జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజులపాటు తిరిగి లాక్ డౌన్ విధాంచాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీ లేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
Also Read: బై డాడీ - ఆఖరి మాటల సెల్ఫీ వీడియో
వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ సమావేశంలో పరిస్థితిని వివరించారు. ‘‘దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నది. అదే క్రమంలో తెలంగాణలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జాతీయ సగటులో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య కూడా తక్కువే. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. పాజిటివ్ గా తేలిన వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా వేలాది బెడ్లు సిద్ధం చేశాం. సీరియస్ పేషంట్లకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. వ్యాధి లక్షణాలు లేని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నాం’’ అని ఈటల రాజెందర్ వివరించారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో కూడా తెలంగాణలో వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. కోవిడ్ వల్ల మరణించిన వారి జాతీయ సగటు 3.04 ఉండగా, తెలంగాణలో అది కేవలం 1.52 మాత్రమే అని ఆమె అన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ గా తేలిన వారికి తగు వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిపై సుదీర్ఘ చర్చ
జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. జిహెచ్ఎంసి పరిధిలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మరోసారి 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలనేది వైద్యాధికారులు, వైద్య నిపుణులు కోరుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ చెప్పారు.
‘‘హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద నగరం. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువున్న క్రమంలో హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి ఉండడం సహజం. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజల కదలిక పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్ డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలు కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయి. హైదారాబాద్ లో కూడా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. కేబినెట్ ను సమావేశ పరచాలి. అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో కేబినెట్ ను సమావేశ పరిచి, జిహెచ్ఎంసి పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని సిఎం కేసీఆర్ చెప్పారు.
’జిహెచ్ఎంసి పరిధిలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించుకుంటే అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది లాక్ డౌన్ విధిస్తే కట్టుదిట్టంగా, సంపూర్ణంగా అమలు చేయాల్సి ఉంటుంది. నిత్యావసర సరుకులు కోనుగోళు చేసుకోవటానికి వీలుగా ఒకటి రెండు గంటలు మాత్రమే సడలింపు ఇచ్చి రోజంతా ఖర్ఫ్యూ విధించాల్సి ఉంటుంది. విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపాల్సి ఉంటుంది. ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలని లోతుగా పరిశీలించి అవసరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది’’ అని కేసీఆర్ వివరించారు.
Comments
Post a Comment
Your Comments Please: