Skip to main content

భూ మాఫియా అవతారంలో కొందరు బీసీలు

   

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ గ్రామంలో ఒక భూవివాదంలో జరిగిన దాడి రెవిన్యూ విభాగంలోని అనేక చీకటి పార్శ్వాలను మరోసారి తెరమీదికి తెస్తోంది. మన దేశంలో, రాష్ట్రంలో పబ్లిక్ సర్వెంట్స్ కు ఉన్న స్వేచ్ఛ, ప్రత్యేకాధికారాలు ప్రజలకు లేవని మరోసారి రుజువైంది. ఫిర్యాదుదారులు ప్రజలే, బాధితులు కూడా ప్రజలే అవుతుండగా.. ఆ ఇద్దరి మధ్యా లేని వివాదాలు సృష్టించి, ఉన్న వివాదాలను పెంచి.. వారి మధ్య  వైషమ్యాలను శాశ్వతంగా పెంచి పోషిస్తున్నది స్వయంగా అధికారులేనన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతేకాదు.. అసమగ్రంగా ఉన్న భూ రికార్డులు, అసలు రికార్డులకే ఎక్కని భూములు, తరతరాలుగా సాగు చేసుకుంటున్న ఇనాం భూములను ఆసరా చేసుకొని కలిసి జీవించే ప్రజా వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

 


బాధితుడు మక్రోజు పరిపూర్ణాచారి కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ అనే గ్రామంలో తాతల కాలం నుంచి తనకు వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నారు. శనివారం వ్యవసాయ భూమి దగ్గరకు వెళ్లిన పరిపూర్ణాచారికి అనుకోని దృశ్యం కనిపించింది. తన భూమిలో మరికొందరు వ్యక్తులు అదే భూమిలో పనులు చేయడంతో ఇదేంటని ప్రశ్నించారు. ఈ భూమి తనకు పట్టా అయిపోయిందని, తామే కొన్నామని, అడగడానికి నువ్వెవరు.. నీ దగ్గర  ఏముందని అవతలి వ్యక్తులు ఎదురు ప్రశ్నించారు. ఇక్కడ మాటామాటా పెరిగి తోసుకోవడం, విచక్షణ రహితంగా దాడి చేయడం దాకా వెళ్లింది. బాధితుడు మక్రోజు పరిపూర్ణాచారి అయితే.. దాడి చేసిన వ్యక్తులు దళపతిగౌడ్, మల్లేశ్ గౌడ్, అంజయ్య గౌడ్, పల్లేటి రాములు గా పేర్కొంటూ తన మీద వారు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పరిపూర్ణాచారి పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. దాడి జరిగిన వీడియో దృశ్యాలను బట్టి చూస్తే అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. 


బాధితుడు పరిపూర్ణాచారి


 

ఇంతకీ వివాదం ఏంటి?

 

పరిపూర్ణాచారి పూర్వీకులకు నిజాం జమానాలోనే దాదాపు 10 ఎకరాలు ఇనాంగా దక్కాయి. అప్పటి నుంచీ వారు సాగు చేసుకుంటూ, వంశపారంపర్యంగా వారే అనుభవిస్తూ వస్తున్నారు. విశ్వబ్రాహ్మల్లో ఉండే పేదరికం, అవగాహనా లేమి, రెవిన్యూ అధికారుల చేతివాటం, ప్రభుత్వ యంత్రాంగంలో పేరుకుపోయిన నిర్లక్ష్యం వంటి అనేక కారణాల వల్ల దశాబ్దాలుగా వారు తమ పేరు మీద భూమిని పట్టా చేయించుకోలేదు. వంశపారంపర్యంగా దఖలుపడ్డ భూమిని ఎవరు ప్రశ్నిస్తారు అన్న భరోసానో లేక పట్టా చేయించుకునే స్తోమత లేకనో మొత్తానికి ఆ భూమి తమదేననే ధీమాతో ఉన్నారు. ఈ లోపు ఆ భూమికి చెందిన వీరి బంధువులకే కొందరు భూ బకాసురులు డబ్బు ఆశ చూపి.. పరిపూర్ణాచారి కుటుంబానికి కనీసం సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా పట్టా చేయించుకున్నారు. ఇందులో కీలకంగా పనిచేసినవారు స్థానిక ఎమ్మార్వోనే కావడం విశేషం. ఇటీవలే రిటైరైన ఎమ్మార్వో తన రిటైర్మెంట్ కు రెండు నెలల ముందే ఈ భూమిని పట్టా చేసి ఇచ్చి వెళ్లిపోయాడని తెలుస్తోంది. పట్టా కాగితాలు చేతికొచ్చాక, ఎమ్మార్వో రిటైర్ అయిపోయాక నిదానంగా భూమ్మీద పడ్డారు భూ రాక్షసులు. 

 

భూ మాఫియా అవతారాలెత్తుతున్న బీసీ బిడ్డలు

డబ్బెవరికి చేదు? అలాగే భూమి ఎవరికి చేదు? హైదరాబాద్ పరిసరాల్లో కోట్లు గుమ్మరిస్తున్న రియల్ వ్యాపారంతో ఏటికేడు కోటీశ్వరులుగా మారిపోవచ్చన్న అత్యాశ అన్నివర్గాల్లో పెరిగిపోయింది. అలాగే అన్ని సామాజికవర్గాలకు అందుబాటులో ఉండే బీసీల్లోని కొన్ని వర్గాలు కూడా ఇదే అదనుగా మాఫియా అవతారాలెత్తుతున్నాయి. దళపతిగౌడ్, మల్లేశ్ గౌడ్, అంజయ్య గౌడ్ అనే ఒకే కుటుంబానికి చెెందిన వ్యక్తులు పరిపూర్ణాచారి భూమ్మీద కన్నేయడం ఇదే అంశాన్ని తేటతెల్లం చేస్తోంది. ఆ ముగ్గురికి తోడు పల్లేటి రాములు అనే ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఉన్నాడని బాధితులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పక్కా సమాచారం, వారి అండను ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ కాని అంశాన్ని ఆసరా చేసుకొని, అదే పరిపూర్ణాచారి కుటుంబానికి చెందిన వ్యక్తులకు గాలం వేసి అతి చవక ధరకు భూమిని కొట్టేసే ప్లాన్ కు ఒడిగట్టారని పరిపూర్ణాచారి మాటల్ని బట్టి తెలుస్తోంది. కొంతమేర అడ్వాన్సుతో తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చన్న ఉద్దేశంతో చదువురాని పరిపూర్ణాచారి బంధువులు గౌడ్స్ బృందానికి రిజిస్ట్రేషన్ చేయించి పెట్టారు. పేపర్ చేతికి అందగానే భూబకాసురులు అసలురంగును చూపించారు.

 

పరిష్కారమేంటో బీసీ ఉద్యమ నేతలే చూపాలి

అణగారినవర్గాల హక్కులు, బీసీ ఉద్యమాలు అంటూ రాజకీయాధికారం కోసం పెనుగులాడుతున్న బీసీ ఉద్యమనేతలే గ్రామస్థాయిలో బీసీల మధ్య చిచ్చుపెడుతున్న ఇలాంటి భూ సమస్యలకు పరిష్కారం చూపాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యమ స్ఫూర్తి అంటే కేవలం అధికారంలోకి రావడమే కాదని, ప్రజాశ్రేణుల మధ్య నలుగుతున్న సమస్యలకు సరైన దిశలో పరిష్కారం చూపడమేనని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరి బీసీ సంక్షేమ సంఘం నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు రెవిన్యూ ప్రక్షాళన చేస్తానంటున్న కేసీఆర్ సర్కారు.. అదే రెవిన్యూ అధికారుల చేతుల్లో మరిన్ని అరాచకాలు జరగకముందే, ఘోరాలు పెరగకముందే కళ్లు తెరిచి త్వరపడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 


బాధితుడు పరిపూర్ణాచారి కుటుంబానికి సంఘీభావం ప్రకటించిన విశ్వకర్మ పరిరక్షణ సమితి నేతలు ముత్తోజు మధుకరాచారి, మేడోజు రామబ్రహ్మం ఆచారి, చేపూరి వీరాచారి తదితరులు

Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.