Skip to main content

వీళ్లను ఆదుకోవాల్సింది కేసీఆరే-కె.సి.కాళప్ప


కరోనా దెబ్బకు దాదాపు 2 నెలలుగా ఉపాధి కోల్పోయి, కూలీ పని కూడా దొరక్క పేదల కుటుంబాలన్నీ అల్లకల్లోలంగా మారుతున్న క్రమంలో అత్యంత వెనుకబడ్డ వర్గాలను ఆపద్బాంధవుడైన ముఖ్యమంత్రి కేసీఆరే ఆదుకోవాలని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.సి.కాళప్ప విజ్ఞప్తి చేశారు. జనతా కర్ఫ్యూ, ఆ తరువాత మూడో దఫా లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో రెక్కాడినప్పుడే పూర్తిగా డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న ఎంబీసీలు.. కరోనా దెబ్బకు కనీసం ఆకలి కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని.. అలాంటివారి కోసం ప్రత్యేకంగా ఆపన్నహస్తం అందించాల్సిన అవసరం ఉందని కాళప్ప అభిప్రాయపడ్డారు.


కుప్పకూలిన చేతివృత్తులు


చేతివృత్తులు, మానవసేవలు అందించే బడుగులు, నిరుపేదలంతా మోస్ట్ బ్యాక్ వార్డ్ కులాల్లోనే ఉన్నారని.. వారిని కాపాడుకోవడం యావత్ సమాజ కర్తవ్యమన్న ఆయన.. అలాంటివారిని కాపాడుకోకపోతే వారి సేవలమీదనే ఆధారపడ్డ అనేక కుటుంబాల పరిస్థితి సంకటంలో పడుతుందన్నారు. హైదరాబాద్ లో నిర్మాణరంగానికి అవసరమైన కూలీలుగానీ, హమాలీలు గానీ, పరిశ్రమల్లో పనిచేసే వర్కర్లు గానీ, అడ్డా మీది లేబర్లు గానీ, ఆఫీసులు-కార్యాలయాలకు వెళ్లే ఉన్నత కుటుంబాల ఇళ్లలో పనిచేసే పనిమనుషులు, ఆయాలు, అనాథాశ్రమాల్లో సేవలందించేవారు.. ఇలా కీలకమైన శ్రామిక, సేవారంగాన్ని నడిపిస్తున్నవారంతా కింది కులాలవారేనని, ఈ కష్టకాలంలో ఆదుకోకపోతే ముందుముందు యావత్ సమాజం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అందుకే రేపటి సమాజం సురక్షితంగా ఉండాలంటే వారికి తక్షణమే ఆపన్నహస్తం అందించాలని తెలంగాణ సర్కారుకు ఆయన విన్నవించారు. 


ఉపాధి కోల్పోయి దెబ్బతిన్న కులాలు ఇవే




షాపులు, మడిగెలు మూతపడడంతో నాయీబ్రాహ్మణులు బజారునపడ్డారు. మంగళి షాపు యజమానులే కాక షాపుల్లో పనిచేసే రోజువారీ కూలీలకు పూట గడవడం కష్టంగా మారింది. అలాగే వాషింగ్ మెషీన్ల రాకతో ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్న రజక వృత్తిలో.. ఆ మహిళలు పట్నంలోని పలువురి ఇళ్లలో పనివారుగా కుదురుకున్నారు. ఇప్పుడా పని కూడా లేక ఆయా కుటుంబాలన్నీ పస్తులతో పడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అలాగే చేపలు, రొయ్యలు అమ్ముకొని వాటిమీదనే జీవించే గంగపుత్రులు.. మార్కెట్లన్నీ మూతపడడంతో దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయారు. వేర్వేరు ఇళ్లలో పనివాళ్లుగా కుదురుకున్న కొందరు మహిళలకు కూడా ఉపాధి లేకుండాపోయింది. అలాగే తెలంగాణలో చెప్పుకోదగ్గ పెద్దసంఖ్యలో ఉన్న విశ్వబ్రాహ్మణులు అత్యంత దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారని కాళప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చేతివృత్తులు చతికిలపడ్డ క్రమంలో రెడీమేడ్ పనుల కోసం పట్నాలకు వలస పోయిన వేలాది మంది విశ్వబ్రాహ్మలు.. ఇప్పుడు వారి చేతుల్లోనే పనిముట్లకు పనిలేక, అర్ధాకలితో అలమటిస్తున్నారు. దీర్ఘకాల వ్యాధులకు చికిత్స చేయించుకునే స్తోమత లేక అనారోగ్యాలతో కునారిల్లుతున్నారు. అలాగే పట్టెడన్నం కోసం సంస్కృతిని ప్రదర్శిస్తూ రోజంతా బిచ్చమెత్తుతూ సంచరించే దాసరి, దొమ్మర, కాటిపాపల, మొండిబండ, పిచ్చుగుంట్ల వారేకాక... పాములోళ్లు, వీరముష్టి, బోయ, వడ్డెర వంటి చేతికష్టాన్నే నమ్ముకున్న అనేక వేలాది మంది బడుగులు రోడ్డునపడ్డారని, వారికోసం ప్రత్యేకంగా ఆలోచించకపోతే ఆ వర్గాలు ఉనికిలో లేకుండా పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరి తక్షణావసరాల కోసం కుటుంబానికి రూ. 5 వేల చొప్పున జమ చేయాలని కేసీఆర్ ను కోరారు. 


ఆనాటి సుదీర్ఘ చర్చాంశాలను అమలు చేయండి



తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో 2017లో అత్యంత వెనుకబడిన కులాల నాయకులతో దాదాపు 7 గంటలపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారని, సమాజంలో గుర్తింపుకు నోచుకోని లక్షలాది మంది కోసం సుదీర్ఘంగా చర్చించడం దేశ చరిత్రలోనే తొలిసారి అని.. ఆ క్రెడిట్ కేసీఆర్ కే దక్కుతుందని గుర్తు  చేశారు. అలా ఎంబీసీల కోసం ప్రత్యేకంగా ఆలోచించి, ఎంబీసీ నాయకత్వం నుంచి సూచనలు, సలహాలు కోరిన కేసీఆర్.. ఇప్పుడు తలెత్తిన కరోనా సంక్షోభాన్ని అధిగించేందుకు అద్భుతమైన రీతిలో ప్రణాళికలు అమలు చేస్తున్నారని... తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అద్భుతంగా కరోనాను ఎదుర్కొంటోందని ప్రశంసించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ సర్కారు… తక్షణమే నోరు లేని బడుగుల పక్షాన ఆలోచించి, వారి కోసం తక్షణావసరంగా నిధులు విడుదల చేయాలని కోరారు. కరోనా కష్టకాలంలో ఏ చిన్న సాయం ప్రభుత్వం వైపు నుంచి అందినా.. లక్షలాది కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటాయని.. వారంతా కేసీఆర్ ను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారన్నారు. 


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.