ప్రజలకు సేవ చేయడానికి, సామాజిక అభ్యున్నతి కోసం పాటు పడడానికి, అందుకోసం రాజకీయ పార్టీలు నడపటానికి కార్పొరేట్ శక్తుల మద్దతు అవసరం లేదని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. 1977లో జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, యూపీలో కాన్షీరామ్ స్థాపించిన బీఎస్పీ పవర్ లోకి రావడానికి, 1984లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ అధికారంలోకి రావడానికి ఏ కార్పొరేట్ శక్తి కూడా పని చేయలేదని, తొలినాళ్లలో ఎన్టీఆర్ కు ఆయన సొంత కులం వాళ్లే సహకరించలేదని చంద్రకుమార్ అన్నారు. మొక్కవోని దీక్ష, చిత్తశుద్ధి మాత్రమే ఏ నాయకుణ్నయినా, ఏ పార్టీనైనా ముందుకు నడిపిస్తాయన్నారు. ప్రజల కోసం చేసే నిస్వార్థపూరితమైన మంచిపని ఏదైనా ఎంతో ఆత్మతృప్తిని కలిగిస్తుందని, ఎంతో ఆనందాన్నిస్తుందని, అదే అన్నిటికన్నా విలువైందన్నారు. భావి సమాజాన్ని కాంక్షిస్తూ తాను రాసిన "మంచి మార్పు కోసం" అనే పుస్తకంతో పాటు సీడీని హైదారాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పలు సందర్భాల్లో చేసిన చిన్నపాటి తప్పిదాలు చరిత్రలో సరిదిద్దుకోలేని ఘోరాలుగా మారతాయని, 1948 నాటి కమ్యూనిస్టుల తప్పిదాన్ని ఆయన గుర్తు చేశారు. ఆనాడు కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని పక్కన పెట్టి ఉంటే 4 వేల మంది తెలివైన, అంకితభావం గల వీరుల ప్రాణాలు నిలిచి ఉండేవని ఆవేదన చెందారు. అందుకే నాయకుల అడుగులు తప్పటడుగులు కారాదన్నారు. అలాంటివి జరగకుండా అవసరానికి తగినట్టు వ్యవహరించే నాయకుడు ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొంటాడని, తెలంగాణ ప్రజలపార్టీలో పనిచేసే కార్యకర్తలు, నాయకులు కూడా అలాంటి ముందుచూపుతోనే వ్యవహరించాలన్నారు.
తనకు 17 ఏళ్ల వయసులో 1971లోనే సోషలిస్ట్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా ప్రజా ఉద్యమాల్లోకి వచ్చానని.. ప్రేమ, దయాగుణాలు తన తల్లి నుంచి తనకు అబ్బితే, సమాజం కోసం త్యాగం చేసే లక్షణం తండ్రి నుంచి అలవడిందని అమ్మా-నాన్నల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గుప్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ లయన్ శ్యాంసుందర్, ఉపాధ్యక్షుడు-అధికార ప్రతినిధి రాజగోపాల్ నాయుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి, భారత్ టుడే టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: