Photo: Job Vacancy
కేంద్రప్రభుత్వం గానీ, రాష్ట్రాల ప్రభుత్వాలు గానీ కరోనా పేరుతో ప్రకటిస్తున్న రోజువారీ పాజిటివ్ కేసుల లెక్కలు నమ్మకానికి బదులు అపనమ్మకాన్ని పెంచుతున్నాయి. క్వారంటైన్ చేసినా, ఐసోలేషన్లో ఉంచినా, కంటైన్మెంట్ తో కట్టడి చేసినా... కరోనా అనే ఉపద్రవం రోజురోజుకూ పెరుగుతుందే తప్ప ఆగిన దాఖలాలు ఇప్పటికైతే కనిపించలేదు. ఉదాహరణకు ప్రభుత్వం చెప్పిన లెక్కల్నే పరిశీలిద్దాం. మన దేశంలో మిలియన్ ప్రజలకు (10 లక్షలకు) 268 మందిని పరీక్షిస్తున్నారు. ఆ మేరకు రోజుకు దాదాపు 1000 కొత్త కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో రోజువారీ సగటు పరీక్షలు 375. ఆంధ్రాలో రోజువారీ సగటు పరీక్షలు 539. మరణాల రేటులో కూడా జాతీయ సగటు కన్నా తెలంగాణ సగటు భేషుగ్గా ఉందంటూ, ఆంధ్రా సగటు భేషుగ్గా ఉందని మనకు మనమే సంతృప్తి పడుతున్నాం. అది మన అల్పత్వానికి పరాకాష్ట. అదే మన దేశంలో టెస్ట్ కిట్లు సరిపడినన్ని ఉండి ఇంకా ఎక్కువ పరీక్షలు నిర్వహించినట్టయితే ఎక్కువ కేసులు బయటపడతాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ పరీక్షలకు 311 మంది చొప్పున పాజిటివ్ కేసులు నమోదవుతుంటే మన దేశంలో (20 తేదీ నాటికి) మిలియన్ పరీక్షలకు 13 మంది చొప్పున బయట పడుతున్నాయి. ఆ పరీక్షలను ఇంకా పెంచితే రోజుకు కొన్ని వందల్లో, వేలల్లో బయటికొస్తాయి. లాక్ డౌన్ ని గనక నిర్లక్ష్యం చేస్తే ఆ సంఖ్య కాస్తా లక్షల్లోకి వెళ్లడం ఖాయం. ఇప్పుడు కరోనా మన ఇంటి పక్కనే పొంచి ఉందంటే అతిశయోక్తి కాదు. పదులకొద్దీ నర్సులకు, హోంగార్డులకు, పోలీులకు సోకుతూనే ఉంది. మర్కజ్ నుంచి వచ్చినవారి ఇళ్లలో పదులకొద్దీ మంది ఒక్క రోజులోనే పాజిటివ్ గా బయటపడుతున్నారు. అదే జరిగితే... టెస్ట్ లు చేయడం కాదు.. ఇటలీలో జరిగినట్టు బతకగల సంభావ్యత, అవసరం ఉన్న పాజిటివ్ కేసులను గుర్తించి, వారికి మాత్రమే ట్రీట్ మెంట్ ఇచ్చి, మిగతావారిని గాలికి వదిలేేసే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి.
Breaking News: తండ్రి అంత్యక్రియలకు హాజరు కాకండి
ఎక్కడొస్తుంది చిక్కు?
వాస్తవానికి కరోనా విషయంలో ఓవరాల్ గా చూస్తే మన దేశంలోని అన్ని ప్రభుత్వాలు కూడా పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించే పోలీసుల పాత్ర మరువలేనిది. తిట్లు, అవమానాలు, శాపనార్థాలను అన్నిటినీ దిగమింగుతూ కరోనా మీద పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే పోలీసుల్లో, డాక్టర్లలో సహనాన్ని ఎంతకాలం నిలిపి ఉంచగలుగుతాం అన్నది ప్రశ్న. ఎందుకంటే రూల్స్ అతిక్రమిస్తున్నవారితో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించలేకపోతున్నాయి. బాధ్యత లేకుండా రోడ్ల మీదికొస్తున్నవారితో మిగతావారికి పోలీసులు అలుసవుతున్నారు. వైద్యానికి సహకరించకుండా దాడులకు పాల్పడడం ద్వారా డాక్టర్లు అలుసవుతున్నారు. వారిని అటకాయిస్తే పోలీసుల మీదనే దాడులకు పాల్పడుతున్నారు. కరోనాను ఎదుర్కొంటూ.. పాజిటివ్ లుగా మారుతూ ఈ తిట్లు భరించడం పోలీసులకు, డాక్టర్లకు అవసరమా? ఇదే భావన శాంతి-భద్రతల నిర్వాహకుల్లో, ప్రాణదాతల్లో వ్యాపిస్తే ఎలాంటి ఉపద్రవాలకు దారి తీస్తుందో ఊహిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.
ప్రభుత్వాలు మెతకైతే పోలీసులేం చేస్తారు?
పరిపాలన రీత్యా ప్రభుత్వాలు కొన్ని అంశాల పట్ల మెతగ్గా వ్యవహరిస్తున్నాయి. కానీ శాంతిభద్రతలు నిర్వహించే పోలీసులు మెతగ్గా వ్యవహరిస్తే పరిస్థితులు చేయి దాటిపోవడం ఖాయం. ఇదే మొన్న ఢిల్లీలో కూడా రుజువైంది. సీఏఏ నిరసనలకు అవకాశం ఇస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పినప్పుడు కోర్టు మధ్యలో కల్పించుకుంది. న్యాయ నిపుణులతో రాయబారం నడిపింది. వాస్తవానికి అది కోర్టు పరిధిలోని అంశం కాదు. అది ప్రభుత్వాలు మాత్రమే డీల్ చేయాల్సిన వ్యవహారం. ఇక్కడ కూడా ఇదే సూత్రాన్ని పాటించాలి. శాంతిభద్రతల విషయాన్ని పోలీసులకు అప్పగించిన తరువాత ఇక ప్రభుత్వాల జోక్యం, వివిధ వర్గాల సెంటిమెంట్లు, రేపటి రాజకీయ ప్రయోజనాలు అనే అంశాలను పక్కన పెట్టాలి. ఈ విషయంలో రాజీ పడితే అన్ని వర్గాల్లో కూడా అనుమానాలు పెంచి పోషించనవారు అవుతారు. ఆ తరువాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనాలు శూన్యం.
కరోనా చెబుతున్న వాస్తవాలు రోజురోజుకూ భయంకరంగా మారుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల మధ్య అనుమాన బీజాలు పిశాచాలై అశాంతికి దారితీసే ప్రమాదాన్ని కొట్టిపారేయలేం. అయితే కరోనాకు భయపడి ప్రజలుగానీ, పాలకులు గానీ, కార్యనిర్వాహకులు గానీ వివేకం నశించి వివశులైపోయే ప్రమాదం నుంచి ముందుగా బయటపడాలి. మరోవైపు కరోనాను ఆసరా చేసుకొని విశృంఖలంగా ప్రవర్తించే సమూహాలు దేశమంతటా బయట పడుతున్నాయి. మహారాష్ట్రలోని పాలగఢ్ లో జరిగిన అమానవీయ ఘటన ఇందుకు తాజా ఉదాహరణ. ఇలాంటివి ప్రజల మధ్య అనుమానాలు పెంచి, విద్వేషానికి ఊడలు దింపి, ప్రతీకారమే పరమావధిగా చెలరేగిపోయి అరాచకానికి దారితీస్తుంది. ఆపై దాపురించే దారుణ పరిస్థితులను ఎవరూ నియంత్రించజాలరు. అందుకే ఇలాంటివాటిని ప్రభుత్వాలు మొగ్గలోనే తుంచేయక తప్పదు. సంప్రదాయాలకు అతీతంగా రెచ్చిపోయిన ఎవరైనా సరే అప్పటికప్పుడే నియంత్రణలోకి రావాల్సిందే. ప్రభుత్వాల ఆదేశాలు కూడా ఇందుకు అనుగుణంగా ఉండాలే తప్ప.. శాస్త్రోక్తంగా, చట్టబద్ధంగా కోర్టులే చూసుకుంటాయని కూర్చుంటే పరిస్థితులు చేయి దాటిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Post a Comment
Your Comments Please: