Skip to main content

వార్త రాస్తే ఇల్లు కూల్చాలా?


 


ఓ గ్రామీణ విలేకరి ఇల్లు కూలింది. పెను దుమారానికో, విపరీతమైన వర్షానికో, లేక  శిథిలావస్తకు చేరుకునో ఆ ఇల్లు కూలలేదు. ఇంకా ఆకృతి  దాల్చని ఆడశిశువు పీక పిసికేసినట్టు ఇప్పుడే పునాదులు పూర్తి  చేసుకొని గోడల దశకు చేరుకున్న ఇల్లు నేలమట్టమైంది. పిల్లాడు ఐస్ క్రీమ్ చీకినంత ఈజీగా ఒక ఎమ్మెల్యే పంపిన మనిషి బుల్డోజర్ మీద వచ్చి ఆ విలేకరి ఇంటిని పునాదులకంటా నేలకు నాకించేశాడు. వార్త రాసి, అది కాస్త డెస్క్ లో ఊపిరి పోసుకొని శాటిలైట్ గుండా ప్రపంచాన్ని పలకరించేసరికి విలేకరికి చాలా సంతృప్తే కలిగి ఉండొచ్చు. ఎందుకంటే.. ఆ వార్త ఏ గల్లీ లీడర్ మీదనో రాసింది కాదు కాబట్టి. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో కోవిడ్ నిబంధనలు గాలికొదిలేశారని, దాదాపు 200 మందికి పైగానే పార్టీకి హాజరై.. ఎవరూ మాస్కులు ధరించలేదని, సోషల్ డిస్టెన్స్ పాటించలేదని, ఓ నాయకుడే ఇలా కోవిడ్ రూల్స్ కి పాతరేస్తే మరి రూల్స్ ఎందుకు? నాలుక గీసుకోవడానికా ? అన్న నికార్సిన ఆవేదనతో పరమేశ్ అనే వీ6 విలేకరి ఓ వార్తను ఫైల్ చేశాడు. ఆ వార్త కాస్తా ప్లే అయింది. ఎమ్మెల్యే ఇంటికి 200 మంది బంధుమిత్రులు, వెంట ఉండే అనుచరగణం హాజరైనా పోని పరువు కాస్తా విలేకరి పంపిన ఒక నిమిషం వీడియో క్లిప్ కాస్తా ఎమ్మెల్యే పరువుతో ఆటాడుకుంది. నియోజకవర్గంలో తాను ఎదురెళ్లడమే  తప్ప.. తనకెవరూ ఎదురు రారన్న ధీమాతో ఉన్న భూపాల్ రెడ్డికి ఆఫ్టరాల్ ఒక విలేకరి ఎదురు రావడం జీర్ణించుకోలేకపోయాడు. ఏముంది విలేకరి దగ్గర?  ఓ కెమెరా కన్ను, ఇంకో పెన్ను. తనగురించి ఏం రాయకూడదో ఆ పెన్ను రాసేసింది. తన గురించి ఏం చూపించకూడదో కెమెరా చూపించింది. ఇంక దాచుకోవడానికి ఏముంది?  విశ్వరూపం ప్రదర్శిస్తే పోయేదేముంది? ఊరుకుంటే రేపు ఇంకెవరో కుర్ర విలేకరికి కూడా కొమ్ములొస్తే ఎలా? ఒక్కడి దగ్గరే ఫుల్ స్టాప్ పెడితే బెటర్ కదా. ఇంకెవరైనా తన గురించి ఆలోచించే చాన్స్ ఇవ్వకూడదు. తన గురించి ఆలోచిస్తేనే పెన్నులో ఇంకు కారిపోవాలి. కెమెరా కన్ను మూతపడిపోవాలి. ఈ సమస్య తనొక్కడిదే కాదు కదా. తనలాంటి మరో 118 మంది ఎమ్మెల్యేలు, 38 మంది ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వేలాది మందికి ఇలాంటి సమస్య ఇకపై ఎదురు కాకూడదు అనుకున్నాడో ఏమో. పరమేశ్వర్ కట్టుకుంటున్న ఇంటిని బుల్డోజర్ తో నాకించేశాడు. అచ్చంగా ఐస్ క్రీమ్ లాగా. 


భూపాల్ రెడ్డికి అంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది?


వెరీ సింపుల్. పాత్రికేయులు, జర్నలిస్టుల పరిస్థితి కేసీఆర్ పవర్లోకి వచ్చాక కమెడియన్లకన్నా అధ్వానంగా తయారైంది. ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రెస్ మీట్ కు పిలిచినా నాలుగు అక్షింతలు వేయించుకొని రావడం, లైవ్ లో కేసీఆర్ ఇచ్చే క్లాసులు ప్రజలకు నేరుగా చేరిపోవడం, విలేకరుల పరువు కాస్తా పలుచనైపోవడం, విలేకరులు అడిగేవి చొప్పదంటు ప్రశ్నలుగా వినేవారికి  అనిపించడం, విలేకరులంటే తామేదో సీఎంను ఇరుకున పెడతారనుకుంటే వీరేంటి? ఉల్టా క్లాస్ పీకించుకొని వస్తున్నారని ప్రజలు అనుకోవడం.. ఇలాంటి సీన్లు తెలంగాణ వచ్చినప్పటి నుంచే విశ్లేషకులకు కనువిందు చేస్తున్నాయి. అధినాయకుడు ఇస్తున్న ట్రీట్ మెంటే వందిమాగధులకు కొండంత బలాన్నిస్తుందని జనమంతా అనుకుంటున్నారు. ఇక జర్నలిస్టు సంఘాలెన్ని ఉన్నా.. ప్రధానంగా రెండు వర్గాలుగా చీలిపోయారు. లబ్ధి పొందిన జర్నలిస్టులు. లబ్ధి పొందని జర్నలిస్టులు. మొదటివారు బాస్ దగ్గరే ఉంటున్నారు. రెండోవారు ప్రెస్ గ్యాలరీలో పెద్దసార్ చెప్పేది రాసుకుంటున్నారు. వందిమాగధులు కూడా చిన్నపాటి బాసులే కదా. కాబట్టి అదే బాటలో వీరు కూడా పయనిస్తున్నారు. భూపాల్ రెడ్డిది కూడా అదే ధైర్యం. ఇప్పటికే పెద్దసైజు మీడియా కంపెనీల నోర్లు కూడా ఒక్కొక్కటిగా మూయిస్తూ వస్తున్న క్రమంలో ఆఫ్టరాల్ ఓ చిన్న పల్లెటూరి విలేకరి పిల్లగాడు గులాబీ బాస్ అనుచరుడిని ప్రశ్నిస్తే రియాక్షన్ ఇలా కాక ఎలా ఉంటుంది? 



మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? 


ఏ విషయమైనా చాటుగా డీల్ చేస్తే మర్యాద కాపాడుకున్నట్టు ఉంటది. కానీ నారాయణ్ ఖేడ్ సబ్జెక్టు పబ్లిక్ ఇష్యూ అయిపోయింది కదా. అయినా సరే ప్రభుత్వం మాత్రం భూపాల్ రెడ్డిని క్షమాపణ కోరుమని ససేమిరా అడిగే చాన్స్ అయితే కనిపించడం లేదు. ఆయన సారీ చెప్పినా ప్రభుత్వం సారీ చెప్పినట్టే కదా. ఆయన పరిహారం చెల్లించుకున్నా ప్రభుత్వం చెల్లించుకున్నట్టే  కదా. ఇలా చెల్లించుకుంటూ  పోతే ఎంతమందికి చెల్లించాలి? ఎంతమంది ప్రజాప్రతినిధుల చేత సారీ చెప్పించాలి? భూపాల్ రెడ్డికి ముందు పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన, చొక్కా పట్టుకొని లాగిన దోస్త్ పార్టీ ఉంది కదా. ఆ పార్టీ కౌన్సిలరే పోలీసును బండబూతులు తిట్టాడు. జీవితం మీద విరక్తి  పుట్టేలా వ్యవహరించాడు. అయినా అధికార పార్టీ ఏమీ అనలేదు కదా. పోలీసులంటే ప్రభుత్వ రక్షకులు. అధికార పార్టీకి అంగరక్షకులు. ఆ అంగరక్షకుల్లో ఒకరికి (కుల్సుంపురా పోలీస్ కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి) కోవిడ్ సోకినా గుర్తించలేని, ట్రీట్ మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆఫ్టరాల్ విలేకరి సంగతిని ఎవరడిగారు? హృదయాలు గాయపడ్డ విలేకరులు పోరాడతామంటున్నారు. పేదోడి పోరాటం ఎన్నిరోజులుంటది? మళ్లీ అవతలి పార్టీనో, ఇవతలి పార్టీనో ఎవరో ఒకరి మద్దతు కావాలి. అదేదో వారికెందుకు అవకాశం ఇవ్వాలి? మనసులు గాయపడ్డ విలేకరులకు మనమే మలాం రాద్దాం లేదా రాసినట్టు చేద్దాం అన్న ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ కావచ్చు. మొత్తానికి ఇదో పెద్ద ఇష్యూ మాత్రం కాదనేది గట్టి అభిప్రాయం. 



అయితే దేనికైనా ఒక ముగింపు ఉంటుంది. విలేకరులకు జరుగుతున్న అవమానాలకు, ఆకలికేకలకు కూడా ఒక చివరి రోజంటూ వస్తుంది. ఎన్నడూ లేంది.. ప్రభుత్వ వర్గాల్లో, వైద్య విభాగంలో, పోలీసు శాఖలో సైతం... అధినాయకత్వం ఒంటెత్తుపోకడల మీద బహిరంగ కామెంట్లు వినిపిస్తున్న విషయాన్ని సర్కారువారు ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా దిద్దుబాటు చర్యలు తీసుకునే వీలుంటుంది. అది ఆలస్యం కాకుండా చూసుకుంటే మరీ మంచిది. 



Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తో...