Photo- GETTY (మానవ సహిత మిషన్ కోసం నాసా సిద్ధమవుతోంది. 2020లో మినీ రోవర్లు పంపాలని నిర్ణయించింది)
ఆస్తులు పోగేసుకోవడానికి, ఆధిపత్యం నిలుపుకోవడానికి సరిహద్దులతో పనేంటి? భూగోళం మీద ఆధిపత్యాన్ని ఎప్పుడో సాధించిన అమెరికా చంద్ర మండలాన్ని కూడా కబ్జా చేసుకోవాలని చూస్తోంది. ప్రపంచమంతా ఇల్లు కదలకుండా కరోనా గురించి కథలుకథలుగా చెప్పుకుంటుంటే... ట్రంప్ ఆలోచన చంద్రమండలాన్ని చుట్టేస్తోంది. చంద్రుడి మీద మైనింగ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు ముహూర్తం కూడా ఖరారైనట్లు ఫోర్బ్స్ వెబ్ సైట్ ఓ కథనాన్ని డొమైన్లో పోస్ట్ చేసింది.
ఆ కథనం ప్రకారం 2024లో ఆర్టెమిస్ 3 (Artemis 3 mission) చంద్రుడి దక్షిణ ధ్రువం మీద కాలుమోపుతుంది. 55 ఏళ్ల క్రితం చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు అడుగుపెట్టినట్టుగానే మళ్లీ 2024లో కూడా అడుగు పెట్టబోతున్నారు. ఈసారి ఒక మహిళా వ్యోమగామి కూడా తొలిసారిగా అడుగు పెట్టి చరిత్ర సృష్టించబోతోంది. అలాగే ఒక మేల్ ఆస్ట్రొనాట్ కూడా ఈ మిషన్లో భాగం పంచుకోబోతున్నారు. నాసా ఇందుకోసం పూర్తి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. అయితే ఈసారి చంద్రమండల యాత్రలో అమెరికా కాకుండా మరో దేశం ఏదీ కూడా భాగం పంచుకోవడం లేదు. ఈ యాత్ర పూర్తిగా చంద్రుడి మీద అమెరికా ఆధిపత్యాన్ని ఖాయం చేసుకునే దిశగానే సాగుతోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
చంద్రుడి మీద నీరు, గాలి, ఇతర ఖనిజాల కోసం అన్వేషణ, అందుకు ప్రయోగాలు కొనసాగుతుండగానే ఆ దిశగా శాస్త్రవేత్తల్ని పంపేందుకు అమెరికా ఆరాటపడటం విమర్శలకు తావిస్తోంది. రోదసిని శాస్త్ర-సాంకేతిక రంగాల్లో ఉపయోగించుకునే 1979 నాటి అంతర్జాతీయ ఒప్పందాన్ని ట్రంప్ ఆదేశాలు ఉల్లంఘిస్తున్నాయంటున్నారు. అసలు అమెరికా ఏనాడూ ఆ ఒప్పందాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని రోదసి ప్రయోగాల పీస్ కమిటీలో 95 దేశాలకు గాను 17 సభ్య దేశాలు మాత్రమే అమెరికాకు అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా అమెరికా ఏకపక్షంగా రోదసిలో ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా అవకాశం లేకుండా పోయింది. అయితే 2015లో ఆమోదం పొందిన ఓ చట్టం ప్రకారం అమెరికా ఏ దేశం నుంచి అనుమతి గానీ, ఆమోదం గానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ చట్టాన్నే అడ్డుపెట్టుకొని ఇప్పుడు ట్రంప్ తాజా ఆదేశాలు జారీ చేయడం విశేషం.
ఈ అధ్యయనం ద్వారా చంద్రుడి మీద షెల్టర్ వేసుకోవడం, షెల్టర్ వేసుకునేందుకు అనువైన ప్రదేశాలు వెదికి పెట్టడం, అక్కడి ఉపరితలాన్ని, దాని కింద ఉన్న పొరలు, వాటి కింద ఉన్న ఖనిజాలను అన్వేషించడం, వాటిని తవ్వి తీసేందుకు ఏర్పాట్లు చేయడం కోసం వ్యోమగాములు బయల్దేరబోతున్నారు. చంద్రుడిపై మానవ నివాసం, శాస్త్ర-సాంకేతిక అంశాల్లో ప్రయోగాలు, ఫార్మాస్యూటికల్స్ వంటి కీలకమైన అంశాలపై అక్కడే ప్రయోగాలు నిర్వహించి, ఉత్పత్తి చేయడానికి రంగం సిద్ధం చేయాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. వ్యోమగాములు ఇచ్చే ఇన్ పుట్స్ తరువాత చంద్రుడి మీద ఉండే ఖనిజాల తవ్వకంపై ఓ అవగాహన ఏర్పడి తుది నిర్ణయానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే చంద్రుడి మీద తవ్వకాలు జరిగితే అది భూమ్మీద ఎలాంటి ప్రభావాలు చూపుతుంది, మానవాళి మరో కొత్త ప్రమాదంలో పడుతుందా అనే అంశాలపై అధ్యయనాలు జరగాల్సి ఉంది. మరి వాటిని అమెరికా ఎంతవరకు పట్టించుకుంటుందో చూడాలి.
News to follow: పట్నంలో అద్దె బాధలు తీర్చిన ఆపద్బాంధవుడు
Comments
Post a Comment
Your Comments Please: