Photo Credit: Business Standard
ప్రపంచవ్యాప్తంగా కరోనా మీద వెనుకంజ వేయని రీతిలో యుద్ధం కొనసాగిస్తున్న దేశంగా మన దేశానికి ఒక మంచి పేరు వచ్చింది. అయితే అదే కరోనా మీద యుద్ధంలో రాజీపడటంతో ప్రభుత్వానికి వచ్చిన ఆ మంచిపేరు కూడా నెగెటివ్ గా మారిపోతోంది. ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా కరోనా మీద ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతుండడం విశేషం. మరోవైపు కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి కాలే కడుపులతో కాలి నడకన వందలు, వేల కిలోమీటర్ల దూరం వెళ్తున్న వలస కూలీలకు ఇప్పటివరకు కేంద్రం వైపు నుంచి చెప్పుకోదగ్గ ఆసరా అందకపోవడం ఆశ్చర్యం గొలుపుతున్న అంశం.
ఈ దేశ ప్రగతి చక్రానికి ఇరుసులా పనిచేసిన వలస కూలీలకు, తమ శ్రమతో, చెమట చుక్కలతో ఉన్నత కుటుంబాలకు ఇంద్ర భవనాలు నిర్మించి ఇచ్చిన అనామక శ్రామికులకు కనీసం లాక్ డౌన్ సమయంలోనైనా రెండు పూటలా నాలుగు ముద్దలు అందించలేకపోయింది మన దేశం. వాళ్ల పూట గడిస్తేనే పెద్దోళ్ల ఏసీలు తిరుగుతాయి. వాళ్ల చెమట చుక్కలు రాలితేనే ఖరీదైన విల్లాలు, రియల్ బిజినెస్ లు స్టాక్ మార్కెట్ తెరల మీద రివ్వుమంటూ దూసుకుపోతాయి. ఏ ఒక్క కార్పొరేట్ బిజినెస్ పేజీలో కూడా వారి కోసం కాసింత చోటు దక్కని సేవామూర్తులకు పట్టెడంత అన్నం పెట్టలేకపోయినందువల్లే వేలాది కిలోమీటర్లు నడిచే సాహసానికి పూనుకున్నారు. మరి అలాంటివారి కోసమైనా కనీసం 5 వేల రూపాయలు జమ చేయాలన్న ఆలోచన మోడీ సర్కారుకు కలగలేదెందుకు.. అసలు ఈ దేశం పేద ప్రజలకోసమేనా.. వారి కోసం ఆలోచించే పాలకులున్నారా.. ఉంటే ఏరీ.. కనిపించరే...
నెలకు 20 వేల లోపు జీతాలకు పనిచేసే మధ్యతరగతి ప్రజల కోసం ఒక్క పచ్చనోటైనా ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు కలగలేదు... ఈ దేశ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన బడాబాబుల అప్పులకు వెసులుబాటు కల్పించిన సర్కారు... రెండు నెలలు దేశ ప్రజల్ని ఇంటికే పరిమితం చేసి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసి లాక్ డౌన్ పేరుతో 20 లక్షల కోట్లు ప్యాకేజీ అంటూ దేశ ప్రజల నడ్డి విరిచిన కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అసలు లాక్ డౌన్ ఎందుకు పెట్టినట్టు.. ఎందుకు తీసినట్టు? ఏమైనా వ్యాక్సిన్ వచ్చిందా? లేక అన్ని విధాలుగా దేశప్రజలతో ఆడుకున్నం కేంద్రం.. ఇంకా ఆ ప్రజల్ని ఎలా సతాయించాలో తెలియక వదిలేసిందే తప్ప.. తెలిస్తే మాత్రం ఆ మిగిలిన కుతంత్రాలు కూడా చేసి ఉండేదన్న వ్యాఖ్యానాలు సామాన్య జనం నుంచి వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి ఇంకా ఎలాంటి ఉపద్రవాలు తీసుకొస్తుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది. దేశ ప్రజలచేత చపట్లు కొట్టించి, దీపాలు వెలిగించి ప్రజలకు తామేదో చేయబోతున్నామన్న సంకేతాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప మోదీ ప్రభుత్వం సామాన్యుడికి ఏమైనా చేసిందా అని సామాన్య జనం నిలదీస్తున్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీని రోజువారీ ప్రసంగాల కింద డెయిలీ సీరియల్ కింద ప్రకటించడమే తప్ప.. అందులో ఒక్క అంశమైనా సామాన్యుడికి ఉపయోగపడే అంశం ఉందాని కోట్లాది మంది వలస కూలీలు అడుగుతున్నారు. ఒక్కప్పుడు పేదల పేరుతో పథకాలు ఇచ్చారు ఇప్పుడు రైతుల పేరుతో పథకాలు తయారు చేశారు..అంతే గానీ అసలైన ఆఖరు లబ్దిదారుగా ఉన్న సగటు కూలీకి, కింది స్థాయి రైతుకు కేంద్రం నిధులు గానీ, రాష్ట్రం నిధులు గానీ అందుతున్నాయా? ఏ ప్రభుత్వం ఆసరా కూడా అందనివారి లెక్కలు ఎవరికైనా తెలుసా? వారిగురించి అడిగేవారెవరు? వారి పద్దుల గురించి ప్రశ్నించేవారెవరు? ఇన్నాళ్లూ ఆత్మగౌరవంతో బతికి ఆఖరుకు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఎవరికి చేయి చాపాలో అర్థం కాక, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకోవాలా? చావక ముందు అందని ఆపన్న హస్తం... మనిషి చచ్చిపోయాక ఏం చేసుకోవడానికి? అని కోట్లాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు అడుగుతున్నారు.
ప్రజల నుంచి వస్తున్న విమర్శల్లో వాస్తవాలను గ్రహించి అయినా పేదోడి ఖాతాలోకి ఇంత నగదు వేసే ఆలోచన చేయాలన్న ఆక్రందనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Comments
Post a Comment
Your Comments Please: