ఓపికకు కూడా హద్దుంటుంది కదా. అదే ఇప్పుడు ముందుకొస్తోంది. కరోనా విజృంభణకు బ్రేకులు వేసేందుకు ముందువరుసలో ఉండి పోరాడుతున్న వైద్యసిబ్బందిలో నిరసన సెగలు రగులుతున్నాయి. కరోనా పాజిటివ్ బారిన పడిన కొందరు వ్యక్తులు, హైడింగ్ లో ఉండడమే కాక.. పోలీసుల ద్వారా ఐడెంటిఫై అయ్యాక డాక్టర్లు వెళ్లినా కూడా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. విచక్షణ కోల్పోయి వైద్యుల మీద దారుణంగా దాడులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో, నిజామాబాద్ లో జరిగినా ప్రభుత్వం వైపు నుంచి చెప్పుకోదగ్గ చర్యలు లేకపోవడం వైద్యసిబ్బందిలో ఆందోళనకు కారణమవుతోంది. ఆ రెండు సంఘటనల తరువాత కూడా OGH వైద్యుడిపై రక్తం వచ్చేలా కొట్టిన ఘటన జరిగింది. వైద్య సిబ్బంది మీద దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న సర్కారు ప్రకటనలు కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోయాయి. అటు యూపీలో కూడా డాక్టర్ అగర్వాల్ పై, అతని అనుచరులు, డ్రైవర్ పై విచక్షణ లేకుండా దాడి చేశారు. మీ ప్రాణాలు కాపాడేందుకే వచ్చామని చెబుతున్నా మూర్ఖత్వం తలకెక్కిన పాజిటివ్ రోగులు వాళ్ల వెహికల్ పై రాళ్లవర్షం కురిపించారు. చివరికి రోగులు ఉండాల్సిన హాస్పిటల్ బెడ్ మీద డాక్టర్లు ఉండాల్సి వస్తోంది.
Also Read: వదిలేస్తే వల్లకాడే - ఈ లెక్కలే సాక్ష్యం
అందుకే ఈ విషయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తొలిసారిగా స్పందించింది. డాక్టర్లపై దాడులు జరిగితే తమ విధులు నిర్వర్తించలేమని, ఆ దిశగా ప్రభుత్వాలు సరైన రక్షణ ఏర్పాట్లు చేయాలని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు రాజన్ శర్మ విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి 9 గంటలకు అన్ని ఆస్పత్రులు, వైద్య సిబ్బంది దీపాలు వెలిగించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. తాము నిరసన తెలుపుతున్నామే తప్ప వైద్యసేవలు నిలిపివేయడం లేదని.. అయితే తాము ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను దేశమంతా ఇప్పటికైనా గుర్తించాలని ఆయన కోరారు. అలాగే కరోనాకు దేశాలవారీగా, ప్రాంతాలవారీగా స్పందించే లక్షణం ఉండదని, ప్రపంచవ్యాప్తంగా దీని వ్యాప్తి అంతా ప్రమాదకరంగానే ఉందని.. అలాంటప్పుడు కరోనాను దృష్టిలో పెట్టుకొని లాక్ డౌన్ నిబంధనలు ఒకేరకంగా ఉండాలని కేంద్రప్రభుత్వానికి సూచించారు. మరి.. ఈ ఐఎంఏ నుంచి ఈ సూచనను కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక హెచ్చరికగా పరిగణిస్తాయా.. రేపటిరోజుల్లో పోలీసులు కూడా ఇదే బాట ఎంచుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి.. చూద్దాం.
Comments
Post a Comment
Your Comments Please: