కరోనా విజృంభణతో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న అనాథలు, పేదలు, వృద్ధులు, బిచ్చగాళ్లకు నేనున్నానంటూ ముందుకొచ్చింది మాతృభూమి ఫౌండేషన్. ఎంబీఎఫ్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ విధించిన రోజు నుంచి అంటే నెల రోజులుగా ఆహార పదార్థాల పంపిణీ నిరాటంకంగా చేస్తున్నామని ఆ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ కోటర్ కిరణ్ చెప్పారు. శనివారం గచ్చిబౌలి, ఇందిరానగర్ బస్తీలో 60 మందికి ఆహార సామగ్రి అందజేశారు. అలాగే మే5 వరకు ఆకలితో ఉన్నవారికి భోజన సదుపాయాలు సమకూరుస్తామని చెప్పారు. గడిచిన 30 రోజుల్లో దాదాపు 30 వేల మందికి భోజనం, మరో 500 మందికి ఆహార సామగ్రి అందించినట్లు చెప్పారు.
లాక్ డౌన్ కారణంగా బాగోగులు చూసే దిక్కులేని బిచ్చగాళ్లకు, వృద్ధులకు భోజన సదుపాయాలు కూడా చేస్తున్నామని కిరణ్ చెప్పారు. మాతృభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నామని చెప్పారు. తమ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం, రాజమండ్రి, కృష్ణా, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు జిల్లాల్లో... అలాగే తెలంగాణలోని వికారాబాద్, నల్గొండ, ఖమ్మం, హైద్రాబాద్ జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.
తమ ఫౌండేషన్ విద్యాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, సామాజిక అవసరాలు గుర్తించి చాలామంది అనాథలైన ముసలివాళ్ళకు ఆహారం అందిస్తోందన్నారు. అలాగే తమ ప్రతినిధులు ఉన్న జిల్లాల్లో ఎక్కడైనా సరే సమాచారం అందినట్లయితే వారికి తమ వంతుగా భోజన సదుపాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇది తమ ఉదారతను చాటుకోవడం కోసం కాకుండా... ఇలాంటి సామాజిక విపత్తులు తలెత్తినప్పుడు అందరూ సహకరించుకొని ముందడుగు వేసినట్లయితే కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కోగలమని కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ఫౌండేషన్ ఒక వ్యవస్థగా కాక సమాజమే కుటుంబంగా భావించి సేవ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మట్ట సురేష్, మాతృభూమి ఫౌండేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: