మీడియా పట్ల పూర్తి వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కారు మీద విమర్శలేం చేయకుండానే పలువురు సెలబ్రిటీలు, సీనియర్ జర్నలిస్టులు తమ చేతనైన సాయం చేస్తామని ముందుకొచ్చారు.
నా వంతు సాయంగా రూ. 25 వేలు
- పోసాని కృష్ణ మురళి, నటుడు
జర్నలిస్ట్ మనోజ్ మృతి కి చింతిస్తున్నా. నా తరుపున 25 వేల రూపాయల ఆర్థిక సహాయంజేస్తా. సినిమా షూటింగ్స్ ప్రారంభమయితే మళ్ళీ రూ. 25 వేలు సహాయం చేస్తా. మీడియా ప్రజలందరికీ సర్వీస్ చేసే రంగం. సినిమా పరిశ్రమ కూడా మనోజ్ కుటుంబానికి సహాయం చేయాలి.
నా వంతు సాయం రూ. 10 వేలు - సీనియర్ జర్నలిస్టు, దేవరకొండ కాళిదాస్
కరోనా సమయంలో జర్నలిస్టులను విస్మరిస్తున్నారని మొదటినుంచీ నెత్తి, నోరు కొట్టుకొని చెబుతూనే ఉన్నాం. అనుకున్నంతా జరిగింది. ఇంకా జరిగే అవకాశాలూ ఉన్నాయి. డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులతో పాటు ఫ్రంట్ వారియర్లుగా జర్నలిస్టులూ పనిచేస్తున్నారు.. అయితే వారికివ్వాల్సిన ప్రోత్సాహకాలు మాత్రం కల్పించబడలేదు.
ఈ విషయాన్ని స్వయంగా సీఎం గారిని అడిగితే మీడియా అకాడమీ నుంచి ఎలాంటి అభ్యర్థనా రాలేదని బహిరంగంగా ప్రెస్ మీట్ లోనే చెప్పారు. లోపం ఎక్కడ జరిగిందనేది ఇక్కడ ప్రధానం కాదు. ఒక నిండు ప్రాణం, ఎంతో భవిష్యత్తు గల యువ జర్నలిస్టును మనం కోల్పోయాం. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఎదురుకాకుండా ఇకనైనా చర్యలు తీసుకోవాలి. కేరళ, ఒరిస్సా, బెంగాల్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలలాగా కరోనా భృతిని వెంటనే ప్రకటించి,భీమా సౌకర్యం కల్పించాలి. అందరు జర్నలిస్టులకు కాకున్నా,క్రైమ్ రిపోర్టర్లు, మెడికల్ రిపోర్టర్లకు అయినా మాస్కులు, సానిటైజర్లు, రోగులను కలిసే సమయంలో ప్రత్యేక దుస్తులను అందజేసి జర్నలిస్టుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి.
చనిపోయిన తర్వాత సంతాపంతో సరిపెట్టకుండా, సహాయం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవసరం లేకుండా, వారికి ముందే ఆర్థిక సహాయం, ప్రాణ రక్షణకు కావలసిన విషయాలను ప్రభుత్వంతో చర్చించాలి. రాష్ట్రంలో మరో జర్నలిస్టు కరోనాతోనో, ఆకలి బాధలతోనో మరణించకుండా చూడాలి. ప్రభుత్వం కూడా జర్నలిస్టులను బీపీఎల్ స్థాయి మనుషులుగా గుర్తించి ఆదుకోవాలి. కరోనాతో మరణించిన టీవీ5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ కు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆయన కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.
మనోజ్ మృతి బాధాకరం
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే, దుద్దిల్ల శ్రీధర్ బాబు
కరోనాకు గురై జర్నలిస్టు మనోజ్ కుమార్ ఆకస్మికంగా మృతి చెందడం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూన్నా. వారికి మనోధైర్యాన్ని కల్పించాలని ఆ భగవంతుడిి కోరుకుంటున్నా. జర్నలిస్టులందరికి ప్రభుత్వమే ఆరోగ్య రక్షణ కల్పించాలి, వారికి కరోన టెస్టులు చేయాలి. కరోనా పై పోరాడేందుకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ జర్నలిస్టులు ముందు వరుసలో ఉంటున్నారు. కరోనాపై పోరాటం చేస్తున్న వారిలో మొన్న పోలీసులు, నిన్న డాక్టర్లు, నేడు రిపోర్టర్లు కరోన బారిన పడుతున్నారు. దీన్ని ప్రభుత్వమే కట్టడి చేయాలి.
మనోజ్ భార్యకు ఉద్యోగం ఇవ్వాలి
టి-జర్నలిస్టుల ఫోరమ్
సీనియర్ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ అకాల మరణంపట్ల టి జర్నలిస్టుల ఫోరమ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నామని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిజేస్తున్నామని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్, ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ ఓ ప్రెస్ నోట్లో చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. సహచరుడు, సౌమ్యుడు మనోజ్ కుమార్ చనిపోవడం జర్నలిస్టు లోకాన్ని కలవరపరిచింది. విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టు మనోజ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ఇవ్వడంతోపాటు భార్యకు ఉద్యోగం ఇవ్వాలి. వారల కవరేజీలో భాగంగా కరోనా మహమ్మారిపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టుల సేవలను ప్రభుత్వం గుర్తించాలి. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో కరోనా పై పోరాడేందుకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ జర్నలిస్టులు ముందు వరుసలో ఉంటున్నారు. ఇప్పటికే విధి నిర్వహణలో అనేక మంది జర్నలిస్టులు కరోనా మహమ్మారి బారినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆపత్కాల పరిస్థితుల్లో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి కల్పిస్తున్న రూ.50 లక్షల భీమాను జర్నలిస్టులకు కూడా వర్తింప జేస్తూ జీవో విడుదల చేయాలని టి.జర్నలిస్టుల ఫోరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వమే ఆరోగ్య రక్షణ కల్పించాలి. ప్రతి జర్నలిస్టులకు తక్షణమే కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తలా ఓ చేయి వేస్తామంటున్న జర్నలిస్టులు
మనోజ్ మృతిని జీర్ణించుకోలేకపోతున్న పలు గ్రూపుల్లో ఉన్న జర్నలిస్టులు తలా ఇంత మొత్తాన్ని జమ చేసి ఇవ్వాలని నిర్ణయించారు. అకాల మరణం పాలైన మనోజ్ కుటుంబానికి బాసటగా నిలిచేందుకు జర్నలిస్టులు ఇలా పెద్దసంఖ్యలో సంఘీభావం ప్రకటించడం విశేషం. ఎవరికి వీలైనంత మొత్తాన్ని వారు అందించి ఒకే మొత్తంగా మనోజ్ ఫ్యామిలీకి ఇవ్వాలని నిర్ణయించారు. మల్లేశ్ అనే ఓ సీనియర్ ఈ బాధ్యత తీసుకున్నారు.
Comments
Post a Comment
Your Comments Please: