Skip to main content

అంతా బానే ఉంది కానీ..


షబ్-ఎ-బారాత్ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియాలో చేసిన సుదీర్ఘ ప్రసంగం మొత్తమ్మీద బాధ్యతాయుతంగానే కనిపించడం చెప్పుకోదగ్గ విశేషం. ముందుగా రాత్రి 9 గంటలకు ప్రసంగం ఉంటుందని డిక్లేర్ చేసినా ఆ సమయాన్ని రాత్రి పదిన్నరకు వాయిదా వేశారు. దీంతో జనరల్ మీడియాలో దానికి పెద్దగా స్పేస్ దక్కలేదు. కానీ దాదాపు ఒక గంట సేపు జరిగిన సోషల్ ఇంటరాక్షన్ కి ట్విిట్టర్ లో భారీ రెస్పాన్స్ కనిపించింది. ట్విట్టర్ లో ఆయనకు 11 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. అందులో నేను కూడా ఒకణ్ని.


వ్యూహాత్మక ప్రసంగంలో మేటిఅసదుద్దీన్ అద్భుతమైన వాక్చాతుర్యం గల వ్యక్తి. ఎలాంటి విషయాన్ని, ఎలాంటి సందర్భాన్నయినా తనకు అనుకూలంగా చక్కగా మలుచుకోవడంలో, బాధ్యతను అవతలి వ్యక్తి మీదికి తోసేయడంలో ఘనాపాటిగా పేరుంది. గురువారం రాత్రి జరిగిన సోషల్ మీడియా ఇంటరాక్షన్ లో తొలి భాగం ఎంతో బాధ్యతగా మాట్లాడిన అసదుద్దీన్.. రెండో భాగానికి వచ్చేసరికి మళ్లీ పాతపాటే పాడారు. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ సపోర్టర్స్ అంతా కూడబలుక్కొని విషం చిమ్ముతున్నారని కడిగిపారేశారు. కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమన్న అర్థం వచ్చేలా పాత వీడియోలను సైతం ఈ సందర్భంగా వినియోగించుకుంటున్నారంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. 


షబ్-ఎ-బారాత్ సందర్భంగా ముస్లింలు ఎలాంటి జీవితం గడపాలో చాలా చక్కగా వివరించారు. తాగుడు మనిషిని నిర్వీర్యం చేస్తుందని, దాని పర్యవసానాలు కుటుంబాన్నే కష్టాల్లోకి నెడతాయంటూ ముస్లిం సమాజానికి ఒక పెద్దన్నలా ఫీలవుతా చెప్పడం విశేషం. అంతేకాదు.. పాన్, గుట్కా వంటివి కూడా నోట్లో వేసుకొని, ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయడం మానుకోవాలని, అది కూడా ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని, తెలంగాణ సర్కారు కూడా దాన్ని నిషేధించిందంటూ ఒక ప్రధాన వర్గం ప్రజానీకానికి చెప్పడానికి ఈ సందర్భాన్ని చక్కగా వినియోగించుకున్నారు. 


ముస్లింలే కారణమా?


భారత్ లో కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమా.. స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో కరోనా ప్రబలడానికి ముస్లింలే కారణమా? అంటూ అసదుద్దీన్ ఎంతో ఆవేదన ప్రకటించడం అర్థం చేసుకోదగిన అంశం. జనవరి 1 నుంచి మార్చి 13 వరకు భారత్ లోకి 15 లక్షల మంది విదేశీయులు వచ్చారని, కేవలం లాక్ డౌన్ ప్రకటించిన తరువాత, అది కూడా తబ్లిగీ జమాత్ కార్యక్రమం వల్లనే వైరస్ వ్యాపించిందన్న ప్రచారం సరికాదన్నారు. నిజమే.. డిసెంబర్ లోనే కోవిడ్-19 చైనాలో దుమారం రేపుతున్నా భారత్ దాన్ని ఓ ప్రపంచ విపత్తుగా చూడలేదు. అసలు ఇండియా ఏం ఖర్మ.. ప్రపంచంలోని ఏ దేశం కూడా దాన్ని ప్రపంచ సమస్యగా చూడలేదు. అందుకే విమాన ప్రయాణాలు నిరాటంకంగా సాగాయి. మన దేశంలో జనవరి చివరలో తొలి కేసు నమోదైంది. అయినా మార్చిలో కూడా విదేశీయుల రాకపోకాలు యథేచ్ఛగా సాగాయి. మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ పాటించాలంటూ 19వ తేదీన ప్రధాని మోడీ బహిరంగ విజ్ఞప్తి చేసేదాకా అసలైన కట్టడి మన దేశంలో అమలే కాలేదు. మోడీ ప్రకటన తరువాతనే జనతా కర్ఫ్యూ, ఆ తరువాత లాక్ డౌన్ కూడా పక్కాగా అమలవుతోంది. ఒక దేశమంతా పూర్తి లాక్ డౌన్ లో ఉండడం అనేది ప్రపంచంలోనే తొలి ప్రయోగం. అదే ఇప్పుడు మన కేసుల సంఖ్యను కంట్రోల్ చేస్తోంది. 


Also Read: బీ అలర్ట్ - రేపు రాత్రి 9 గంటలకు అసద్ భాయి అంతరంగం


                    రెంట్లు తగ్గాలి.. ఫీజులు ఎత్తేయాలి.. సామాన్యుడి సరికొత్త డిమాండ్లు


కాబట్టి ముస్లింల కారణంగానే వైరస్ మన దేశంలోకి వచ్చిందని ఎవరూ భావించాల్సిన అవసరం లేదు. అలా ఎవరూ భావించడం కూడా లేదు. మనసులో గూడుకట్టుకున్న విపరీతమైన ద్వేషభావాన్ని సోషల్ మీడియాలో ప్రకటించుకునేవారు అన్ని వర్గాల్లో ఉంటారు. దానికి కులం, మతంతో సంబంధం లేదు. ఫేస్ బుక్ లో గానీ, వాట్సాప్ గ్రూపుల్లో గానీ వివిధ కులాలకు సంబంధించిన గ్రూపుల్లో కనిపించేది ఇదే. ప్రతి గ్రూపులో ఇద్దరు, ముగ్గురు రెచ్చిపోయేవారు, రెచ్చగొట్టేవారు.. వారిని కంట్రోల్ చేయడానికి అడ్మిన్ లు ఇబ్బందులు పడుతుండడం చూస్తున్నదే. దాన్ని  యావత్ ప్రజానీకం అభిప్రాయంగా చూడడం చాలా తప్పు. అయితే మర్కజ్ కు వెళ్లొచ్చినవారి వల్లనే వైరస్ వ్యాప్తి విజృంభించిందనేది వాస్తవం. ఇదే విషయం అన్ని దశల్లో కూడా రుజువైంది. అయితే వైరస్ వ్యాప్తికి వారు బాధ్యులే తప్ప దోషులు కారు. ఈ స్పృహ ఈ దేశ సామాన్య ప్రజల్లో ఉంది. ఎటొచ్చీ ఆయా వర్గాలకు కొమ్ముకాసే నాయకులకే లేకపోవడం విషాదం. టెస్టులకు సహకరించకపోవడం, అజ్ఞాతాన్ని వీడకపోవడం, స్థానిక అధికారులకు సమాచారం అందించకపోవడం, ఈ లోగా మరింతమందిని వారు కలవడం.. ఇలాంటివి జరిగిపోయాయి. అప్పటికే కరోనా మీద ఎంత ప్రచారం జరగాలో అంతా జరిగింది. ప్రజలందరూ లాక్ డౌన్ పాటిస్తున్న క్రమంలో ఇళ్లకే పరిమితమై ఉన్న కారణంగా ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో అంతటా కూడా వైరస్ వార్తలే తప్ప మరోటి లేదు. దాని అవగాహన ఈ స్థాయిలో ఉన్నప్పుడు కూడా మర్కజ్ నుంచి తిరిగొచ్చినవారు.. హైడింగ్ లో ఉండడం సామాన్య జనానికి ఎలాంటి అభిప్రాయాలు కలిగిస్తుంది. ముస్లింలలో కొంతమందైతే పనిగట్టుకొని దాన్ని వ్యాపింపజేస్తాం అన్నట్టుగా వ్యవహరించారు. వారి మాటలు, ఉపన్యాసాలు రెండు వర్గాల మధ్య అంతరాన్ని ఉద్దేశపూర్వకంగా పెంచేలా ఉన్నాయి. ఇది వాస్తవం కాదా? ఈ  దేశంలోని ప్రధాన సెక్షన్ లో ముస్లింల పట్ల ఒక దురభిప్రాయం కలగడానికి కారణమైనవారిని అసదుద్దీన్ తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అలాంటివారు శిక్షార్హులు కారా? వారిని అరెస్టు చేయాలన్న డిమాండ్ అసదుద్దీన్ ఎందుకు చేయలేదు? ఇండోర్ లో వైద్యసిబ్బందిపై జరిగిన దాడిని ప్రస్తావించి నొచ్చుకున్నారు. అసలు ఇండోర్ దాకా ఎందుకు తెలంగాణలో కూడా అలాగే జరిగింది కదా. బిహార్ లో పోలీసు ఉన్నతాధికారి మీదనే అలాంటి ట్రీట్ మెంట్ జరిగింది కదా. లాక్ డౌన్ అమలు చేస్తున్న తెలంగాణలో కూడా మల్కాజ్ గిరి ఏరియాలో పోలీసుల మీదికే దాడులకు దిగడం మనకు కనిపించింది కదా. పోలీసు దగ్గరి లాఠీ లాక్కుని వారిమీదికే దాడికి ప్రయత్నించడం ఏమిటి? ప్రజలందరికీ వర్తించే రూల్స్ తమకు వర్తించవన్న భావన ఈ దేశ ముస్లింలకు ఎవరైనా ఎక్కిస్తున్నారా? లాక్ డౌన్ పాటించకండి.. పిల్లా, పాపలతో బయటికి రండి అని పిలుపునిచ్చిన కొందరే కదా.. అందరి బుర్రలూ పాడు చేసేది. వారిని కట్టడి చేయాలన్న అంశాన్ని అసద్ ఎందుకు విస్మరించారు?


Also Read: Can India limit religious gatherings?


అంతేకాదు... కరోనా వ్యాప్తి విషయం బయటపడ్డాక నిజాముద్దీన్ లో మత కార్యక్రమం అనుమతి లేకుండానే జరిగిందన్న విషయంపై కేసు నమోదైంది. దానికి బాధ్యుడైన మౌలానా సాద్ ఎందుకు మొహం చాటేశాడు. కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి సహకరించకపోవడం వల్లనే కదా.. మర్కజ్ వెళ్లినవారి వివరాలు తెలుసుకోవడానికి ఇంత టైమ్ పట్టింది? ఇక్కడ బాధ్యతగా వ్యవహరిస్తే ముస్లిం సమాజం ఇంతలా బద్నాం అయ్యేదేనా? తబ్లిగీ జమాత్ ను అనవసరంగా బద్నాం చేస్తున్నారని కూడా అసద్ అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు కోసం కేసు పెట్టిందా.. ఇలాంటి  కామెంట్లు అసద్ లాంటి బాధ్యతాయుతమైన వ్యక్తి చేయాల్సినవి కాదు. అందులోనూ ప్రపంచమంతా ఆపదలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మీద, ఒక సంస్థ మీద కేసు పెట్టినప్పుడు దానికి సహకరించాల్సింది పోయి.. దాన్ని వ్యతిరేకించడం దేన్ని సూచిస్తుంది? అసదుద్దీన్ ప్రసంగంలో కీలకమైన ఇలాంటి అంశాలకు చోటే లోకపోవడం విడ్డూరం. ఇక వైరస్ కు మందు ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుందన్న నమ్మకాన్ని కలిగించిన అసదుద్దీన్.. కమ్యూనల్ వైరస్ కు మాత్రం మందు లేదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. అయితే ఈ ప్రమాదం నుంచి సమాజం బయటపడ్డాక అప్పుడు రాజకీయాలు చేద్దామని, అప్పటిదాకా దీని వ్యాప్తిని అందరం కలిసి ఎదుర్కొందామని చెప్పడం శుభపరిణామం. సహజంగా అసద్ ఉపన్యాసం అనగానే మోడీ మీద వ్యతిరేకత తప్పకుండా ఉండితీరుతుంది. అయితే ఈసారి మాత్రం మోడీ మీద వ్యతిరేకతకు ప్రాధాన్యతను ఇవ్వలేదనే చెప్పాలి. 


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తో...