ప్రాణం విడుస్తూ ఓ యువకుడు తీసిన వీడియో తెలుగు మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ లో కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న యువకుడికి అకస్మాత్తుగా వెంటిలేటర్ తీసేశారని స్వయంగా బాధితుడే సెల్ఫీ వీడియో తీసుకొని తండ్రిని ఉద్దేశించి చివరిమాటలు మాట్లాడటం రాష్ట్రంలో కరోనా భయంకర రూపం దాలుస్తున్న విషయాన్ని కళ్లకు కట్టింది.
డాడీ.. నాకు ఊపిరాడ్తలేదు డాడీ.. వద్దనంగా వెంటిలేటర్ తీసిండ్రు. మూడు గంటలైతంది డాడీ.. నా గుండె ఆగిపోయింది. కిడ్నీ ఫెయిలైంది. ఊపిరొక్కటే ఆడ్తంది.. ఇప్పుడు అది గూడ అయిపోయింది డాడీ.. బాయ్ డాడీ.. బాయ్. ఇవీ ఆ యువకుడి చివరి మాటలు.
కరోనా ఉధృతిని, దాని వ్యాప్తిని అత్యంత ముందుచూపున్న నేతలుగా పేరున్నవారు కూడా అంచనా వేయలేకపోయారు అనడానికి ఇది మరో నిదర్శనం. మొన్న 28 ఏళ్ల యువ జర్నలిస్టు మనోజ్ గాంధీలో చికిత్స సరిగా అందక చనిపోవడం మరుపునకు రాకముందే మరో నవయువకుడు కరోనా కోరలకు చూస్తూ చూస్తూ బలైపోవడం ప్రజలకు జీర్ణం కాని విషయం. కరోనా అనేది తెలంగాణకు రమ్మన్నా రాదు.. నీ దండం బెడ్తా రావే అంటె గూడ రాదు.. అన్న మాటల్ని ఓసారి మననం చేసుకుంటే మన నేతలు కరోనా విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికీ ఇది వర్తిస్తుంది. కనీసం ఇప్పుడైనా మన నేతలు కళ్లు తెరుస్తారా.. మెరుగైన నిర్ణయం తీసుకుంటారా.. ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇదే.
ఆలస్యంగా పాజిటివ్ అని తేలడంతో ఆందోళనలో బంధువులు
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని బి.జే.ఆర్ నగర్ కు చెందిన ఆ యువకుడు మృతి చెందే కొన్ని నిమిషాల ముందు తన ఫోన్ లో తీసుకున్న వీడియో విపరీతమైన వైరల్ అవుతోంది. ఈ దయనీయ పరిస్థితి ఒక ఎత్తైతే మరో పెను ప్రమాదం జవహర్ నగర్ కు పొంచి వుంది. కరోనా లక్షణాలతో చికిత్స తీసుకుంటున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున మరణించిన ఆ యువకుడి మృత దేహాన్ని టెస్టు రిపోర్టులు రాకముందే హుటాహుటిన కుటుంబ సభ్యులకు అప్పజెప్పి చేతులు దులుపుకుంది ఆసుపత్రి యాజమాన్యం.
What KCR Says: మూడు, నాలుగు రోజుల్లో కరోనా వ్యూహం ఖరారు-కేసీఆర్
What Revanth Asks: రేవంత్ డిమాండ్- తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
దీనిపై సరైన అవగాహన లేని కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో సుమారు 30 మంది పాల్గొన్నారు. అంత్రక్రియలు జరిగిన మరసటి రోజు శనివారం ఉదయం కరోనా పాజిటివ్ అని తెలడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అసలు విషయం తెలియకపోవడం వల్ల అమాయకంగా అంత్యక్రియల్లో పాల్గొన్నవారి విషయంలో జవహర్ నగర్ అధికారులు వెంటనే స్పందించి వారిని క్వారంటైన్ చేసి కరోనా పరీక్షలు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. ఇంకోవైపు కరోనా సోకిన విషయం తెలియక కుటుంబ సభ్యులు,మృతుడు గత కొన్ని రోజులుగా అనేక మందిని కలిసుంటారు కాబట్టి బి.జే.ఆర్ నగర్ ను కంటోన్మెంట్ ఏరియాగా ప్రకటిమచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Post a Comment
Your Comments Please: