ప్రకృతి మీదనే ఆధారపడి బతుకుతున్న మనిషి.. ఆ ప్రకృతి వైవిధ్యాన్ని మాత్రం కాపాడటం లేదు. పైగా మూగజీవాల పాలిట రాక్షసుడిగా మారుతున్నాడు. కరోనా వంటి మహమ్మారి మానవాళిని శాసిస్తున్నా కూడా ఇతర ప్రాణుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. మానవత్వం మరచి అడవి జంతువుల కన్నా హీనంగా వ్యవహరిస్తున్నాడు.
ఖమ్మం జిల్లా జిల్లా వేంసూర్ మండలంలో మానవ సమాజం అసహ్యించుకునేలా ఓ కోతిని ఉరేసి చంపారు కొందరు ప్రబుద్ధులు. సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యం చక్కర్లు కొడుతున్నా కూడా సంబందిత అటవీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.పైగా ఇదేంటని ప్రశ్నించినవారికి దురుసుగా సమాధానం ఇస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం అమ్మపాలెం గ్రామంలో ఈ ఘటన జరిగింది.
సాధు వెంకటేశ్వరావు, పాస్టర్ జోసెఫ్ రాజ్ ఇళ్ళ సమీపంలో ఓ నీటి తొట్టిలో వానరం పడిపోయి కొట్టుమిట్టాడుతోంది. మానవతా దృక్పథంతో కోతిని కాపాడాల్సిన వారిద్దరూ వానారాన్ని కర్రలతో కొట్టి చంపి బయట పడేశారు. చనిపోయిన వానరం వద్దకు మరికొన్ని కోతులు రావటంతో జోసెఫ్ రాజ్, వేంకటేశ్వరావు మరో కోతిని పట్టుకుని సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసి కుక్కలతో కరిపిస్తు హతమార్చారు.అటుగా వెళ్తున్న కొందరు ఇదేంటని ప్రశ్నించినా.. వినకుండా దురుసుగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై కొందరు ఫారెస్ట్ ఉన్నతాధికారికి ఫోన్ లో సమాచారం ఇచ్చినా పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. అతి క్రూరంగా రెండు కోతులకు చంపిన వ్యక్తులపై అటవీ జంతువుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అసలే కరోనా కాలంలో ఆహారం కోసం బయటికి వస్తున్న మూగజీవాల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సరి కాదని, కుదిరితే ఆహారం అందించాలే తప్ప ఈ విధంగా కర్కశంగా ప్రవర్తించకూడదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కేరళలో ఓ ఏనుగును పైనాపిల్ బాంబుతో చంపిన ఘటన వెలుగుచూసింది. ఇది అంతకన్నా దారుణమని పలువురు ఆవేదన చెందుతున్నారు.
ఇక కోతులను చంపిన ప్రబుద్ధులు ఏమంటున్నారో వినండి.
Comments
Post a Comment
Your Comments Please: