి క్యారెక్టర్ ప్రకారం ఎంత ఔదార్యవంతుడో.. పరిపాలన విషయంలో అంత ధర్మనిష్ట కలిగిన రాజు. నిర్ణయాలు తీసుకోవడంలో తనకు తానే సాటి. తనకు నచ్చడం, నచ్చకపోవడం అనే లౌకికమైన లక్షణాలు, పక్షపాతాలను ఎక్కడా ప్రదర్శించడు. రాజదర్బారుకు ఎవరు వచ్చినా తప్పకుండా రాజదర్శనం లభించి తీరుతుంది. సమస్యను సాకల్యంగా ఆలకించే వెసులుబాటు ఉంటుంది. అలాగే ప్రతిరోజూ రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు గూఢచారులతో రహస్య సమావేశం కూడా రాముడు నిర్వహిస్తాడు. ఆ సమావేశం జరుగుతున్నప్పుడు మరో వ్యక్తి ప్రవేశానికి అనుమతి అస్సలుండదు. రాజ్యపాలన వ్యవహారాలు ఇంత లోపరహితంగా చేయడం రాముడి కర్తవ్యపాలనకు ఓ ఉదాహరణ.
ఈ క్రమంలో ఓరోజు గూఢచారుల ద్వారా తెలుసుకున్న ఓ సంగతి రాముడికి నిద్ర పట్టనివ్వదు. ఓ రోజు రాత్రి ఓ మహిళ అయోధ్య రాజదర్బారు ముందు రాజ దర్శనం కోరుతుంది. అది రాత్రి కాబట్టి అక్కడున్న ద్వారపాలకులు మరుసటి రోజు రమ్మంటారు. ఆమె ఎంతో బతిమాలుతుంది. రాజును తప్పనిసరిగా అప్పటికప్పుడే దర్శించుకోవాలని, లేకపోతే తన సంసారం కూలిపోతుందని ఏడుస్తూ మొర పెట్టుకుంటుంది. అయినా ద్వారపాలకులు ఆమెకు అవకాశం కల్పించరు. దీంతో ఆమె అక్కణ్నుంచి వెళ్లిపోతుంది. ఈ విషయమే ఓ గూఢచారి రాముడికి చెప్తాడు. అప్పుడు రాముడు...
"ఆమెను అప్పుడే నా సముఖానికి ఎందుకు పంపలేదు"?
రాజా.. అది ద్వారపాలకుల విధి నిర్వహణ. నా పరిధిలోది కాదు.
"ఆమె ఎవరు.. ఎక్కడుంటుంది.. ఎందుకోసం వచ్చిందో తెలుసుకున్నావా"?
లేదు.
"ఇప్పుడే వెళ్లు.. ఆమె వివరాలేంటి.. ఆమె సమస్యేంటి.. పూర్తి వివరాలతో నా ముందుకు రా"
రాముని ఆదేశంతో ఆ గూఢచారి 2, 3 రోజులు రాజ్యంలో ఆమె కోసం అన్వేషిస్తాడు. ఆమె ఎవరో కనుక్కుంటాడు. ఆ వివరాల ప్రకారం ఆమె ఒక చాకలి వనిత. ఒక రోజు పుట్టింటి నుంచి వస్తుంటే సాయంత్రం సమయమైంది. చీకటి పడుతోంది. వర్షం కూడా వస్తోంది. ఆ సమయంలో నది దాటడానికి బెస్తవాళ్లు కూడా పడవను కట్టమన్నారు. దీంతో నది దాటే వీల్లేక, వేరే దారి లేక ఆమె ఆ రాత్రి అక్కడే ఒక గుడిసెలో పడుకుంటుంది. తెల్లవారి ఇంటికి వెళ్తే భర్త రానివ్వడు. ఒక రోజంతా అనామక ప్రదేశంలో ఉన్నందువల్ల నువ్వు నాకు అక్కర్లేదంటాడు. నువ్వు అక్కర్లేదంటే నేనెందుకు ఊరుకుంటా.. న్యాయం కోసం రాజును ఆశ్రయిస్తా.. అని చెప్పి అదే రాత్రి అయోధ్య రాజమందిరం తలుపు తడుతుంది చాకలి వనిత. ఆమెకు న్యాయం జరగకుండానే ఆమె వెనుదిరుగుతుంది. ఆమె ఆచూకీ కూడా తెలియదు. ఆ రాజ్యంలో ఎక్కడా కనిపించదు. ఇదే రాముడిని బాగా కలవరపెడుతుంది. అయితే గూఢచారి కూడా పూర్తి వివరాలు చెప్పడం లేదని, ఇంకేదో దాస్తున్నాడని, అదేంటో స్వయంగా తెలుసుకోవాలని రాముడే మారువేషంలో గూఢచారితో కలిసి రాజ్యంలో పర్యటిస్తాడు.
అప్పుడు ప్రజలు ఎలా మాట్లాడుకుంటారో తెలుసుకొని విస్తుపోతాడు. చాలా బాధపడతాడు. రాముని శౌర్య, పరాక్రమాల గురించి చెప్పుకుంటూనే సీతను తెచ్చుకోవడాన్ని ప్రజలు నానావిధాలుగా చెప్పుకుంటారు. అదేంటి? అగ్నిపరీక్ష కూడా జరిగింది కదా అని మారువేషంలో ఉన్న గూఢచారి అడిగితే.. ఆ.. ఆ పరీక్షను ఎవరు చూడబోయారు.. దాన్ని చూసినవాళ్లు పనికిమాలిన కోతులే గదా… ఒక స్త్రీ కోసం రాముడు రాజ్యానికి, వాళ్ల వంశానికి మకిల అంటిస్తాడా.. కళంకం తీసుకొస్తాడా.. ఇదేమి రాజ్యం.. రాజే ఇలా స్త్రీ వ్యామోహంలో కొట్టుకపోతే ఇంక రాజ్యమెక్కడిది.. పరిపాలన ఎక్కడిది.. అని ఒకరంటారు. అలాంటి రాజు ఆ చాకలమ్మకు ఏం తీర్పిస్తాడు.. కాపురం చేయమని భర్తను ఆదేశిస్తే కాపురం నిలబడుతుందా.. భర్త మనసులోనే అనుమానం ఉన్నప్పుడు.. భార్యతో కాపురం చేయించడం రాముడి వల్ల అవుతుందా.. రాజే స్త్రీ వ్యామోహంలో ఉన్నప్పుడు అసలైన తీర్పు ఎలా వస్తుంది.. ధర్మం ఎలా నిలబడుతుంది.. అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్న రాముడికి ప్రజల మీద కూడా ఒకింత కోపం, అసహనం వస్తుంది. రాజు పట్ల ఇంత నిర్దయగా ఉంటారా.. రాజు చేస్తున్న త్యాగాలను కూడా ప్రజలు గుర్తించరా.. అని వాపోతాడు. వాళ్ల మాటల్ని రాముడు తొలుత పట్టించుకోలేదు. సీతతో కూడా పూర్తి వివరాలు పంచుకోలేదు. కానీ భర్త ఏదో విచారంలో ఉన్నాడని మాత్రం సీత గ్రహించి అడుగుతుంది. విషయం అన్యమనస్కంగా, అసంపూర్ణంగానే చెప్తాడు. ప్రజల మాటలు పట్టించుకోవాల్సిన పని లేదని సీతకు రాముడే చెప్తాడు. అప్పుడు సీత మాత్రం.. ఇక్ష్వాకు వంశానికి ప్రజలే దేవుళ్లు. ప్రజలే ధర్మదేవతలు. వారేమనుకుంటున్నారో గ్రహించి పరిపాలన చేయకపోతే మీ వంశ ప్రతిష్టకు భంగకరమని చెప్తుంది. కానీ రాముడిలో మునుపటి ప్రశాంతత లేదు. తిండి సహించడం లేదు. వ్యాకులంగా ఉంటున్నాడు. ఇలా 2, 3 రోజులు గడిచిన తరువాత రాజ్యంలో అసలేం జరుగుతుంది.. రాముడే స్వయంగా మారువేషంలో వెళ్లొచ్చాక ఇలా మారిపోయాడు కదా.. మరి రాముడేం విన్నాడు.. ఇలా ఆలోచించిన సీత.. తను కూడా రహస్యంగా తన చెలికత్తెను పంపుతుంది. రాజ్యంలో ప్రజలేం అనుకుంటున్నారో స్వయంగా వింటుంది. అప్పుడు నిర్ఘాంతపోవడం సీత వంతవుతుంది.
అటు రాముడు.. తన మనోవ్యథను తీర్చుకునేందుకు కులగురువైన వశిష్టుడిని ఆశ్రయిస్తాడు. మనసు వ్యాకులంగా ఉందంటాడు. అందుకు వశిష్టుడు.. మనసు వ్యాకులంగా ఉందంటే నీలో భయం ప్రవేశించినట్టు లెక్క. మనకు ఇష్టమైనదేదో కోల్పోవాల్సి వస్తే భయం కలుగుతుంది. రాజైనవాడు దేనికీ భయపడకూడదు. అంటే తనకు భయాన్ని కలిగించేదాన్ని, పరోక్షంగా తాను ఇష్టపడుతున్నదాన్ని త్యజించాలి. అప్పుడే గంభీరంగా ఉండగలడు. రాజ్యభారం నిర్వహించేటప్పుడు మనసును ఏ అంశాలు కూడా ఆవహించరాదు అంటాడు. దీంతో రాముడి ప్రశ్నకు జవాబు దొరికినట్టయింది. ప్రశాంత చిత్తంతో వెనుదిరుగుతాడు.
దీన్నిబట్టి రాముడు ఒక చాకలి మాటలు పట్టుకొని సీతను అడవికి పంపాడన్నది కేవలం అపోహ మాత్రమే. గూఢచారితో కలిసి అనేక కూడళ్లలో రహస్యంగా ప్రజల అభిప్రాయం సేకరిస్తాడు రాముడు. అలా ప్రజల్లో ఎక్కువ భాగం రాజుపై నిందాపూర్వక వ్యాఖ్యలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. సీతను త్యజించడానికి ససేమిరా అంటాడు. ధర్మానికి నిలువెత్తు రూపమైన రాముడికి... వశిష్టుడి దగ్గరే క్లారిటీ వస్తుంది. అయితే ఇలాంటి తప్పుడు ఉపాఖ్యానాల వల్ల ఒక వర్గం ప్రజలు తరతరాలు, వారి జీవితకాలం అపరాధ భావంతో గడపాల్సి వస్తుంది. ఆల్రెడీ గడుపుతున్నారు కూడా. తాము ఎంతో ఆరాధించే రాముణ్ని, సీతను.. తమ జాతివాడే అడవికి పంపాడా అని నొచ్చుకోవాల్సి వస్తోంది. కానీ వాస్తవం వేరు.
అలాంటిదే మరోటి
మన తెలుగు సినిమాలు ఇంత అపరిపక్వంగా ఉంటాయా అనిపించే సీన్ ఇది. రామ, లక్ష్మణులు, సీత అరణ్యవాసంలో ఉన్నప్పుడు రావణుడు సీతాపహరణం కోసం ఋషి రూపంలో వచ్చే సమయంలో మాయలేడి రావడం.. సీత అది కావాలని కోరడం.. అందుకోసం రాముడు బయటికి వెళ్లడం.. హా సీతా, హా లక్ష్మణా అని రాముడి గొంతు వినిపించడం.. మనందరికీ తెలిసిందే. అప్పుడు సీత లక్ష్మణుడిని తొందరపెడుతుంది. రాముుడు ఆపదలో చిక్కుకున్నాడు.. త్వరగా వెళ్లి అన్నను కాపాడుకొని తీసుకురా అని వేడుకుంటుంది. కానీ లక్ష్మణుడు నిరాకరించడం.. అన్నకు ఏమీ కాదు.. ఇదేదో రాక్షస మాయ తల్లీ.. మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పడం మనకు తెలుసు. ఈ వాదోపవాదాల నడుమ.. సీత ఒక స్థాయికి మించి పరుషంగా మాట్లాడుతుందని, అన్న భార్యను ఆశిస్తున్నావు కాబట్టే.. అన్న రక్షణ కోరుకోవడం లేదని సీత అంటుందని మనం విన్నాం. ఇప్పటికీ దాన్నే ప్రామాణికంగా చెప్పుకుంటున్నాం. కానీ అంత అపరిపక్వత, అశ్లీలత, అనాగరికత లక్ష్మణుడిలో గానీ, సీతలో గానీ ఎక్కడా కనిపించవు. రాముణ్ని కాపాడుకొని రావాలన్న ఉద్దేశంతో లక్ష్మణుడిని పిరికివాడివని, ఇక్ష్వాకు వంశంలో పుట్టే అర్హత నీకు లేదని, నీ శౌర్య-పరాక్రమాలు ప్రదర్శించే సమయం వచ్చినా నిన్ను పిరికితనం ఆవహించిందని… ఇలా రెచ్చగొడుతుంది సీత. అసలే కోపం, ఆత్మగౌరవం లక్ష్మణుడికి చాలా ఎక్కువ. ఆమె మాటలు భరించలేక.. అయినా బాధ్యత మరువక బాణంతో లక్ష్మణరేఖ గీసి మరీ వెళ్తాడు. ఆ తరువాతేం జరిగిందో అందరికీ తెలిసిందే.
చివరిగా...
రామాయణం లాంటి ఇతిహాస గాథల్ని తెరకెక్కించినవారికి… ఈ సామాజిక దృష్టి లేపోవడం వల్ల అద్భుతమైన, అమలినమైన పాత్రలకు కూడా మాలిన్యం అంటుతుంది. ఇక్కడ ఒక చాకలి కారణంగా సీతను పంపినట్లు చెప్పడం వాస్తవ దూరం. అలాగే సీత, లక్ష్మణుడి పట్ల అనుచితంగా మాట్లాడిన సందర్భం అహేతుకం. అలాగే రామాయణంలో శంబూకుని వధ అనే ఘట్టాన్ని కూడా సరైన దృక్కోణంలో చూడాల్సి ఉంది. రాముడి లాంటి ఏమాత్రం తొందరపాటు లేని క్యారెక్టర్.. శంబూకుణ్ని అకారణంగా ఎందుకు చంపుతుంది.. చంపింది వాస్తవమని తెలుసు.. అందుకు రాముడు క్షమాపణ కూడా చెప్పాడని విన్నాం. అయితే ఇది ఎంతవకు నిజం.. ఈ ఘటనలో కూడా మన చూపుకు అందని కోణాలేవైనా ఉన్నాయా.. పరిశీలించాల్సి ఉంది. దైవ వశాన రామాయణాన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి.. దీని మీద వివరణ ఇచ్చే అవకాశం లభించింది. థ్యాంక్స్.
Photos: timesofindia, swarajya
Comments
Post a Comment
Your Comments Please: