పనికి ముందుండి తిండికి వెనకుండే విశ్వబ్రాహ్మలను ఆదుకోవాలని, ఈ సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తించి కష్టకాలంలో ఆదుకోవాలని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు, ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ - విశ్వకర్మ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చేపూరి లక్ష్మణాచారి ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. కరోనా విజృంభించి, లాక్ డౌన్ విధించిన తరువాత అందరికంటే ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులే జీవనోపాధి కోల్పోయారని, పనులు చేయించుకునేవారు లేక జీవనోపాధి కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాయి ఇళ్లు, ఇరుకైన ఇళ్లలో పిల్లాపాపలతో జీవించడం ఎంతో కష్టంగా ఉందని, తెలంగాణ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇకనైనా పూర్తి చేసి పేదలకు కనీస వసతులు సమకూర్చాలని లక్ష్మణాచారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సిద్ధించి ఆరేళ్లు పూర్తయినా విశ్వబ్రాహ్మలకు ఎలాంటి ప్రభుత్వ పథకాలూ అందలేదన్నారు. ఎన్నికలకు ముందు రుణాలు ఇస్తామన్న కేసీఆర్ ఎన్నికలు పూర్తయ్యాక కనీసం తాము పెట్టుకున్న అప్లికేషన్ల స్టేటస్ ఏంటో కూడా తెలిపే పరిస్థితి లేదన్నారు. కనీసం తమకు లోన్లు ఇచ్చినా ఏదో రకంగా ఈ కరోనా కష్టకాలాన్ని అధిగమించేవారమన్నారు. తమకు లోన్లు ఇవ్వక, ప్రభుత్వ సాయం అందక ఏ ఉపాధీ లేని పేదలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, కంసాలి పని చేసుకొని పొట్ట పోసుకునే విశ్వబ్రాహ్మలకు పూట గడవడం లేదని, తమ ఐదు వృత్తులు కూడా దారుణంగా దెబ్బ తిన్నాయన్నారు.
అందుకే కరోనా పీరియడ్ లో అత్యవసరంగా తమ జాతివారికి ఒక్కో కుటుంబానికి నెలకు కనీసం రూ. 10 వేల చొప్పున కనీసం 6 నెలలపాటైనా అందించాలని కోరారు. అలాగే 55 సంవత్సరాలు నిండినవారికి రూ. 2 వేల పింఛను ఇవ్వాలని, ఓల్డ్ సిటీలోని ఉప్పుగూడలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఉప్పుగూడ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని, త్వరలోనే తమ పోరాట కార్యక్రమాన్ని ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణాచారితో పాటు ఉప్పుగూడ సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్ష్యుడు సజ్జనపు షణ్ముఖాచారి, ప్రధానకార్యదర్శి తోట శ్రీనివాసాచారి, కోశాధికారి లక్కుంట్ల శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షులు కూరెళ్ల బాలకృష్ణాచారి, దాసోజు కనకాచారి, పోలోజు దక్షిణామూర్తి, మేడిపల్లి వెంకటేశాచారి, జేఎస్ లు దాసోజు లక్ష్మణాచారి, వలబోజు రవి కిరణ్ ఆచారి, గౌరవాధ్యక్షులు కేశోజు వెంకటాచారి, జెలపల్లి లక్ష్మీ నారాయణాచారి, సభ్యులు చాట్లపల్లి ప్రభాకరాచారి, బోనాల మధుసూదనాచారి, కొక్కొండ కిరణ్ కుమార్ ఆచారి, ఆకోజు జ్ఞానేశ్వరాచారి, ఓరువాళ్ళ వీరేశాచారి, తిప్పర్తి రాజు ఆచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: