ఆధ్యాత్మికత వేరు, మతం వేరు. ఆధ్యాత్మికతలో మనిషి తనను తాను పరిశీలించుకుని ఆత్మ దర్శనం కొరకు సాధన చేసి పరమాత్మను గురించి పరమాత్మ సంకల్పానుసారం సాధనలో ముందుకు వెళ్తాడు. ఆత్మ జ్ఞానానికి ఏ మతంతో, కులంతో సంబంధం లేదు. ఋషులు, మునులు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, శిరిడి సాయిబాబా, బ్రహ్మంగారు ఈ కోవలోకి చెందినవారు.
వాస్తవం చెప్పాలంటే మన దేశంలో హిందూ మతం, హిందూ జాతి అనే పదాలను అర్థం తెలియకుండా వాడుతున్నారు. వేదాలలో భగవద్గీతలో హిందూ మతం అనే పదం లేదు. భరతజాతి అని కొన్ని చోట్ల ఉంది. మన దేశంలో కొందరు విష్ణు భక్తులు, వైష్ణవులు, కొందరు శివ భక్తులు, శైవులు కొందరు అద్వైతాన్ని మరికొందరు ద్వైతాన్ని విశిష్టాద్వైతాన్ని అనుసరిస్తారు. యజ్ఞాలలో జంతుబలిని హింసను వ్యతిరేకించి కరుణారస హృదయంతో బౌద్ధం వచ్చింది. శంకరుని మాయ వాదమైనా బౌద్ధంలోని నిరంతరం మారే ప్రపంచమన్న వాస్తవంగా ఒకే విషయాన్ని చెప్తున్నది.
యోగులు అందరూ అద్భుతమైన అనుభవాలు కలవారే. ఇహలోక సుఖాలను కాదని పరమాత్మ సన్నిధానానికై ప్రయత్నించినవారు అన్ని మతాల్లో ఉన్నారు. జైనులు, సిక్కులు, ఆర్య సమాజం వారు ఇలా ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి. వాస్తవంగా ఒక మతం, ఒక జాతి అంటే ఒకే దేవుడు ఒకే మతపరమైన ఆచరణ పూజలు ఒకే భాష ఒకే సంస్కృతి కలిగి ఉంటాయి. మన భారతదేశంలో విభిన్న మతాలు, కులాలు దేవుళ్ళు మతాచారాలు, భిన్న భాషలు భిన్న సంస్కృతులు ఉన్నాయి. వీటితో పాటు మనుధర్మ శాస్త్రం ప్రజలను చీల్చింది. వేదాలు చదివే హక్కు ఒక కులం వారికే పరిమితం చేసింది. శూద్రులకు స్త్రీలకు విద్యను ఆస్తిని నిరాకరించింది. శూద్రులను, స్త్రీలను అణచి ఉంచాలని వారు అగ్రవర్ణాలవారితో పోటీ పడకూడదని షరతు విధించారు. మను ధర్మం అక్రమమని అన్యాయమని ఆర్.ఎస్.ఎస్ చెబుతుందా? హిందువులు ఎవరిమీద దాడి చేయలేదని ఒక వాదన. చరిత్రలో ఎంత మంది హిందూ రాజులు తమలో తాము యుద్ధాలు చేయలేదు? మహాభారత యుద్ధం మొదలు కళింగ యుద్ధం, బొబ్బిలి యుద్ధం చేసింది హిందూ రాజులు కాదా? శైవుల మీద వైష్ణవులు వైష్ణవుల మీద శైవులు, వైష్ణవులు బౌద్ధుల మీద దాడి చేయలేదా? ఎందరో బౌద్ధ బిక్షలను చంపలేదా? యుద్ధాల పేరుతో యాగాల పేరుతో ఆవులను, గుర్రాలను, మేకలను, కోళ్లను బలి ఇవ్వలేదా? రక్తం ఏరులై ప్రవహించలేదా? జీవహింస వద్దని చెప్పింది మొదట బుద్ధుడు తర్వాత బ్రహ్మంగారు.
ముస్లింలు ఆంగ్లేయులు దండెత్తి వచ్చినప్పుడు ఏ మంత్రాలు తంత్రాలు జాతకాలు పని చేయలేదు కదా? మంత్రాలతో కరోనాను నివారించగలవా? బ్రిటిష్ వారు ముస్లింలు ఇతర దేశాల నుంచి వచ్చారని వాదించేవారు, ఆర్యులు అంటే బ్రాహ్మణులు, క్షత్రీయులు ఎక్కడి వారో ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకుంటారా? మధ్య ఆసియా, ఇరాన్, ఇరాక్ ప్రాంతాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వచ్చి దేశాన్ని ఆక్రమించుకోలేదా? ఇక్కడి ప్రజలను బానిసలుగా చేసి మనుధర్మం పేర అణచి ఉంచలేదా? నేడు కావలసింది హిందూ మతం,హిందూ జాతి కాదు. భారత జాతి, భారతీయత, ఆకలిగొన్న కార్మికులకు, వలస కార్మికులకు పట్టెడు అన్నం తినడానికి తిండి, గుడ్డ, ఆశ్రయం. కానీ దయ, కరణ, హిందూ దురభిమానం, ప్రేమ ఎవరి మీద అంబానీల మీద, అదానిల మీద అటువంటి వారి లక్షల కోట్ల అప్పులు మాఫీ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు మాఫీ, అంతరిక్ష ప్రయోగశాలతో సహా దేశ రక్షణ, పరిశ్రమలు, రైల్వేలు, బి.ఎస్.ఎన్.ఎల్ అన్ని అత్యంత ముఖ్యమైన పరిశ్రమలను, కార్పొరేట్ కంపెనీలకు అప్పగింత. విద్యను వైద్యాన్ని మరింత ప్రైవేటీకరణ రవాణా ప్రైవేటీకరణ ఎవరికోసం ఎవరికి లాభం చేకూర్చడానికి?
భారతదేశం అంటే ఇక్కడి రైతులు, ఇక్కడి కుల వృత్తుల వారు,చేతివృత్తుల వారు, కూలీలు,వలస కూలీలు,చిన్న ఉద్యోగస్తులు మధ్యతరగతి వారు,సామాన్య ప్రజలు. కూలీ చేసే కార్మికుడు హిందువైన, ముస్లిమ్ అయినా,దళితుడైన ఏ కులం వాడైన ఆకలికి కులం లేదు, మతం లేదు, మానవత్వం, మంచితనం, ప్రేమ, జాలి, కరణ, దయ ఇవి కావాలి. సమానత్వం సమాన అవకాశాలు ఆస్తుల, పరిశ్రమల జాతీయకరణ, భూముల జాతీయకరణ, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులకు గిట్టుబాటు ధర, నిత్య జీవిత అవసర వస్తువుల పంపిణీ ఇవి చేయాల్సింది. అదానీల,అంబానీల సేవ కాదు. విదేశీ మల్టీ నేషనల్ కంపెనీలకు లాభాలు తెచ్చి పెట్టడం కాదు. హిందూ జాతి, హిందూ మతం పేరు మీద మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మహాత్మా గాంధి లాంటి గొప్ప వ్యక్తిని మత పిచ్చితో హత్య చేసిన వారిని బల పరచే మనస్తత్వం మంచిది కాదు. సర్వమత సామరస్యం, ప్రజల ఐక్యత, కుల, మత బేధాలను పోగొట్టడం విద్వేషాలను తగ్గించడం ప్రతి దేశభక్తుని కర్తవ్యం.
- జస్టిస్ బి. చంద్రకుమార్
Comments
Post a Comment
Your Comments Please: