ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింటు. నిజమే కేరళ సర్కారు కరోనాకు బుల్లెట్ దించినట్టే అనిపిస్తుంది. ఫస్ట్ పాజిటివ్ కేస్ కేరళలోనే నమోదైనా... కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అందరిచేతా శెభాష్ అనిపించుకుంటోంది. సీఎం అంటే అతనేరా బుజ్జీ అనిపించుకుంటున్నాడు పినరాయ్ విజయన్. ఏప్రిల్ ఫస్టున 123 కొత్త కేసులు నమోదవగా అనుమానిత లక్షణాలున్న వ్యక్తుల్ని గుర్తించి హాస్పిటల్లో చేర్పించినవారి సంఖ్య 622. అదే సంఖ్యను ఏప్రిల్ 17వ తేదీన పరిశీలిస్తే.. 17న నమోదైన కొత్త కేసులు 84 ఉంటే.. పాజిటివ్ అనుమానిత లక్షణాలుండి హాస్పిటల్ కు తరలించినవారి సంఖ్య 526 గా నమోదైంది. అంటే ఈ పక్షం రోజుల్లో కొత్త అనుమానిత కేసుల సంఖ్యను దాదాపుగా వందకు తగ్గించి, పాజిటివ్ గా గుర్తించినవారిని దాదాపు 40 తగ్గించారు. ఇదే చిత్తశుద్ధి ఇంకా ప్రదర్శిస్తే కొత్త పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు అనుమానించి హాస్పిటల్లో చేర్చేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందంటున్నారు.
ఇక హోమ్ ఐసోలేషన్ లో పెట్టి... నిరంతర పర్యవేక్షణలో ఉన్నవారి సంఖ్య ఏప్రిల్ ఫస్టు నాటికి లక్షా 63 వేల 508 ఉంటే... అదే సంఖ్యను 17వ తేదీనాటికి 78,454 కు తగ్గించగలిగారు. ఇక్కడే కేరళ సర్కారు చిత్తశుద్ధి, ప్రభుత్వ యంత్రాంగం అంకితభావాన్ని అర్థం చేసుకోవచ్చు.
అసలు సంగతి ఇదీ..
హోమ్ ఐసొలేషన్లో ఉండేవారి సంఖ్య తగ్గడం, రోజురోజుకూ కొత్తకేసుల నమోదు తగ్గడం అనేది ఎలా సాధ్యమైంది? చాలా సింపుల్. అక్కడ ప్రజల ఇళ్లకే వంటసరుకులు చేరిపోతున్నాయి. రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేనివారికి కూడా ఉప్పు నుంచి మొదలుకొని మసాలా ప్యాకెట్ల వరకు అన్నీ చేరిపోతున్నాయి. దీంతో వారు ఇళ్లు విడిచి బయటికి రావడం లేదు. ఇక్కడే వారి సక్సెస్ అంతా ఉందని కేరళలో ఉంటున్నవారు, బయట ఉంటున్న వారి బంధువులు, ఇతరులు ఘనంగా చెప్పుకోవడానికి ఇదే కారణం. రేషన్ కార్డు ఉన్నవారికి 35 కిలోల బియ్యం, ధనవంతులకు 15 కిలోల బియ్యం అందుతున్నాయని అక్కడివారే చెప్తున్నారు. ఇవన్నీ ఉచితంగానే అందుతున్నాయని కూడా చెప్తున్నారు.
ఇలా చేస్తే లాక్ డౌన్ సక్సెస్ కాకుండా చస్తుందా? దీన్ని వదిలేసి మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు... ఎన్ని ప్రకటనలు చేస్తే ఏం లాభం? ఆకలయ్యేవాడికి ఆరోగ్య సూత్రాలు ఏం రుచిస్తాయి? ఉడికిందో, ఉడికీ ఉడకందో కాస్త నోటికందితేనే కదా ఇంట్లో ఉండేది. మరి ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, తెలంగాణ నుంచి, కర్నాటక నుంచి వలస కూలీలు వెళ్తున్నారంటే వెళ్లరా? కనీసం ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలు ఈ సూత్రాన్ని అవలంబిస్తే మంచిది.
Also Read: 2022 వరకు సామాజిక దూరం పాటిస్తేనే మనుగడ - హార్వర్డ్ యూనివర్సిటీ
Comments
Post a Comment
Your Comments Please: