బెంగళూరులో ఓ మద్యం షాపు ముందు మహిళల క్యూ
భీకర యుద్ధం ముగియలేదు. శత్రువు ఓటమిపాలు కాలేదు. యుద్ధంలో కూరుకుపోయిన మనకు విజయం ప్రాప్తించనూలేదు. కానీ విజయోత్సాహాన్ని మించిన వేడుక జరుగుతోంది. నెలా పదిహేను రోజులుగా చుక్క మందుకు నోచుకోని సగటుజీవి గడపదాటి తెరిపిన పడేందుకు వైన్ షాపుల ముందు క్యూ కట్టాడు. ప్రేయసిని మించిన ప్రేయసి కోసం గంటలకొద్దీ వెయిట్ చేశాడు. ఎదురుచూపులు చూసిచూసి, యుగాలతో పోల్చదగిన ఎడబాటును ఎంతో ఓర్పుతో భరించిన మందుబాబు... చుక్కమ్మను అపురూపంగా అందుకున్న అరుదైన ఘట్టం భారతావని అంతటా ఆవిష్కృతమైంది. అంతేనా? మేమేం తక్కువ, ఎందులో తక్కువ అంటూ మహిళామణులు కూడా క్యూ కట్టడం విస్తుగొలిపే అంశం.
కర్నాటక, ఏపీ, గోవా, రాజస్థాన్, యూపీ.. ఇలా అనేక రాష్ట్రాలు లిక్కర్ అమ్మకాలకు ద్వారాలు తెరిచాయి. ఒకవైపు లాక్ డౌన్ ను మూడోసారి పొడిగిస్తూ నిర్ణయం ప్రకటించిన కేంద్రం.. అందుకు పూర్తి విరుద్ధమైన మరో నిర్ణయం తీసుకోవడం విడ్డూరం కాకపోయినా తెలివిలేని, పనికిమాలిన, సిగ్గుమాలిన నిర్ణయంగా రుజువైపోయింది. లాక్ డౌన్ కఠినతరం చేస్తూ పొడిగించడం ఏంటి? లిక్కర్ అమ్మకాలకు అనుమతులివ్వడమేంటి? మూడుసార్లు ప్రధాని మీడియా ముందుకొచ్చి, ప్రతిసారీ అరగంటపాటు ఆర్ద్రంగా ఉపన్యాసమిచ్చి, ఇంట్లోనుంచి బయటకు రావద్దని చేతులెత్తి మొక్కి... ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
కర్నాటకలోని బెల్గాంలో తొలి గిరాకీ చేస్తున్న మందుబాబుకు సన్మానం
అటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ అమలు విషయంలోనే పూర్తిగా విజయవంతం కాలేని పరిస్థితుల్లో లిక్కర్ షాపులు బార్లా తెరిచి ఏ విధంగా సోషల్ డిస్టెన్స్ ను మెయింటెయిన్ చేద్దామనుకుంటున్నారు? ఈ నిర్ణయం ఏ ప్రజల బాగోగుల కోసం తీసుకున్నట్టు? వలస కూలీలకు ఇన్నాళ్లూ సరిగా తిండి పెట్టక, ఎన్జీవోల సహాయంతో భోజన ఏర్పాట్లను గట్టెక్కించిన పాలకులు.. ఇప్పుడు మందు మాత్రం పోస్తున్నారంటే అర్థమేంటి? వాళ్లకు లాక్ డౌన్ కన్నా, ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కన్నా ఖజానా మాత్రమే ముఖ్యమని తెలుస్తోంది కదా. మందు లేకపోతే ప్రజల సంగతి దేవుడెరుగు.. ప్రభుత్వాలకే శోష వచ్చేట్టు కనిపిస్తున్నమాట తేటతెల్లమైపోయింది. సరిగా ఇవాళ్టి రోజున ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయో.. ఎన్నింటిని దాచిపెట్టారో.. ఎన్నింటిని కాగితాల మీదికి ఎక్కించారో.. ఎక్కించకుండా ఎన్ని కోట్ల మందిని మభ్యపెడతారో అంత ఈజీగా నిర్ధారణకు వచ్చే అంశం కాదు. మరి దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారు? ఎవరి ఖాతా నుంచి రాబడతారు? లిక్కర్ ఆదాయాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో పంచుకుంటాయి?
ఏపీ సీఎం ఏం చెబుతారు?
ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దశలవారీగా మద్యనిషేధాన్ని నవరత్నాల్లో భాగంగా ఇప్పటికే మొదలుపెట్టారు. అటు కేంద్రం లిక్కర్ అమ్ముకోవచ్చని చెప్పిందో లేదో.. ఇక్కడ షాపులు బార్లా తెరిచారు. కిలోమీటర్ల కొద్దీ జనాలు క్యూ కట్టారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని తెలిసినా.. టెస్టుల సంఖ్యను పెంచి అందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమైన జగన్ ధైర్యం.. లిక్కర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది? అటు డాక్టర్లు కానీ, సామాజికవేత్తలు గానీ... మందు మానేయాలనుకునేవారైనా, మందును నిషేధించాలనుకుంటున్నవారికైనా ఇదే మంచి తరుణమని చెప్పడాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఈ క్రమంలో తెలంగాణ సర్కారు ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.
ఏపీలో ఓ వైన్ షాపు ముందు భారీ క్యూ
అటు యువతులు కూడా భారీ సంఖ్యలో క్యూ కట్టారు. కర్నాటకలో వారికోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మద్య నిషేధం అమలు కావాలన్నా, ఒకచోట ఉండే షాపులు ఎత్తేయాలన్నా మహిళలతోనే సాధ్యం. ఇప్పటికే పలు మహిళా సంఘాలు సంపూర్ణ మద్య నిషేధం కోసం పని చేస్తున్నాయి. మరి కుటుంబం పట్లగానీ, బాధ్యతల విషయంలో గానీ పురుషుల కన్నా మహిళలే సమర్థంగా వ్యవహరిస్తారన్న పేరు కాస్తా.. తాజా లిక్కర్ బ్యాన్ ఎత్తివేతతో అదంతా వట్టిదేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముందుచూపు లేకుండా తీసుకున్న లిక్కర్ అమ్మకాల నిర్ణయాన్ని రద్దు చేస్తారా.. లేక నియంత్రిస్తారా.. ఏదో ఒకటి సత్వరమే సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరముంది.
Comments
Post a Comment
Your Comments Please: