దేశద్రోహం కేసులో బెయిల్ రాకపోతే ముస్లింల పట్ల వివక్ష అవుతుందా?
కౌంటర్ కరెంట్స్ అనే ఒక వెబ్ సైట్ ఉంది. అందులో వేసిన తాజా కార్టూనే ఇది. కరోనా అనే ముద్ర వేసి ముస్లింలను చంపుతున్నట్టుగా మీర్ సుహైల్ ఖాద్రి అనే వ్యక్తి ఈ కార్టూన్ వేశాడు. అతను యాక్టివిస్టో, హ్యూమినిస్టో, రెవల్యూషనిస్టో.. ఇంకే ఇజాన్ని మోస్తున్నాడో తెలీదు గానీ.. బయటి ప్రపంచం మాత్రం జర్నలిస్టుగానే భావిస్తుంది. దేశంలో శాంతి-సౌభ్రాతృత్వాలు కోరుకునే జర్నలిస్టు ఎవరైనా ఇలాంటి కార్టూన్లు వేయడానికి సాహసించడు. ప్రపంచం సంగతి ఎలా ఉన్నా.. భావావేశాలు, సెంటిమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే మన భారత్ లో మాత్రం రెండు వర్గాలకు సంబంధించిన విషయాన్ని చాలా బాధ్యతాయుతంగా డీల్ చేస్తారు. అలాగే చేయాలి కూడా.
కానీ కౌంటర్ కరెంట్స్ అనే వెబ్ సైట్ యాజమాన్యం మాత్రం అలాంటి జాగ్రత్తలు పాటించకుండానే జనం మీద విషం చిమ్ముతోంది. షార్జీల్ అనే వ్యక్తి మార్చి 11 నుంచి ఇప్పటివరకు వారి బంధువులను, మిత్రులను, ఆఖరుకు లాయర్ ను కూడా కలుసుకోలేకపోయాడు. ఎవ్వరితోనూ మాట్లాడలేకపోయాడు. ఇది పూర్తిగా మానవ హక్కులకు విరుద్ధం. కరోనా విజృంభిస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లోనైనా షార్జీల్ లాంటి "రాజకీయ ఖైదీలను" జైళ్ల నుంచి విడుదల చేయాలనేది ఆర్టికల్ సారాంశం. వారు ఆర్టికల్ రాసిన ఉద్దేశం గానీ, దాని టెంపో గానీ ఏమాత్రం కన్విన్సింగ్ గా లేకపోగా... షార్జీల్ ముస్లిం కాబట్టే.. బెయిల్ గానీ, పెరోల్ గానీ ఇవ్వలేదని.. ఈ దేశంలో ముస్లింల పట్ల ప్రభుత్వాలు గానీ, కోర్టులు గానీ పక్షపాతపూరితంగా వ్యవహరిస్తున్నాయంటూ బురద చల్లే ప్రయత్నం జరిగింది. దీన్ని అక్షత్ జైన్, ఎవితా దాస్ సంయుక్తంగా రాశారు.
ఇప్పటికీ స్థాయికి మించి కిక్కిరిసి ఉన్న భారతీయ జైళ్లు... ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న సమయంలో మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయని, అందువల్ల కేసు తీవ్రత తక్కువగా ఉన్న అండర్ ట్రయల్స్ ని, రాజకీయ ఖైదీలను కనీసం తాత్కాలికంగా బయటికి పంపాలని కోర్టులే ప్రభుత్వానికి సూచించాయని.. అయినా ముస్లింల విషయంలో అలాంటివేవీ పరిగణనలోకి తీసుకోబడడం లేదని కుట్రపూరితమైన ఏడుపు ఏడ్చారు. వారి ఏడుపుకు సపోర్టుగా జైళ్లన్నీ 2016 నాటికే 114 శాతంతో నిండిపోయాయని.. ఇప్పుడైతే ఇంకా కిక్కిరిసి ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. భారతీయ జైళ్లలో మగ్గుతున్నవారిలో ఆదివాసులు, దళితులు, ముస్లింలే ఎక్కువున్నారంటూ అసందర్భమైన పోలికను తీసుకొచ్చారు. మరి భారతీయ కోర్టులు వ్యక్తుల జాతుల్ని, మతాల్ని బట్టి శిక్షలు విధిస్తున్నాయా? మన పోలీసులు జాతుల్ని బట్టి, మతాల్ని బట్టి జైళ్లలో ఉంచుతున్నారా?
దళితులు, గిరిజనులు, ఆదివాసులు, ముస్లింల హక్కుల కోసం పోరాడుతున్నవారికి మానవ హక్కులు కూడా వర్తించడం లేదని సంబంధం లేని, సందర్భం లేని ఆర్టికల్ ను జనం మీదికి వదిలారు. ఇలాంటి రాతలు కుట్రపూరితంగా చేసేవే తప్ప కాకతాళీయంగా జరిగేవి కావని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కరోనా తరువాత దేశంలోని జైళ్లను చాలావరకు ఖాళీ చేశారు. నేరతీవ్రతను పరిగణనలోకి తీసుకొని విచారణలో ఉన్నవారికి బెయిల్స్ ఇచ్చారు. షార్జీల్ కు సుప్రీంకోర్టు బెయిల్ ఎందుకు నిరాకరించింది? అతని మీద ఉన్న ఆరోపణల తీవ్రతను బట్టి మాత్రమే. మరి దానికి కోర్టులకు దురుద్దేశాలు అంటగడితే ఆ వర్గం ప్రజల్లోపల ఎలాంటి భావాలు రేగుతాయో ఆ వెబ్ సైట్ యాజమాన్యం ఆలోచించిందా? ఇదే సందర్భంగా భీమా-కోరేగాఁవ్ అల్లర్లలో అరెస్టయినవారికి కూడా మానవహక్కులు వర్తించడం లేదంటూ పలువురి మీద నమోదైన దేశద్రోహ కేసుల హిస్టరీని కూడా రాసిపారేశారు. షార్జీల్ మీద ఢిల్లీలో, అలీగఢ్ లో రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చాడన్న అభియోగాలు నమోదయ్యాయి. సీఏఏ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా అలీగఢ్ లో షార్జీల్ విపరీతంగా రెచ్చిపోయి ప్రసంగించాడు. ఈ దేశ ప్రజల్నే భయపెట్టాడు. మాటల్లో ఏమన్నాడో ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి ఇక్కడ రాయడం లేదు. అవే నిరసనల్లో భాగంగా అసోంను, ఈశాన్య భారతాన్ని భారత్ నుంచి విడగొట్టేందుకు ప్రజలంతా పోరాడాలని పిలుపునిచ్చాడు. ఆ వీడియో అసోంలో వైరల్ అయింది. ఇలాంటి దేశద్రోహ కేసులు ఎదుర్కొంటున్న షార్జీల్ కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరిస్తే అది ముస్లింలకు వ్యతిరేకంగా ఎలా అవుతుంది? హిందువులంతా ముస్లింల మీద కక్షతో దాడి చేస్తున్నారని కార్టూన్ గీయడంలో ఉద్దేశాలేంటి? అది కూడా కరోనా లాంటి పెనువిపత్తు సంభవించినప్పుడు ప్రజలంతా ఇబ్బందులకు ఓర్చుకొని సహకరిస్తున్నప్పుడు ఇలా మతం పేరుతో విభజన సృష్టించడం దేనికి సంకేతం? సీఏఏ వ్యతిరేక నిరసనలకు కొనసాగింపుగానే "నిషేధిత రాజకీయ" గ్రూపులు ఇలాంటి కుట్రలకు తెర లేపుతున్నాయా? ఇవన్నీ సావధానంగా ఆలోచిస్తే తప్ప అర్థం కావు. అలాగే ప్రజలందరూ వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా అప్రమత్తంగా ఉండకపోతే ఎలాంటి కుట్రలైనా రేపు బయటకొచ్చే అవకాశాల్లేకపోలేదు. తస్మాత్ జాగ్రత్త.
Also Read: 15 నిమిషాలు.. 15 కోట్లు.. ప్రమాదం ముంచుకొస్తోంది
ఆ గాంధీని మించిన ఘనుడు ఈ గాంధీ
Comments
Post a Comment
Your Comments Please: