శత్రువును తుదముట్టించడం సాధ్యం కానప్పుడు లేదా శత్రువు మనకన్నా బలవంతుడైనప్పుడు రాజీ మార్గమే పరిష్కారమనేది మన ప్రాచీన రాజనీతి. అదే సూత్రం యుద్ధనీతికీ వర్తిస్తుంది. రెండువర్గాలు ఎదురుబొదురు కూర్చొని ఏదోకటి సెటిల్ చేసుకునే సందర్భంలో ఎవరో ఒకరు తగ్గడం, ఇంకొకరు మొగ్గడం సాధారణమే. అయితే యుద్ధం మొదలై శత్రువు విరుచుకుపడుతున్నప్పుడు ఆ శత్రువును కూడా చికాకు పరచకుండా కొంత సానుకూల వాతావరణం, కొంత అనుకూలమైన ప్రదేశం కల్పించి తనకు ఇబ్బంది రాకుండా చూస్తే శత్రువు దృష్టి మళ్లించినవాళ్లమవుతాం. తన రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది రాకుండా చూస్తే మన కార్యకలాపాలు మనం చేసుకోవచ్చు. అంటే ఒకరిని ఒకరు ఇబ్బందిపెట్టకుండా ఉండడం లేదా ఒకరికొకరు భయంతో కూడిన గౌరవ, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదే సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని సంకల్పించారు. రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చూచాయగా చెప్పారు. తాము కోవిడ్-19 ని ఎదుర్కోవాలని నిశ్చయించామని, అందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. తాజాగా మీడియా ముందుకొచ్చి ప్రకటించారు కేజ్రీవాల్. కరోనాను పూర్తిగా తుడిచేయడం ఇప్పట్లో సాధ్యం కాదని, అప్పటిదాకా మనం ఇళ్లకే పరిమితమైతే జరగబోయే నష్టాన్ని ఊహించలేమన్నారు. అందుకని మధ్యేమార్గంగా.. కరోనాతో కలిసి జీవించడాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పడం విశేషం. అంటే సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్స్ వినియోగించడం, పని ప్రదేశాల్లో కేంద్రం నిర్దేశించిన నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించడం.. ఇలాంటివన్నమాట. అంతేకాదు.. కరోనా విజృంభణ నానాటికీ పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ ను మరో రెండువారాలు పొడిగించడం విశేషం. అటు కేసులు పెరగడంతో కంటైన్మెంట్ జోన్లు పెరిగాయి. వాటి పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే నిబంధనలు పాటిస్తూనే.. ప్రొడక్షన్ ను మొదలు పెట్టడానికి ఉన్న అనువైన మార్గాల అన్వేషణలో పడ్డారన్నమాట.
ప్రజల్ని ఎక్కువకాలం ఒకేచోట నిలిపి ఉంచడం సాధ్యం కాదంటున్న కేజ్రీవాల్.. జోన్లవారీ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. వ్యవసాయాన్ని, ప్రైవేటు పరిశ్రమలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 33 శాతం వర్క్ ఫోర్స్ తో ప్రైవేటు కంపెనీలు పని చేయడానికి అనుమతిస్తామన్నారు. అలాగే వ్యవసాయరంగానికీ మినహాయింపులు ఇస్తామన్నారు. ప్రజారవాణాను కూడా షరతులకు లోబడి అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. ఫోర్ వీలర్స్ లో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే, టూ వీలర్ మీద ఒక్కరు మాత్రమే ప్రయాణించే నిబంధనలు కఠినంగా అమలు చేస్తామన్నారు.
మొత్తానికి కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నా కూడా ప్రజాజీవనానికి బ్రేకులు పడకుండా ఉండే మార్గాల్ని కేజ్రీవాల్ అమలు చేయబోతున్నారు. ఎందుకంటే ఢిల్లీలాంటి కాస్మొపాలిటన్ సిటీల్లో జనమంతా ఇళ్లకే పరిమితమైతే ప్రభుత్వ పాలన స్తంభించిపోవడం ఖాయం. రూ. 3200 కోట్ల నష్టం వాటిల్లిందంటూ కేజ్రీవాల్ ఓ ఉదాహరణగా చెప్పడాన్ని అర్థం చేసుకోవాలి.
అటు మహారాష్ట్రలో పలు ప్రైవేటు కంపెనీలు చాలా జాగ్రత్తలు పాటిస్తూ పరిశ్రమలు తెరుస్తున్నాయి. ఇదే బాటలో మిగతా రాష్ట్రాలు కూడా కొనసాగే అవకాశాలు త్వరలోనే రావచ్చు. అయితే దీనికి బలమైన ప్రజా సంకల్పం ఉంటే తప్ప విజయవంతం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ప్రభుత్వాలు కూడా నిబంధనల అమలులో స్ట్రిక్టుగా ఉంటూనే ఉత్పత్తి వ్యూహాలు ప్రారంభించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Comments
Post a Comment
Your Comments Please: