Skip to main content

రోడ్డు మీద పడ్డ అత్యంత వెనుకబడ్డ కులాలు



- కె.సి.కాళప్ప, జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు

   9848451544

 

భారత ప్రజలకు స్వాతంత్య్రం రాకముందు కులవృత్తులు చేసుకునే ప్రజలు ఎంతో గౌరవంగా బతికారు. ఆదాయం పెద్దగా లేకపోయినా సమాజమంతా వారి వృత్తుల మీదనే ఆధారపడి నడిచినందువల్ల ఆయా వృత్తి కులాల్లో ఆకలికేకల జాడ కనిపించలేదు. ఉన్నంతలో సంతృప్తిగానే కుటుంబాలు వెళ్లదీసుకున్నారు. మిగతా ఉన్నతవర్గాలతో, ధనవంతులతో పోల్చుకుంటే వారు పేదరికంలోనే ఉన్నప్పటికీ స్వయంసమృద్ధిగానే వృత్తిపని సమాజం బతికింది. ఈ పరిస్థితి స్వాతంత్య్రం తరువాత దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కూడా కొనసాగింది. 1990ల్లో ఆర్థిక సంస్కరణలు మొదలైన తరువాత వృత్తిపని సమాజంలో ఒక్కసారిగా పెనుమార్పులు సంభవించాయి. చేతివృత్తులు రోజురోజుకూ పూర్తిగా కనుమరుగైపోతూ విశాల ప్రపంచం నుంచి అనేక అవసరం లేని వస్తువులు సైతం మన ఇళ్లను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో మన దేశ చేతివృత్తులు చేసుకునే ప్రజలకు ఆదరువు లేకుండాపోయింది. 



ఈ పరిస్థితులు ఇలా ఉంటే కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఐదో దఫా లాక్ డౌన్ నడుస్తోంది. లాక్ డౌన్ లో సడలింపుల కారణంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. ఇప్పటికే రెండు నెలలకు పైగా ఉపాధి లేక చేతివృత్తులు చేసుకునే లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. తాజాగా ఐదో దఫా లాక్ డౌన్ నడుస్తున్న కారణంగా ఉపాధి మెరుగుపడే పరిస్థితులు మరికొన్ని నెలలపాటు కూడా కనిపించే దాఖలాలలు లేకుండా పోయాయి. 

 

ఇప్పటికీ చేతివృత్తినే నమ్ముకొని జీవించే కులాల ప్రజలతో పాటు సంచారజాతుల ప్రజల్ని కూడా కలుపుకుంటే తెలంగాణలో సుమారు 98 లక్షల మంది అవుతున్నారు. ఇలా రాష్ట్ర జనాభాలో వీరి సంఖ్య 32 - 33 శాతంగా ఉంది. చేతివృత్తులు చేసుకునేవారంతా అత్యంత వెనుకబడిన తరగతుల ప్రజలే కావడాన్ని జాగ్రత్తగా గమనించాలి. జాతీయ మోస్ట్ బ్యాక్ వార్డ్ క్లాసెస్ (ఎంబీసీ) ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో జరిపిన పరిశోధనల్లో ఈ లెక్కలు బయటపడ్డాయి. ఇదే విషయం ఇటీవల వలస కూలీల రూపంలో మన పేదరికపు విశ్వరూపం యావత్ సమాజం కళ్లకు కట్టింది. క్షేత్రస్థాయి అవగాహనతో చెబుతున్న లెక్కలను ప్రభుత్వాలు గమనంలోకి తీసుకుని ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తే ఈ దేశ జనాభాలో అతిపెద్ద సెక్షన్ ను ఆదుకున్నట్లవుతుంది. అత్యంత వెనుకబడిన కులాలు, సంచారజాతులకు చెందిన ప్రజలే భవన నిర్మాణ రంగంలో కూలీలు, అడ్డా కూలీల అవతారం ఎత్తారని మరువరాదు. తెలంగాణలో ఉన్న 20 లక్షల ఎంబీసీ కుటుంబాల్లో అత్యవసరంగా కనీసం 10 లక్షల కుటుంబాలకైనా తక్షణ సాయాన్ని అందించాల్సి ఉంది.

 

 

ఉపాధి కోల్పోయి దెబ్బతిన్న కులాలు ఇవే

షాపులు, మడిగెలు దాదాపు రెండు నెలలు మూసేసిన అనంతరం నాయీబ్రాహ్మణులు ఇటీవలే దుకాణాలు తెరిచారు. అయితే కరోనా విశృంఖల వ్యాప్తి, మరణాల రేటు పెరుగుతున్న కారణంగా మంగళిషాపులకు ఎవరూ రావడం లేదు. చాలావరకు ప్రజలు వారి ఇళ్లకే పరిమితమై క్షవరం, షేవింగ్ లు చేసుకుంటున్నట్లు నాయీబ్రాహ్మణ సోదరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యే జాడలు కనిపించడం లేదని, దుకాణాల రెంట్లు, కరెంటు బిల్లులు కట్టుకునే పరిస్థితుల్లేవని, షాపుల్లో రోజుకూలీ చేసుకునే అనేక మంది యువకులు, వారి కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయని అనేక మంది నాయీబ్రాహ్మణ సోదరుల నుంచి విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే వాషింగ్ మెషీన్ల రాకతో ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్న రజక వృత్తిలో.. ఆ మహిళలు పట్నంలోని పలువురి ఇళ్లలో పనివారుగా కుదురుకున్నారు. అయితే వారి యజమానులు కూడా ఉపాధి కోల్పోవడంతో వీరి పరిస్థితికి దిక్కు లేకుండా పోయింది. అలాగే తెలంగాణలో చెప్పుకోదగ్గ పెద్దసంఖ్యలో ఉన్న మరో వృత్తి పని సమాజం విశ్వబ్రాహ్మణులు. విశ్వబ్రాహ్మణుల్లో ముఖ్యంగా ఐదు వృత్తులు చేసుకుని జీవించే కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, కంసాలి ప్రజలున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా వారిలో ఏ ఒక్కరి పని కూడా సాగడం లేదు. దీంతో లక్షలాది మంది విశ్వకర్మలకు ఉపాధి లేకుండాపోయింది. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు మళ్లీ దాపురించాయని విశ్వబ్రాహ్మణ సోదరులు అనేక వేదికల మీద ఆందోళన చెందుతుండటం గమనించాల్సిన అంశం. పట్టణాల్లో, మైదాన ప్రాంత గ్రామాల్లో పాత గుడ్డలకు స్టీలు, అల్యూమినియం పాత్రలు ఎక్స్ చేంజ్ చేసి ఇచ్చే వీరభద్రీయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రజలు ఉపాధి కోల్పోయి, ఆఫీసులకు వెళ్లకుండా అటు కొత్త బట్టలు కొనుక్కునే మార్గం లేక పాతవాటితోనే వెళ్లదీస్తున్నారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా తిరిగే వీరభద్రీయ సోదరులకు ఉపాధి కనుమరుగైంది. తట్టలు, బుట్టలు అల్లుకొని పొట్టపోసుకునే మేదరి సోదరుల పరిస్థితి కూడా దారుణంగా దిగజారిపోయింది. బోనాల పండుగ వస్తోందంటే వీరికి చేతినిండా పని ఉండే సందర్భాన్ని గుర్తు తెచ్చుకోవాలి. కానీ కరోనా కారణంగా సామూహికంగా నిర్వహించుకునే పండుగలపై వేటు పడి లాంఛనంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన కారణంగా ఉత్సవాలకు ఈసారి ఆస్కారం లేకుండాపోయింది. రోడ్డు మీదనే చిన్న షాపులు పెట్టుకొని మటన్ అమ్మే ఆరెకటిక సోదరుల పరిస్థితి కూడా ఇటీవలి లాక్ డౌన్ పీరియడ్ తో కోలుకోకుండా తయారైంది. అలాగే పట్టెడన్నం కోసం తమ సంస్కృతిని ప్రదర్శిస్తూ రోజంతా బిచ్చమెత్తుతూ సంచరించే దాసరి, దొమ్మర, కాటిపాపల, మొండిబండ, వంశరాజ్ వారేకాక... తమ పశువులకు కనీసం మేత కూడా వేయలేని దీనస్థితిలో గంగిరెద్దులవారు కొట్టుమిట్టాడుతున్నారు. వీరముష్టి, కాశికాపుడి వంటి చేతికష్టాన్నే నమ్ముకున్న అనేక వేలాది మంది బడుగులు నోట్లోకి ఐదువేళ్లూ పోయే పరిస్థితులు లేక రోడ్డునపడ్డారు. నిత్యావసర వస్తువైన నూనె తయారుచేసే గాండ్ల, వ్యవసాయం, గొర్రెల పెంపకంతో ఆర్థిక వృద్ధికి దోహదపడే కుర్మ, దర్జీ పని చేసే మేరు, కాచి, నీలికులస్తులు, భవన నిర్మాణ రంగానికి వెన్నెముకగా ఉన్న ఉప్పరులు (సగరులు), ప్రాచీన కళావైభవానికి, గృహోపకరణాల తయారీలో అగ్రభాగంలో ఉన్న కుమ్మరులు, ఇంకా వాల్మీకి బోయ వంటి దాదాపు 110 కులాల నుంచి 20 లక్షల కుటుంబాలకు జీవనోపాధి కరవైంది. ఈ శతాబ్దంలోనే ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి.  

 

 

పైన చెప్పుకున్న అత్యంత వెనుకబడిన కులాలకు అన్నం దొరకడం కూడా కష్టంగా మారిన పరిస్థితుల నేపథ్యం నుంచే 2003లో ఆహార భద్రత పథకాన్ని యూపీఏ హయాంలో ముందుచూపుతో తీసుకొచ్చారు. కానీ ఆహారభద్రత కార్యక్రమాన్ని ఆ తరువాత వచ్చిన పాలకులు తేలిగ్గా తీసుకున్నారనే చెప్పాలి. అయితే పేదప్రజలకు ఆహారభద్రత అవసరాన్ని మరింత పక్కాగా కొనసాగిస్తూ తెలంగాణలో ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లను మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. అన్నపూర్ణను పూర్తిగా వినియోగించుకునే వర్గాల్లో అధిక సంఖ్యాకులు ఎంబీసీలే అనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఆటోడ్రైవర్లు, అడ్డా కూలీలు వారేనని గమనించాలి. ఒకవేళ ఆ క్యాంటీన్ల సౌకర్యాన్ని విస్తరించడం వీలు కాకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి రేషన్ సరుకులైనా అందజేసి ఆదుకోవాలి. వలస  కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర బడ్జెట్ కేటాయించి ఆదుకున్న మాట వాస్తవం. అయినప్పటికీ వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేక వెనక్కి తిరిగొచ్చే సదుపాయాల్లేక భవన నిర్మాణ రంగం కూడా ఎదురుదెబ్బలు తింటున్న విషయాన్ని పాలకులు గమనించాలి. ఆ క్రమంలోనే ఎంబీసీల దయనీయ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకొని ఆదుకోవాల్సి ఉంది. తొలి దఫాలో కనీసం 10 లక్షల ఎంబీసీ కుటుంబాలకు నెలకు రూ. 10 వేల చొప్పున నగదు సాయాన్ని మూడు నెలల పాటైనా అందించాలి. 

 

 

ప్రభుత్వానికి 2017లో ఎంబీసీ కమిటీ ఇచ్చిన రిపోర్టును పరిగిణనలోకి తీసుకోవడం వల్ల 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంబీసీలకు, వృత్తి కులాలకు చాలామందికి రూ. 50 వేల చొప్పున రుణాలు ఇవ్వడం జరిగింది. వారికోసం అప్పట్లో రూ. 250 కోట్లను కేసీఆర్ సర్కారు విడుదల చేసింది. అయితే ఎంబీసీ కులాల అభివృద్ధి కోసం ఔదార్యం ప్రకటించిన ప్రభుత్వ పిలుపుతో తెలంగాణవ్యాప్తంగా 5 లక్షల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. వాటిలో మిగిలిన దరఖాస్తులు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో ఉండిపోయాయి. దీన్నిబట్టి అసలు దరఖాస్తే చేసుకోకుండా, బ్యాంకు మొహం చూడకుండా ఇంకా ఎన్ని లక్షల కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్నాయో ఆలోచిస్తే పేదరికపు భీకర దృశ్యం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. 

 

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఫలాలేవీ ఇప్పటివరకు ఇలాంటి పేదవర్గాలకు అందనేలేదు. అందుకే వీరు అత్యంత వెనుకబడిన వర్గాల జాబితాలోకి నెట్టివేయబడ్డారు. అందుకే అంబేద్కర్ ఒక సందర్భంలో ఏమన్నారంటే.. ఇలాంటి పేదలు బతికి బాగుపడాలంటే అందుకు అంతిమ సాధనం రాజకీయ లక్ష్యమే అవుతుంది తప్ప.. అంటరానితనం నిర్మూలన కాదని కుండబద్దలు కొట్టారు. అందువల్లే ఎస్సీలు రాజకీయంగా అన్ని పార్టీల ముందు వారి డిమాండ్లను బలంగా ఉంచగలుగుతున్నారు. అంటరానితనం రూపుమాపేందుకు తీసుకొచ్చే చట్టం కన్నా రాజకీయ రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ ఆనాడు పట్టు పట్టడం వల్లే ఎస్సీ, ఎస్టీల్లో కనీసం ఇంతటి మార్పయినా సాధ్యమైందని గమనించాలి. రాజకీయాధికారం లేకుండా ఏ జాతి మనుగడైనా, ఏ కులం మనుగడైనా దుస్సాధ్యమన్న అంబేద్కర్ మాటల్లోని సత్యాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఎంబీసీ వర్గాల ఆకాంక్షలను వినిపించే రాజకీయ నాయకత్వం తెలంగాణలో కొరవడింది. ఏ రాజకీయ పార్టీ కూడా ఎంబీసీలకు చట్టసభల్లో అవకాశాలు కల్పించడం లేదు. ఇప్పుడు అన్నివర్గాల ప్రజల మన్ననలు అందుకుంటున్న తెలంగాణ ప్రభుత్వమైనా ఎంబీసీల సమగ్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ న్యాయంతో పాటు ఆర్థిక ప్రగతికి, సామాజిక న్యాయానికి అవకాశం కల్పించి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది. 

 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.