కవుల మస్తిష్కాల్లోని భావ ప్రపంచం కదిలితే ఏ రసమైనా ఏరులై పారాల్సిందే. ఆనందమైనా, అద్భుతమైనా, బీభత్సమైనా, కారుణ్యమైనా.. ఆఖరుకు ఇప్పటి కరోనా విసురుతున్న అదృశ్య ఖడ్గ విచలిత విషాదమైనా.. అది ఏ రసమైనా కానీ.. కాలువలు కట్టి ప్రవహింపజేయగలడు కవి. ఆ రస ప్రవాహంలో పఠితలను అలవోకగా తేలియాడించగలడు. భావానందంలో ముంచి బ్రహ్మానంద సీమల మేరువుల వైపు కొనిపోగలడు. అందుకే కవి మనసు పడితే కావ్యకన్యక అందాలు కందాలై పూల తేనియల మకరందాలై కస్తూరికా కదంబాలై కట్టిపడేస్తాయి. అదే జరిగింది ఇక్కడ. సుధాశ్రీ పేరుతో బస్వోజు సుధాకరాచారి కరోనా ప్రస్థానాన్ని, దాని ప్రయాణంలో విశృంఖలత్వాన్ని, సాంస్కృతికంగా అది మోసుకొస్తున్న చైతన్య వీచికలను కందపద్యాల్లో వ్యక్తపరిచారు.
కందం రాయగలవాడే కవి అన్న నానుడిని బట్టి తెలుగు సాహితీ లోకంలో కందానికి ఉన్న కాఠిన్యత, సంక్లిష్టత, విశిష్టతలు ఎలాంటివో గ్రహించవచ్చు. అలాంటి కఠినమైన సాహితీ ప్రక్రియను ఎంచుకొని శతాధిక పద్యాలతో కూడిన అమృత కలశాన్ని సాహితీ ప్రియులకు అందిస్తున్నారు. అయితే కందం రాసేవారికే కష్టం గానీ.. చదువరులకు చాలా తేలిక. అందుకే తెలుగునాట ప్రాచీన కవులు ఈ ప్రక్రియనే ఎక్కువగా ఎంచుకున్నారు. అదే బాటను సుధాకరాచారి కూడా ఎంచుకోవడం విశేషం.
ఆయన రాసిన ఈ సీజనల్ పద్య కదంబాన్ని ఆస్వాదించండి.
కరోనా కందములు (కంద పద్యాలు)
కం.
శ్రీ విలసిత భువినంతట
నన్ వాసిగ భారతమ్మునారోగ్యముచే
జీవులనంతముగా సుఖ
జీవనమేజేయ, పీడ చిక్కొకటొచ్చెన్!! 1
కం.
భారతదేశమునందున
శూరతఁజూపుచు కరోన చుక్కలుదాకన్
క్రూరపు బుధ్ధులచేతన
వారిత జృంభణమొనర్చె వసుధనునంతన్!! 2
కం.
వినరో కరోన వైరసు
కనగానేరదునొకింత కంటికినైనన్
జనమేవణకగ వచ్చెను
తనదగు రూపమునుఁజూపి తత్తర పడగన్!! 3
కం.
చైనాదేశమునందున
భూనాశనమేనుగోరి భూతముగానై
తానవతరించి యకటా
భూనలు దెసలందుఁ బ్రాకి భుజములఁజాచెన్!! 4
కం.
ఊహించని యుత్పాతము
నూహకునందని విపత్తునుర్వికి దెచ్చెన్
ఏ హింసలఁగూర్చునొయని
బాహటముగఁదిరుగగ భయపడిరంత జనుల్!! 5
కం.
మీసము త్రిప్పిన దేశము
రోసముజచ్చియునదియు కరోనకు లొంగెన్
దోసములెంచక కదలిరి
బాసనుజేసియు బలముగ వంచ కరోనన్!! 6
కం.
ఎవరికి వారే వైద్యులు
సవివరముగను దెలిసికొని సాగుటమేలౌ
అవిరళముగ శుభ్రతనతి
భవితను గాంచియునెడమును పాటింప వలెన్!! 7
కం.
బడులను మూసిరి జడిసియు
వడిగాఁగూలెను విఫణులు వైచిత్రముగన్
దడదడ యనుచునునదరగ
కడువడితోడను కరోనకంతన్ చర్యల్ !! 8
కం.
చెప్పెను బ్రహ్మముననుదురు
కప్పలఁదినెడిని మనుజుల క్రౌర్యముననియే
కుప్పలుగానపకార్యము
లప్పునుగానిచ్చినాపదందురిల జనుల్!! 9
కం.
బడిమూసిరి గుడిమూసిరి
జడిపించెడి సూక్ష్మ జీవి చలనమునాపన్
సడిఁజేసిరి వడితోడను
నడిపించెడినాయకులిటనడుగులఁగలిపీ!! 10
కం.
నేనే నేనని వీగుచు
మానములేకనుదిరిగెడి మనుజులునైనా
మానవకోత్తములైన,క
రోన యనగ భీకరముగ రొప్పుదురెంతో!! 11
కం.
దేశమునేలెడి ప్రభువులు
భేషజమేలేకనునతి భీతినిఁజెందీ
నాశముఁజేయగఁబూని వి
నాశినిని,సలిపిరి చర్యనతివేగముగన్!! 12
కం.
వినరో కరోన దెలిపెను
అనయము వీడని క్రతువులనన్నియునెంతో!
మనుజుల జుట్టియునేడిదె
మనములు దాకగను నాటి మాన్యతనొందెన్!! 13
కం.
క్రమమెరిగిన వాడికి స
క్రమమగునంతట సకలము కలిమిగ మారీ
క్రమమన్నది మరచినయ
క్రమ ఫలితము నొందుదురిల కర్మల తోడన్!! 14
*పరిశుభ్రత*
-------------------
కం.
అభ్రమువలె వనగూడన
శుభ్రత,భ్రమరమ్ములవలెజొచ్చును బీమా
రుల్, భ్రమలోనుండక పరి
శుభ్రతఁబాటించఁగలుగు సుఖములునెన్నో!! 15
కం.
తనువుకు శుభ్రత వలయును
మనమును శుద్ధిగను జేయ మాన్యుడవీవే
తనువు మనము కల్మషమై
నను నిలువదు కాయమునిలననెను కరోనా!! 16
కం.
ఇల్లే కాదుర నీదీ
గల్లీ గల్లీ మనదని కడుగుతునుండన్
మల్లీ జూడను నేనని
మెల్లగ జారును కరోన మేదిని నుండీ!! 17
కం.
పిచికారులు వీధులలో
రచియించునట క్రిమి చావుఁరయముగనవియే
శుచిగానుంచుమునవియని
వచియించెను కద కరోన వసుధకు హితమే!! 18
*క్రమశిక్షణ*
----------------
కం.
క్రమశిక్షణ దెల్పును మన
క్రమగతినంతయును కాలగమనములోనన్
క్రమమెఱుఁగని వానికి స
క్రమ జీవితమెట్లు? కలుగు కష్టములెన్నో!! 19
కం.
క్రమశిక్షణ గల ప్రభుతయె
క్రమమిదియని జెప్పుచు సహకారముఁగోరెన్
క్రమమెఱుగుచు సమయమ్మున
క్రమముగ సాగుము సరుకులకనెను కరోనా!! 20
కం.
వేళకు లేయుచునిద్దుర
సాలెకు సాగకు చదువుల సాకున నీవే
మూలకు దూరిన సోమరి
నేలయె నీకనె కరోన నిష్ఠూరముగన్!! 21
కం.
మనసులు గలుపుము ,ఎడమున
తనువులనుంచుము,సరసుల తాత్వికమిదియే
మనమూ తనువూ గలిపిన
తను దూరుదు నడుమననెను దరహాసముతో!! 22
కం.
వ్యాయామము మరువక ప్రా
ణాయామముతోడఁజేయనాయాసములే
లా?యనుదినముననిదియే
నా యాగమమాపుననుచు న్యాయము దెలిపెన్!! 23
కం.
నీ యారోగ్యము కొఱకై
ఆ యనువగు సూత్రములను ఆచరణముతో
డన్ యే నేగుదు, లేనిచొ
నీయందున నానిలయమని యనె కరోనా!! 24
కం.
మేలును దలఁచియు ప్రభుతయె
పాలనజేయుచు నియమము ప్రజలకునొసగెన్
హేళనఁజేయకనవియే
చాలగఁబాటింప నేను చయ్యన పోదున్!! 25
*సంస్కృతి*
--------------------
కం.
రక్కసి కరోన పుణ్యమ
చక్కగఁబూజలు గృహమున సాగుచునుండెన్
మిక్కిలి భక్తియు భావము
నిక్కముఁజేయుమనినేర్పె నీతిఁగరోనా!! 26
కం.
ఆచారమునెడబాసెను
భూచరజీవులనునెల్ల భుక్తికి జేయన్
గోచరమాయెనునిప్పుడె
యాచారము వీడినఁగలవాపదలనుచున్!! 27
కం.
కరచాలనమునఁగరచును
కరమోడ్పులె మోదమౌను కాలములోనన్
భరతావని సంస్కృతియే
నిరతము మేలగు జగతికి నిండుగు వెలుగన్!! 28
కం.
మద్యము మానిరి భయమున
విద్యలనేర్చిరి పఠణము పెక్కుగఁజేసీ
చోద్యము,తిరుగుట మానుచు
పద్యము తోడను భజించ్రి భగవంతున్నే!! 29
కం.
ఇంటనునుండిన పతులే
వంటలుఁజేయగఁసతులకు ప్రతిగాబూనన్
కంటను నీరును,మరి రుచి
పంటలు పండెనుననంత పాటవమనగన్!! 30
కం.
దినమునకొక రుచిఁ గోరగ
తనయలు ,జననీ జనకులు తన్మయమొందీ
యనుదినమాప్యాయతతో
డనుపానముఁజేస్రి రుచులనానందముగన్!! 31
కం.
క్యారంబోర్డులు మరియా
బారాకట్టలు సరియగు పాటలఁబాడీ
దూరదరిశనులఁగాంచుచు
మీరకు ప్రభువాజ్ఞననుచు మిడికె కరోనా!! 32
కం.
సరసముసల్లాపములను
మురియుచునింటనె గడుపగఁముచ్చటననుచున్
పరిపరి హెచ్చరికలతో
నిరికించితివిట్లు నీవునిపుడు కరోనా!! 33
*కుటుంబము*
-------------------
కం.
మమతలకోవెల,మనసుకు
నమితపునానంద బంధమౌ హరివిల్లై
సుమధుర పలుకుల ఝల్లుల
విమలములగు పిల్లలు,కడు పెన్నిధి యిల్లే!! 34
కం.
పిల్లలఁగూడగఁదండ్రులు
తల్లులఁజేరగను సంతు తరుణముననగన్
చెల్లీ తమ్ములు అన్నల
నెల్లరిని గలిపితివీవెనిలను కరోనా!! 35
కం.
అమ్మకు చేదోడు దొరికె
కమ్మని మాటల కలివిడి కౌగిలి లోనన్
ఝుమ్మను తుమ్మెదలవ్వగ
నిమ్మహి సదనములునంత నిపుడయె దివిగా!! 36
కం.
ఒకచో పిల్లలయల్లరి
నొకచో సరసపునలజడి నూతనమొలుకన్
నొకచో వంటల ఘుమఘుమ
నొకచో చరవాణి పిలుపులున్నతమయ్యెన్!! 37
కం.
ఎడమును జూపిన నీవే
నెడమును బాపితివెనింటనెన్నగ నీవే
సడిజేసెడి ప్రేమికులకు
నెడబాటును బాపు,పోయి నీవు కరోనా!! 38
*వృత్తి పరమైన సేవా భావం*
-------------------------
కం.
జీతముఁగొని యూరకనే
చేతనమునణచి గడుపక, జీవితములనే
నూతనమవ్వగఁదీర్చెడి
జ్యోతులె యుద్యోగ గణము జూడగమదిలో!! 39
కం.
ఒంటికినంటిన రోగము
నింటను పంచియును వచ్చునెవ్వరినైనన్
కంటికి రెప్పగఁజూచుచు
నంటినరోగమునుఁదరుమునా వైద్యుండే!! 40
కం.
అసువులఁబోసెడి దైవము
నసువుల నిలిపెడిని వెజ్జునంతయునొకరే
ఉసురులఁదీయు కరోనా
యుసురులఁదీసెడిని భూసురోత్తముడితడే!! 41
(వైద్యుడిని ఉత్తముడైన భూసురునిగా సంబోధించడం)
కం.
నిద్రాహారములనకను
క్షుద్రాదుల సమకరోన కుత్తుకఁగోయన్
భద్రముగా జాతి జనులు
ఛిద్రముగాక నిలుపునిల శ్రీహరి రూపమ్!! 42
కం.
రక్షణ భటులందరు, క్రమ
శిక్షణ తోడను కదనము జేసెడి ప్రజలన్
శిక్షలు వేయక నడుపుదు
రక్షయమగు కీర్తినొందనవనిన వీరుల్!! 43
కం.
ఎర్రటి ఎండకు గొడుగులు
బుర్రునఁ బోవు మనుజులకు బుద్ధులుజెప్పీ
సర్రునఁజేరగ లక్ష్యము
కొర్రిగ మారిన కరోనకు యమభటులిలన్!! 44
కం.
ఆశాదీపములట జను
లాశలు నిలుపగ నిలిచిన యారాద్యులనన్
ఆశాపాశముల విడచి
నిశాచగు కరోననణచ నిలిచిరినిలలో!! 45
కం.
కాలువ కంపును బాపగ
మేలగు సేవల సఫాయి మిత్రులునంతన్
కూలగఁజేయుచు మురికిని
ద్రోలగఁగలిసిరి కరోన దురితమునంతన్!! 46
కం.
కార్మిక వీరులు కాలువ
మార్మికమంతయు దొలగుట మాన్యముననుచున్
ధార్మిక రూపమునొందియు
యోర్మిన కర్మ లను జేతురుత్తములనగన్!! 47
కం.
విలయమునంతను ముంగిట
వలయము తీరుగ నిలిపెడి వార్తాహరులే
తెలుపుదురీ తీరుగ యీ
ప్రళయపు జాగ్రత్తలన్ని ప్రజలకునెపుడున్!! 48
కం.
అంకితభావము సేవన
శంకయు లేకను పలువిధ శస్త్రాస్త్రములన్
అంకము పూర్తగువరకును
జంకని వీరులు కరోన సంగరమందున్!! 49
కం.
వందనమందును వీరికి
చందనపరిమళపు సేవ సంఘముకంతన్
సుందరదేశపు ఖ్యాతికి
యందరు హేతువులటంచునందును నేనే!! 50
*ఆహారము*
-----------------
కం.
తినెడినియాహారము మన
కొనగూర్చును శక్తి యుక్తి కోకొల్లలుగన్
వనరుగ యోచించుము,కడు
తినదగు వాటినె తినుమనె తీవ్ర కరోనా!! 51
కం.
పోషకవిలువలు గనుచు, వి
శేషముగాఁదినగ, వచ్చు చెన్నుగ కాయమ్
దోషముఁగూర్చెడి వాన్ని
శ్శేషముగా వదలమనుచుఁజెప్పె కరోనా!! 52
కం.
పుల్లనిపండ్లేనిచ్చును
ఎల్లరికమితంపు శక్తినెచ్చటనైనన్
చల్లని వాటిని వదలుచు
మెల్లగ వేడిది పదార్థమెప్పుడు మేలౌ!! 53
కం.
మితముగ మాంసాహారము
సుతరముగాకను నొకపరి చూడగమేలౌ
సతతము వెచ్చని నీరే
నతి మేలగునీ కరోననావలికంపన్!! 54
*కాలుష్యము*
--------------------
కం.
వచ్చెనుకరోన రక్కసి
మెచ్చిన ప్రభువులు విలోకమెంతయొ చేసీ
తెచ్చిన నిర్భంధమునే
స్వచ్ఛతఁగూర్చె,కలుషితముఁజక్కగఁబోవన్!! 55
కం.
గడబిడ జాస్తినఁదిరుగుచు
వడిబెట్టెడు బైకులు మరి వాహనములనే
కడు చక్కగఁగట్టడియై
విడుచుచు భువినుండి బోయె విషకలుషితమే!! 56
కం.
ఏవీ బస్సులు కారులు
ఏవీ బైకులు మరేవి యెచ్చటలేవే
ఏవీ రాకను దారులు
తావున నిద్దురలుఁబోయెఁదన్మయమవగన్!! 57
కం.
శుద్ధిగఁజేసెను గాలిని
నిద్దురబోవునుపకార నిరతులనంతన్
ఇద్ధరణిని మేల్కొల్పుచు
బుద్ధులు నేర్పెను మనిషికి భువిని కరోనా!! 58
కం.
భయమే మనిషికి రోగము
భయమేనోటమికి మూల భావనమనగన్
భయమేనొకపరి మేలగు
భయమే కాటికిని పంపు పాపికరోనన్!! 59
కం.
కాలుష్యము నశియించెను
లాలిత్యము పెరిగెనిపుడు లావుగనిలలో పాలకులందరు గూడిరి భూలోకములో కరోన బూచినిఁదరుమన్!! 60
*మనోధైర్యము*
-------------------
కం.
ఉప్పెనలొకటై వచ్చిన
గప్పుననుండక సరియగు గమనమునెంచీ
యొప్పగు నిర్దేశమునే
జెప్పుమటంచును ప్రభుతకుఁజెప్పెఁగరోనా!! 61
కం.
బీరువులో నా నిలయము
ధీరునిలో నా విలాప దీనతలన్నీ
ఓరిమితోనుండిన నే
పారుదునునటంచుఁదెల్పె పాపి కరోనా!! 62
కం.
క్రౌర్యపుకరోన ప్రాణపు
చౌర్యమువీడియుఁదరలగ చయ్యన నీవే
ధైర్యము వీడకనుండియు
శౌర్యముఁజూపిన విజయము సాద్యముఁ గదరా!! 63
కం.
ధైర్యమె మనోబలమ్మగు
ధైర్యమె యోషధి గుణమగు దండిగనెపుడున్
ధైర్యమె కదనపు గెలుపగు
ధైర్యమెనగునీ కరోనఁదరుమగనస్త్రమ్!! 64
*మేలుకొలుపు*
-------------------
కం.
కోరక వచ్చిన మారీ
భూరిగ మాకే దెలిపెను పూజ్యపు గుణముల్
వైరిగనెంచక వానిని
నేరుపుతోడాచరించనెన్నో ఫలముల్!! 65
కం.
దానవులై హింసించెడి
మానవజాతికి దెలిపెను మానవ మతమున్
ఈ నవ జగతికి వలయును
కానగ వృద్ధిని కరోన కాలమునంతన్!! 66
కం.
సేవాభావమునొదలక
నీవూ నేనను విభేద నీమము వదలీ
భావావేశముఁజూపక
కావాలేకతని జెప్పె కఠిణకరోనా!! 67
కం.
జలుబూ జ్వరమూ దగ్గూ
నెలవైదెచ్చును కరోన నీ కాయమునన్
వలలో జిక్కిననంతట
విలవిలదన్నిన వదలదు పీఢకరోనా!! 68
కం.
వైరసు సోకిన వ్యక్తిని
చేరుచుఁదాకిననది దరిజేరును మనకున్
పారును తుంపర చేతను
దూరముఁబాటించ, రాదు దురిత కరోనా!! 69
కం.
రోగము నిర్దారించిన
ఆగము మదిలోనయంతటాలోచనతో
మూగుదురా వైద్యగణము
దాగుదురిండ్ల నిను గనక,తనమన యనకన్!! 70
కం.
మూతికి ముక్కుకు మాస్కులు
చేతికిఁదొడుగుల ముసుగులు చిక్కగవేసీ
చేతురు వైద్యమునంతట
చూతమునన్నఁగనరారు సొంతము వారున్!! 71
*పరిఢవిల్లిన ఐకమత్యము*
-------------------------
కం.
జాతిని నడిపిన బాపూ
భీతిని వదలియునొకటిగఁబ్రీతిగజేసెన్
నేతగ వెలుగుచు మోదీ
భూతల నేతలనునంత భూరిగఁగలిపెన్!! 72
కం.
ముప్పు ఘటించియు జెప్పిరి
యెప్పుడు కననేరనాపదిప్పుడు వచ్చెన్
ఇప్పుడె మేల్కొనుడని తా
నెప్పుడు మిము వీడనంచు నేతగ జెప్పెన్!! 73
కం.
జాతికి సందేశముతో
భీతికి వెరువక కదనపు పిలుపులనిచ్చెన్
నేతగ ప్రజలేకముకై
ప్రీతిగ చప్పట్లు,దీపవెలుగులఁగోరెన్!! 74
కం.
తరతమ భేదములేకను
నిరతము సహకారమునతి నేర్పున గోరెన్
సరగునను ముఖ్యమంత్రులు
పరుగున కార్యోన్ముఖులయి పంచిరి సేవల్!! 75
కం.
నేతలపిలుపులనందిరి
భూతల ప్రజలేకమైరి బూచిని దరుమన్
ప్రీతిగ నిర్భంధమునే
చేతల తోడాచరించ్రి క్షేమముకొఱకున్!! 76
కం.
శ్రామిక కార్మికులందరు
భూమిక పోషించు వైద్య పోలీసాశా
లా మీడియ మిత్రులు ఈ
ధామనివాసులు నడచిరి దారిననొకటై!! 77
కం.
ఉత్తర దక్షిణ ధృవములు
చిత్తమునెంచగొకటై విచిత్రము గొలుపన్
ఎత్తుకు పైయెత్తులు గల
జిత్తులదేశములొకటయె చీల్చఁగరోనన్!! 78
కం.
ఇడుములనెన్నో నోరిమి
విడువక భరియించ్రి జనులు విజయమునొందన్
నడుమన వదలిన కదనము
కడపట వీరులననెట్లు కదరా నరుడా!! 79
కం.
చేయూతగ నిలిచె ప్రభుత
చేయగ పనిలేని వారి చింతలు దీర్చన్
వాయికి కరువును దీర్చిరి
భీయము,పప్పులు సరిపడ బీదలకంతన్!! 80
కం.
కులమత భేదము మరచిరి
విలయమునణచగ సతతము ప్రేమలఁబంచీ
కలివిడితనమునఁగూడుచు
బలియుతులైరి బహుబాగ భారత ప్రజలున్!! 81
కం.
పాలక ప్రతిపక్షమనక
చాలగనేకతను జూపి సాగిరి నేతల్
మేలుగనుద్యోగులు మరి
కూలీలనకందరు వనగూడిరి యిచటన్!! 82
కం.
కేంద్రము రాష్ట్రములన్నియు
చంద్రార్కుల తీరు నిల్చి జగతిననంతన్
కేంద్రితమౌ కదనపు విజ
యేంద్రులుగా నిలువ నిలిచిరేకత తోడన్!! 83
*అప్రమత్తత*
*----------------*
కం.
పెనుముప్పును మదిగాంచిరి
వెనువెంటనె కార్యశిలి విజ్ఞులగూడీ
జనహితమగు సూచనలే
ననువుగఁదెలిపిరి యనుదినమాదేశములన్!! 84
కం.
ముందుగ వచ్చెడినాపద
లందుననేవిధ గమనములాచరణమ్మో
అందరితోడను గలిసియు
పొందుగయోచింపమనెను పూజ్యకరోనా!! 85
కం.
వచ్చెడి నష్టములెంతయొ
ఖచ్చితపంచనలు వేసి కదులుముననుచున్
చచ్చెడి వారినియాపుట
కచ్చపు వైద్యముఁగనమనె కఠిణకరోనా!! 86
కం.
తిండికి గింజలు తిప్పలు
మొండిగఁబ్రాకెడి బిమారి ముప్పును గనుచున్
దండిగ పిల్లలు బెంచుచు
నుండమని ప్రబోధఁజేసెనుర్వికినంతన్!! 87
కం.
మత్తుగనుండకనప్ర
మ్మత్తత తోడను మెలుగుట మంచిదియనుచున్
కుత్తుకఁదాకగనాగక
నెత్తుము కరవాలమనుచు నేర్పెకరోనా!! 88
కం.
వారించుట కొఱకంతట
పూరింపుము శంఖములని పొందుగనెపుడున్
సారించుము దృష్టినియని
మారి కరోన దెలిపెనిల మనిషికి హితమున్!! 89
*అభేదం చాటిన కరోన*
-------------------------
రోగము నేనై తెలిపెద
నాగముఁజేయుటకు ఏదయ కులము మతమూ?
ఆగను చిన్నాపెద్దా
రోగీ భోగీ మరేది రోఖోయన్నన్!! 90
కం.
రాజాజ్ఞకు లేవడ్డులు
రాజీపడరందునెందు రక్షక భటులై
రోజులు మావే కావని
బూజులు దీయమని జెప్పె బుద్ధిఁగరోనా!! 91
కం.
చిన్నాపెద్దాయనుచును
ఎన్నోరీతుల విభేదమెంచెడి నరుడా !
కన్నావా?నేనెంతని
నిన్నే మసిజేతునంచు నిలిచె కరోనా!! 92
కం.
మిద్దెల మేడల మధ్యన
శుద్ధిగనుండు పరుపుల సుషుప్తులఁగడిపే
బుద్ధుడ! రోగము వచ్చిన
నిద్దురలెక్కడనటంచు నిలిచె కరోనా!! 93
*పెల్లుబికిన దేశభక్తి*
----------------------
కం.
నేర్పెను కరోన మనకే
యోర్పుననెన్నో విషయములొక్కొక్కటిగన్
కూర్పుగ హిత సంజ్ఞలతో
నేర్పెనునతి దేశభక్తి నిండుగ వెలుగన్!! 94
కం.
కోరకు దేశద్రోహము
చేరకు దుష్టమగు సంఘ చేష్టలతోడన్
మీరకు నాయకుఁమాటను
సారెకు గాంచుము జనహిత సంగతులనగన్!! 95
కం.
ఒకటే మాటకు దేశము
నొకటై చప్పట్లఁజరిచెనొకటని చాటన్
ఒకటే మాటకు దేశము
నొకటే దీపమయి వెల్గె నూతనమనగన్!! 96
కం.
ఆసేతుహిమాచలమం
తాసినులైరింటనుండి తత్త్వముఁజాటెన్
వేసిన యీలలు క్రమ్మఱ
కూసే వరకీ యొరవడి కుదురుగనుండన్!! 97
కం.
వలపన్నెన్నొక మృగయుడు
తలనెరసి కపోతరాజు తలఁపును జెప్పన్
వలనే తన్నుక పోయిన
పలుకులునిపుడే నిజమగు భరతావనికే!! 98
కం.
ఒకరికి యొకరై పోరుము
మకరిగఁబీడించు పీఢమాన్పుట కొఱకై
వికలముఁజెందక నిరతము
సకలముఁబేర్చి దొలగించు శత్రువునిలలో!! 99
కం.
భక్తీ ముక్తీ వ్యక్తికె
శక్తీ యుక్తులను నొసగి స్వాస్త్యపు దేశా
సక్తిని పెంచుము,అటులగు
భక్తియె దేశము కొఱకని భావించెద నే!! 100
*సుపరిపాలన*
---------------------
కం.
ప్రజలకు శాంతీ సౌఖ్యము
ఋజువగు పాలననొసగిననెల్లరి మదిలో
అజునికి సమముగఁదలఁతురు
నిజమగు పాలకులనంత నిత్యమునిలలో!! 101
కం.
పాలకులందరునొకటై
చాలగఁబూనిరి ప్రజలకు సాయముఁజేయన్
వాలగనీయరునీగల
మేలుగనేలుదురిచట మమేకములగుచున్!! 102
కం.
పల్లే పట్నములంతట
నిల్లే వదలక గడుపగ నిర్భంధములో
గల్లీ గల్లీ దిరుగుచు
జల్లెడ పట్టిరధికార చర్యల చేతన్!! 103
కం.
బుస్సను పాములపడగై
లెస్సగ లేచెడి కరోన లేమిని జూడన్
డస్సీ కొనకను సేవల
లెస్సగ జేసెడధికారులే మన వీరుల్!! 104
కం.
ఎక్కడికక్కడ గస్తీ
చక్కగ జేసియు మనుజుల సక్రమవిధమున్
మిక్కిలిగానునొనర్చెడి
పెక్కగునధికారులంత పెన్నిధులందున్!! 105
కం.
ప్రథమము విద్యారోగ్యము
సతతము ప్రజలకునొసగుట సత్పరిపాలుం
డతి కర్తవ్యముగా మది
ని తలచియాచరణఁజేయు నిజ పాలకులై!! 106
కం.
తడయకు సమీక్షలంతట
కడువడితో జరుపుచుండి కార్యమునందున్
విడివడనడుగులు వేసిరి
కుడియెడమల గలిపి పాలకులు కదనమునన్!! 107
*కరోన గుర్తుచేసిన పొదుపు*
-------------------------
కం.
ఉన్నది చేయకు ఖర్చుగ
ఎన్నడొ యెక్కడొ కలుగును నే విపరీతమ్
చిన్నగ దాచినసొమ్మే
మిన్నగనుపకారమౌను మేదినిలోనన్!! 108
కం.
ఊహించని పరిణామము
స్వాహాయయి యార్థికమ్ము సర్వము కరుగున్
దేహీయని చేచాపక
నాహా! యన పొదుపుఁజేయమనెను కరోనా!! 109
కం.
మితముగఁజేయుము ఖర్చున
మితముగఁగాంచుము భవితను మిన్నగనుండన్
అతిజేసిన నీవాగము
సుతరము మరువకుమిదియనెఁజూడఁగరోనా!! 110
కం.
ఉన్నది తినుమిదియదనక
నిన్నటి రోజుల మరచియు నీమదిలో, ముం
దున్నది ముసళ్ళ పండుగ
నన్నది కనుమనె కరోననాలోచించన్!! 111
కం.
ఆదాయము సగమాయెను
పోదాయెనునీకరోన పూర్తిగనిపుడే
శోధించిన లేదాయెను
పోదోలగఁబీఢనంత పుడమిననెచటన్!! 112
*మేల్కొనిన పరోపకారం*
-------------------------
కం.
ఉపకారము మేల్కొనెనిల
విపరీతపు కాలమందు వేల్పుని రూపై
విపరీతము గాదిదియని
సుపథమ్మిది యంచు పేద క్షుత్తులు నింపన్!! 113
కం.
ఒకరికినొకరై నిలువగ
నొకపరి కోరగనొసగిరి ఓషధులెన్నో
సకలవిదేశములంతకు
పకారమెంచి మనదేశ పాడిని నిలుపన్!! 114
కం.
దాతలుఁగూడిరి, వేసిరి
చేతులు చాచిన జనులది చింతలుదీర్చన్
రాతలు నిలువగ చరితన
చేతను బూనిరి కలములు చేతనమివ్వన్!! 115
కం.
ఈ ధర చిత్రపు కరువై
మోదగ జనులకునిడుముల మోకున వచ్చెన్
పేదలయాకలిఁదీర్చగ
సాధులు భోజనమొసగిరి చక్కగనంతన్!! 116
కం.
ప్రభుతకు చేయూతనగా
నభముకు సమమగు గుణముననానందముగన్
విభవము తోడుతనిచ్చిరి
ప్రభువులు మెచ్చగ విరాళపత్రము దాతల్!! 117
కం.
వంటకు సరుకులనిచ్చిరి
ఇంటికి వచ్చియు జనులకునీ సమయమునన్
తంటగ మారిన వైరసు
నంటిన వారికినుచితమునగు వైద్యమ్మున్!! 118
కం.
విడిగా కేంద్రము రాష్ట్రము
వడిగా కడు పేదలైన వారికియంతన్
ఇడుముల దీరగఁకొంతయు
పడగాఁజేసిరి నగదును బ్యాంకులకౌంట్లన్!! 119
*కరోన తెచ్చిన కరువు*
-------------------------
కం.
కరువాయెనొకచొ తిండికి,
కరువాయెనునాసుపత్రికన్యపు రోగుల్
కరువాయెను మద్యమునకు
కరువాయెనునీకరోన కాటునకంతన్!! 120
కం.
పిచ్చిగఁజేసిరి కొందరు
నచ్చిన మద్యముదొరకకనాలుక గుంజన్
చచ్చెను తగవులునంతట
మెచ్చిరి పతులఁసతులాజ్ఞ మీరకయుండన్!! 121
*కరోన నేర్పిన నిగ్రహం*
-------------------------
కం.
కోరిక పుట్టలనణచుచు
నూరకఁదిరుగుటను మాని యుత్తముడగుచున్
సారెకు ప్రాపంచ గమన
పోరును దర్శింపుమనె ప్రబోధ కరోనా!! 122
కం.
మీరకనుండిరియాంక్షలు
చేరకనుండిరి పలువిధ స్నేహితగణమున్
భారమునైనను దాగిరి
వారము మరి నెలలనింట ప్రజలున్నతులై!! 123
కం.
ఆరాటమ్మణచిరి, యీ
పోరాటమ్మున నితరముఁబూర్తిగ మానీ
వీరోచిత పోరాటమె
యారాటమ్ముగను పూనిరంతటఁబ్రజలున్!! 124
*పోరాట స్ఫూర్తి*
----------------------
కం.
వచ్చిన ఉప్పెననణచగ
అచ్చపు దీక్షను సలుపుచునాగక పోరున్
ఖచ్చిత దారిన నడుచుచు
మెచ్చగ, పోరాట స్ఫూర్తి మీరకునెపుడున్!! 125
కం.
పట్టిన పట్టును వదలక
దిట్టముగా పోరు సలుపఁ దిరుగేలేకన్
మట్టినఁగలియును వైరియె
అట్టిది పోరాటమూనమనెను కరోనా!! 126
కం.
గెలుపు పొందువరకు మన
కలుపే లేదనుచు సాగనడ్డులు లేకన్
తలుపులు తట్టును విజయము
వలచును,ఇదియే జనులకు వలయు కరోనా!! 127
కం.
ఒకటే బాటను నడుచుచు
ఒకటై పోరుట సతతమునొప్పగు మనకున్
సకలముఁదెలిసిన నాయకు
లకలంకపు దారి సాగుమనెను కరోనా!! 128
కం
మారీచుని ద్రుంచిన భువి
మారీ! నీవెంత మాకు మడుచుట తథ్యం
దారేదియు లేదేదని
పోరే నడుపుచును నిన్ను పూడ్చుదుమిలలో!! 129
- కవిః సుధాశ్రీ బస్వోజు సుధాకరాచారి
వనపర్తి
చరవాణిః 9704840963
9154995582
Comments
Post a Comment
Your Comments Please: