ప్రతియేటా సెప్టెంబర్ మాసం వచ్చిందంటే చాలు విశ్వకర్మ సామాజికవర్గమంతా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సంబరాల్లో మునిగి తేలుతుంది. విశ్వ సృష్టికర్త, విశ్వ రచనా దురంధరుడు అయిన విశ్వకర్మను స్మరించుకోవడం, విశ్వ జనావళి బాగోగుల కోసం సరికొత్త కార్యకలాపాల గురించి యోచించడం, ఆచరణ మార్గాలు అన్వేషించడం విశ్వకర్మల సామాజిక ధర్మం. ఇందులో భాగంగానే సౌరమానం ప్రకారం ప్రతియేటా జరుపుకునే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం గురించి చేవెళ్లలోని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చేవెళ్లలోని బ్రహ్మగిరిపై దాదాపు పదేళ్లుగా శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు, విశ్వకర్మ యజ్ఞమహోత్సవం జరుపుతున్నారు. ఈసారి కరోనా కారణంగా భారీ స్థాయిలో జరుపుకోకపోయినా.. నిర్వహణలో లోటు రాకుండా పరిమితులు పాటిస్తూ శ్రద్ధాభక్తులతో జరుపుకోవాలని చేవెళ్ల విశ్వబ్రాహ్మలు తీర్మానించుకున్నారు. మరోవైపు విశ్వకర్మ పూజోత్సవ ఏర్పాట్లలో భాగంగా వంటశాల చదును చేయడం, భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడడం, గుట్టపై పెరిగిన కలుపును తీసిపారేయడం, మట్టిపని వగైరా పనుల్లో నిమగ్నమయ్యారు. అడ్వొొకేట్ బాలాచారి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్వాహకులు లింగాచారి, మాణిక్యాచారి, శంభులింగాచారితో పాటు స్థానిక విశ్వబ్రాహ్మణ నేతల పిల్లలు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం విశేషం.
శ్రీశ్రీశ్రీ గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రస్వామి
బ్రహ్మగిరిని సందర్శించిన మిషన్ విశ్వకర్మ లీడర్స్
మిషన్ విశ్వకర్మ లీడర్స్ బృందం బ్రహ్మగిరిని సందర్శించి ఆలయ అభివృద్ధి పనులు, ఇంకా అవసరమైన కార్యక్రమాల గురించి ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ విశ్వకర్మ లీడర్స్ వ్యవస్థాపకుడు మావిశ్రీ మాణిక్యం, ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత చేపూరి లక్ష్మణాచారి, తెలంగాణ విశ్వకర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్తోజు మధుకర్ ఆచార్య, సీనియర్ జర్నలిస్టు రమేశ్ ఆచార్య కలిసి బ్రహ్మగిరి క్షేత్రాన్ని సందర్శించినవారిలో ఉన్నారు. ఆలయ నిర్మాణానికి పూనుకున్న క్రమం, తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక విద్యుత్ విభాగం అధికారులు తమకు ఎంతో సహకరించారని, వారి సహకారంతోనే బ్రహ్మగిరి మీద గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రస్వామిని ప్రతిష్టించామని, పదేళ్ల తరువాత ఆలయం ఈ రూపంలోకి వచ్చిందని లింగాచారి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. విశ్వబ్రాహ్మల్లో సహృదయులు, సేవాతత్పరులు ముందుకొస్తే జాతి గర్వించే స్థాయిలో బ్రహ్మగిరిని తీర్చిదిద్దుతామని మాణిక్యాచారి అన్నారు. బ్రహ్మగిరి క్షేత్రంలో ఇంకా విరాట్ విశ్వకర్మ, గాయత్రీమాత కొలువై ఉండగా భక్తాంజనేయస్వామి కోసం ప్రత్యేకంగా ఆలయం రూపుదిద్దుకుంటోంది.
Comments
Post a Comment
Your Comments Please: