Photo Credit: Sakshi Post
ఖైదీలు ఏం చేస్తున్నారు? హాయిగా ముప్పూటలా తిని పడుకుంటున్నారా? అలాగే అసలు క్రైమ్ రేట్ 50 శాతానికన్నా తగ్గిపోయి కొత్త ఖైదీలెవరూ రాని పరిస్థితుల్లో జైళ్ల అధికారులు ఏం చేస్తున్నారు? గోళ్లు గిల్లుకుంటున్నారా? లేక అక్కరకొచ్చే పనేదైనా చేస్తున్నారా? ఖైదీలను ఖాళీగా ఉంచకుండా జైలు సిబ్బంది చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కరోనా సృష్టించిన కరువును పూడ్చేందుకు జైలుసిబ్బంది బయటి ప్రపంచానికి తెలియని అపురూపమైన సేవలు అందిస్తున్నారు. జైలు సిబ్బందిని గైడ్ చేస్తూ, ఖైదీల టాలెంట్ ను సరైనరీతిలో వాడుకునే పక్కా ప్రణాళికలు రచిస్తున్నది ఇప్పుడు ఆయా జైళ్ల అధికారులే.
కరోనా మహమ్మారిని నివారించడంలో జైలు అధికారుల సహకారం అంతా ఇంతా కాదు. ప్రభుత్వ ఆసుపత్రిలో వేసే బెడ్ నుంచి పరిచే దుప్పటి, పేషంట్స్ డ్రెస్ లు, మూతికి కట్టుకునే మాస్కులు, శానిటైజర్లు, యాంటీ బ్యాక్టీరియల్ రసాయనాలు తయారయ్యేది జైలు అధికారుల పర్యవేక్షణలోనే. రోజూ వచ్చే నిందితులను ఏ విధమైన నిబంధనలతో లోనికి అనుమతిస్తారో తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. కరోనా నేపథ్యంలో లోపలికి వచ్చేవారిని 14 రోజులు విడిగా వుంచి అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించిన తరువాతే వారిని ఇతర ఖైదీలతో కలపడం జరుగుతుంది.
వారికి రోజూ రెండు గంటలకు ఒకసారి చేతులు కిడిగిస్తూ.. ఏ విధంగా ఈ వ్యాధి రాకుండా ఉండాలి అనే అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అది కూడా ఒక జైల్ వార్డర్.. వారి చేతి మీద శానిటైజర్ వేస్తూ వెళుతుంటాడు. ఇలా జైల్ అధికారుల బాధ్యత చాలా క్రియాశీలం. ఒక వ్యక్తి జైల్ కి రావాలంటే 1) పోలీస్,) 2) జ్యుడీషియరీ 3) జైల్.. ఈ ముగ్గురు బాధ్యతలు నిర్వహిస్తే తప్ప ఒక నేరస్తుడు జైలుకి వచ్చే ప్రక్రియ పూర్తి కాదు. ఖైదీల విషయంలో అటు పోలీసులకు గానీ ఇటు జ్యూడిషియరీకి గానీ సుప్రీం కోర్టు నుండి, అలాగే హైకోర్టు నుండి ఇప్పటివరకు ఎలాంటి సూచనలు, సలహాలు అందలేదని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా సోకితే పరిస్థితేంటి? ఈమధ్య అమెరికాలోని చికాగోలో 120 మందికి కరోనా సోకినట్టు సమాచారం. మరి అలాంటిది ఒక్క చర్లపల్లి జైల్లోనే 2 వేల మంది ఖైదీలు ఉన్నారు. ఈ విధంగా జిల్లా జైళ్లు, సబ్ జైళ్లు అన్నీ కలిపితే ఎంత మంది వుంటారో ఊహించుకోవచ్చు. అయితే మన జైల్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇప్పటివరకు మనకు ఎలాంటి నష్టం జరగలేదు. కారణం.. జైళ్ల అధికారులు పక్కాగా కరోనా నిబంధనలు అమలు చేయడమేనని గుర్తించాలి. సమస్య వచ్చిన తరువాత కాకుండా రాకముందే మేల్కొని, తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న జైలు అధికారులను అభినందించాల్సిందే.
Comments
Post a Comment
Your Comments Please: