Photo Credit: HansIndia
కరోనా విజృంభణ అనేది లాక్ డౌన్ పొడిగించాలన్న డిమాండ్ ను ముందుకు తీసుకొస్తే... రెక్కాడితే డొక్కాడని కూలీలు, వలస కార్మికుల్లో మాత్రం నైరాశ్యాన్ని పెంచింది. ఇప్పటికే పనుల్లేక, పస్తులు ఉండలేక అన్నమో రామచంద్రా అంటున్న వలస కూలీలకు లాక్ డౌన్ పొడిగింపు అనేది అశనిపాతంలా తాకింది. అందుకే అటు ముంబైలోని బాంద్రాలో వేలాది మంది ఒక్కసారిగా బయటికొచ్చారు. బెంగళూర్, జైసల్మేర్, పుణే.. ఇలా దేశం నలుమూలలా వలస కార్మికులు రోడ్డెక్కారు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా వేలాది మంది రోడ్డెక్కారు. సొంతూళ్లకు వెళ్లి ఉన్నదేదో తిని కాలం గడుపుదాం అనుకొని పిల్లాపాపలతో, తట్టాబుట్టలతో బయల్దేరారు. అయితే వారు అలా బయల్దేరడం అనేది కేవలం వలస కూలీల ఫెయిల్యూర్ కాదు. కరోనా అనేది వారి వ్యక్తిగత సమస్య కూడా కాదు. ఇది మనందరి కలెక్టివ్ సమస్య. ఇది సామాజిక సమస్య. ఇది సామూహిక సమస్య. ఇందులో ఏ ఒక్కరు ఫెయిలైనా అందరి ఫెయిల్యూరే. కాబట్టి వలస కూలీలు భరోసా కోల్పోవడం అనేది అందరి ఫెయిల్యూర్.
Also Read: ఎవరి తలరాతలు మార్చడానికి ఈ గీతలు?
అగ్గితోటి కడగడమే అందరికీ క్షేమకరం
ఈ స్పృహ ఎందుకనో మనలో చాలా మంది పెద్దవాళ్లకు, యజమానులకు రావడం లేదు. మన రాజకీయ నాయకులకు కూడా ఆ ఫీలింగ్ ఉన్నట్టు పెద్దగా కనిపించడం లేదు. సాయమైతే చేస్తున్నారు కానీ... మొక్కుబడిగా చేస్తున్నారు. అందువల్లనే కదా.. దూరప్రాంతాల వలస కార్మికులు విసుగెత్తి వెళ్లిపోవడం ప్రారంభించారు. లాక్ డౌన్ కొనసాగుతున్న టైమ్ లోనే వారికి బతుకు మీద భరోసా కల్పిస్తే వాళ్లు రోడ్లెక్కుతారా... ఎక్కరు కదా. సుదూర రాష్ట్రాల నుంచి భవన నిర్మాణరంగంలో కూలీలుగా వచ్చినవారు.. వారి సొంత ఖాతాల్లో డబ్బు పోగేసుకునేందుకే వచ్చారా... లేదు కదా. వారి శ్రమలో మన రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి ఉంది కదా. మన హైదరాబాద్ షాన్ లో వారి చెమట చుక్కల నిషానా కూడా ఉంది కదా. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బల్లగుద్ది మరీ చెప్పారు కదా. అయినా ఇంప్లిమెంటేషన్ కు వచ్చేసరికి ఫెయిలయ్యాం.
హైదరాబాద్ గురించి, ఇక్కడి సంస్కృతి గురించి చాలా గొప్పగా చెప్పే చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ గానీ... పెద్దపెద్ద ఐటీ కంపెనీలు గానీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ గానీ... వలస కూలీల గురించి పట్టించుకున్న దాఖలాల్లేవు. ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడుతున్న పోలీసులకు చాలా సంస్థలు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు పోటీలు పడి పంపిణీ చేశారు. వారికి ఇవ్వకూడదని చెప్పడం లేదు. కానీ ఎవరూ పట్టించుకోని వలస కూలీలను పట్టించుకుంటే వారికి తెలంగాణ మీద, తెలంగాణ సర్కారు మీద భరోసా కుదిరేది కదా. పోలీసులకు, డాక్టర్లకు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు. ప్రభుత్వాలు కూడా వారికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాయి. మరి వేలాది మంది వలస కూలీలకు ఎవరున్నారు.. వారిచేత పని చేయించుకున్న యజమానులే కదా. మరి వాళ్లయినా వలస కూలీలను పట్టించుకోకపోతే వారికి దిక్కెవరు... ఆఖరికి ఈ సొసైటీ మీద, డబ్బున్న పెద్దోళ్ల మీద వారికి వ్యతిరేక భావం కలగితే ఆ తప్పెవరిది... ప్రపంచ సమాజం ఉమ్మడిగా ఎదుర్కొంటున్న కరోనా అనే విషమ పరీక్షలో ఉన్నోడు, లేనోడు అందరూ సమానమే కదా.
వారి కోసం ఎక్కడి యజమానులు అక్కడే, వారి సైట్లలోనే కాస్త దూర దూరంగా షెడ్లు వేసి, భోజనాలు అరేంజ్ చేస్తే పోయిందేముంది.. శక్తి సరిపోకపోతే ప్రభుత్వం కూడా ఉంది కదా... చేయూతనివ్వడానికి. అటు ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిందనే చెప్పాలి. అన్నీ చేయడానికి ప్రభుత్వ సిబ్బంది ఎలాగూ సరిపోదు. ఇలాంటి పెనువిపత్తులో ఉడతా భక్తిగా పౌరసమాజం అంతా చేతనైనంత చేయాల్సిందే. అందుకోసం కాస్త ముందుగానే మేల్కొని వలంటీర్లను రిక్రూట్ చేస్తే మన కూలీలకు ఇలాంటి దురవస్థ తప్పేది. కానీ ఆ నిర్ణయం తీసుకోవడంలో మన సర్కారు తాత్సారం చేసింది. పక్కనున్న ఆంధ్రా సర్కారు వలంటీర్లను నియమించి పనిలో దూసుకుపోతుంటే.. కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉన్న తెలంగాణ సర్కారు మాత్రం చాలా ఆలస్యంగా కళ్లు తెరిచింంది. కనీసం ఇప్పుడైనా వలంటీర్ల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అవసరమైనంత మేర చాలా తొందరగా వలంటీర్లను రిక్రూట్ చేసుకొని వలస కార్మికులు, కూలీల సమస్యను తీర్చాలి. వారికి కనసీ వసతులు సమకూర్చాలి. కరోనా విసిరిన సవాలును సామూహికంగా ఎదుర్కోవాలి.
Comments
Post a Comment
Your Comments Please: