Photo Credit: Shiksha.com
సామాజిక దూరాన్ని పూర్తి నిక్కచ్చిగా అమలు చేస్తేనే కరోనా వైరస్ ను శాశ్వతంగా నిర్వీర్యం చేయగలమని, పరిమిత దినాల పాటు లాక్ డౌన్ పాటించి ఆ తరువాత పాత పద్ధతుల్లోనే ఉంటామంటే కుదరదని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు నిర్వహించిన తాజా అధ్యయనం చెబుతోంది. హార్వర్డ్ యూనివర్సిటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇమ్యూనాలజీ అండ్ ఇన్పెక్షియస్ డిసీసెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు ఎం.కిస్లర్, యోనాతన్ హెచ్. గ్రాడ్ అనే ఇద్దరు ప్రొఫెసర్లు కరోనా విజృంభణ, వ్యాప్తి, దాని జీవితకాలంపై అధ్యయనం చేశారు.
వైరస్ సోకిన వ్యక్తి కేవలం 14 రోజులో, లేక 21 రోజులో క్వారంటైన్ లో ఉన్నంతమాత్రాన వైరస్ పూర్తిగా పోవడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు మందు గానీ, టీకా గానీ రానందువల్ల అది రావడానికి నెలల నుంచి ఏళ్లు కూడా పట్టే అవకాశం ఉన్నందువల్ల వైరస్ వ్యాప్తి జరగకుండా చూడడమే మార్గం తప్ప.. పాజిటివ్ బారిన పడి కోలుకున్న వ్యక్తిలో వైరస్ లేనట్టు భావించరాదని హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 పై పనిచేసే మందుకోసం ఇప్పుడే పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి.. అది రావడానికి చాలా టైమ్ పడుతుంది. దాదాపు ఏడాది నుంచి 2 ఏళ్లయినా కావచ్చని పలువురు వైద్య నిపుణులు ఇప్పటికే చెప్పడాన్ని గమనించాలి.
అయితే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెబుతున్నదాని ప్రకారం వైరస్ సోకిన వ్యక్తి రోగ నిరోధక శక్తి కారణంగా అది ఉన్నట్టు కనిపించకపోవచ్చు. కానీ బతికే ఉంటుందని వారు అప్రమత్తం చేస్తున్నారు. అది సోకిన వ్యక్తికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే వెంటనే బయటపడుతుంది. అంతేకాదు.. సంపూర్ణ ఆరోగ్యవంతుడికి సోకినా అతని రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని వారంటున్నారు. అలాగే ఒకసారి వైరస్ బారినపడిన వ్యక్తి కోలుకున్నట్టు కనిపించినా కూడా అతను వైరస్ వాహకంగానే కొనసాగుతాడని వారు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వైరస్ ను సమూలంగా నిర్మూలించాలంటే టీకా మందు గానీ, ట్రీట్ మెంట్ గానీ వచ్చేదాకా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందేనని వారంటున్నారు. వారి అంచనా ప్రకారం ఎక్కువలో ఎక్కువ 2024 వరకు సామాజిక దూరాన్ని అవలంబించి తీరాలి. వైరస్ చనిపోయినట్టు లేదా నిర్వీర్యమైపోయినట్టు కనిపించినా మనిషి రోగ నిరోధక శక్తిని బట్టి, మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి అది పునరుత్తేజమవుతుందని, ఆ వైరస్ మోస్తున్న వ్యక్తి రోగ నిరోధక శక్తిపై, ఆరోగ్య వ్యవస్థపై దాడి చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే... ఇటీవల కొందరికి నెగటివ్ వచ్చిన వ్యక్తికి సైతం పాజిటివ్ తేలడం, అలాగే పాజిటివ్ గా తేలి క్వారంటైన్ లో కోలుకొని నెగిటివ్ వచ్చినవారికి సైతం మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ గా రావడాన్ని గమనించాలి.
2022 వరకు సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే
హార్వర్డ్ శాస్త్రవేత్తల హెచ్చరికల ప్రకారం ప్రపంచమంతా 2022 వరకు సామాజికదూరాన్ని కచ్చితంగా పాటించాలి. అంటే వైరస్ ను చంపే ట్రీట్ మెంట్ గానీ, టీకా గానీ వచ్చేదాకా అన్నమాట. ఈ లోపు ప్రపంచమంతా ఒక కొత్త పంథాలోకి వెళ్లిపోవడం ఖాయం. ముుఖ్యంగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం అనేది గతకాలపు అలవాటుగా మారిపోతుంది. భారతీయ సంప్రదాయ నమస్కారం లేదా తల వంచి విష్ చేయడం లాంటివే అలవాటుగా మారతాయి. ఆఫీసులు, పని ప్రదేశాల్లో కొత్త కల్చర్ ఊపిరి పోసుకుంటుంది. పక్కపక్కనే పనిచేసే డెస్కుల మధ్య దూరం పెరుగుతుంది. పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థుల్ని కుక్కేసి బోధించే పద్ధతులకు కాలం చెల్లుతుంది. మరోవైపు సాధారణ అకాడమిక్ ఎడ్యుకేషన్ కూడా ఆన్ లైన్ లో అడుగుపెట్టి విద్యార్థులకు, లెక్చరర్లకు అదే అలవాటుగా మారుతుంది. మన దగ్గర ఇప్పటికే నారాయణ, శ్రీచైతన్య వంటి పెద్ద కాలేజీలు ఆన్ లైన్ ఏర్పాట్లు చేస్తుండటాన్ని గమనించాలి. శుచి-శుభ్రతకు అమిత ప్రాధాన్యం పెరుగుతుంది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేస్తే లోపలేసే కొత్త చట్టం రావడాన్ని గమనించాలి. విదేశీ ప్రయాణాలు, రాకపోకల్లో తరచుదనం తగ్గుతుంది. విమానాల్లోనే కాదు.. బస్సులు, రైళ్లలో కూడా సీటింగ్ అరేంజ్ మెంట్స్ మార్చుకోవాల్సి వస్తుంది. కొనుగోళ్లు, అమ్మకాలను పెంచుకునే బిజినెస్ టూర్లకు బ్రేక్ పడుతుంది. మనుషులు కిక్కిరిసి ఉండే మురికివాడలు, ఒకే రూఫ్ కింద 3 తరాలు కాపురాలుంటున్న ఓల్డ్ సిటీ లాంటి ప్రదేశాలపై కొత్త నిబంధనలు తీసుకురావాల్సి ఉంటుంది.
ఇలా 2022 వరకు సోషల్ డిస్టెన్స్ ను స్ట్రిక్టుగా పాటిస్తేనే కరోనా వైరస్ నిర్వీర్యమవుతుంది. లేకపోతే ఏదొక స్థాయిలో నిద్రాణంగా ఉన్న వైరస్ కాస్తా... 2024 వరకు మళ్లీ పంజా విసిరే అవకాశం ఉందనేది హార్వర్డ్ శాస్త్రవేత్తల అంచనా. వారి హెచ్చరికను వెంటనే అమలు చేస్తే ఆహార అలవాట్ల దగ్గర నుంచి వ్యాపార వ్యవహారాల దాకా మానవ జీవన శైలి మొత్తం మారిపోతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
Also Read: తెరమీదికొస్తున్న పాత సంప్రదాయాలు ఇవే
నెగెటివ్ వచ్చినా మరణం తథ్యమేనా?
Comments
Post a Comment
Your Comments Please: