రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని లేకపోతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. టెస్టులు పెంచాలని ఐసీఎంఆర్ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వం చేసే అంతంత మాత్రం టెస్టుల్లోనే రాష్ట్రంలో 32.1 శాతం మేరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో కరాళ నృత్యం చేస్తుందో ఈ పర్సెంటేజీలే నిదర్శనం అన్నారు. లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం కాంగ్రెస్ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనుక కేసీఆర్ ఒత్తిడే ఉందని, ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలను సమీకృతం చేసి కరోనాను ఎదుర్కొనే ప్రణాళిక రచించాలని రేవంత్ సూచించారు. కరోనా విషయంలో కేసీఆర్ సర్కారు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వీఐపీల ప్రాణాలకు ఇస్తున్న విలువ పేద-మధ్యతరగతికి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం కంటే స్మశానానికి వెళ్లడం మేలు అన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వస్తున్నారన్నారు. సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఎగతాళి చేసిన కేసీఆర్ పారాసిటమల్ వేసుకుంటే చాలని ప్రజలను తప్పుదోవపట్టించారన్నారు. ఉడుకు నీళ్లు తాగితే కరోనా పోతుందని మంత్రులు కూడా బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేశారని గుర్తు చేశారు.
Also Read: బై డాడీ - ఆఖరి మాటల సెల్ఫీ వీడియో
పరిస్థితులు అనుకూలంగా ఉంటే మీడియా ముందుకు రావడం... ప్రతికూలంగా ఉంటే మొఖం చాటేయడం అలవాటుగా మారిందని, నాలుగు కోట్ల మంది ప్రజలకు గాంధీ ఆసుపత్రి ఒక్కటే దిక్కయ్యే దుస్థితి కల్పించారని, టిమ్స్ ఆసుపత్రి విషయంలో హడావుడే తప్ప ప్రారంభానికి ఎందుకు నోచుకోవడం లేదని నిలదీశారు. తమపై ఒత్తిడి పెరుగుతోందని గాంధీ వైద్యులు రోడెక్కినా పట్టించుకున్న నాథుడు లేడని, ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్ని అనుసరించమని మొదటి నుంచి మొత్తుకుంటున్నా కేసీఆర్ చెవికెక్కడం లేదని దుయ్యబట్టారు. కరోనా లెక్కల విషయంలో హైకోర్టును కూడా తప్పుదోవపట్టించారని, వైద్య శాఖనే సమర్ధంగా నిర్వహించలేని మీరు సీఎంగా ఎలా పని కొస్తారని విమర్శించారు. మీ అతి తెలివి పక్కన పెట్టి ఇప్పటికైనా నిపుణులతో కమిటీ వేయాలని, అఖిలపక్షాన్ని పిలిచి ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు.
Comments
Post a Comment
Your Comments Please: