బతుకమ్మ పండుగను కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ అదేంకాదు.. ఆంధ్రాలో కూడా జరుపుకుంటారని తాజా ఘటన రుజువు చేస్తోంది. అయితే సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆడుకునే సమయంలో స్థానిక ఎస్సై ఓవరాక్షన్ చేయడం కలకలం రేపుతోంది. తాను అక్కడ ఉండగా బతుకమ్మ ఆడే అవకాశమే ఇవ్వనని పంతానికి పోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జయంతి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గురువారం (22వ తేదీ సాయంత్రం) గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి ప్రాంగణంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసుకొని నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ఇదే సందర్భంలో అమ్మవారి విగ్రహం సమీపంలో కరోనా నిబంధనలు పాటిస్తూ మహిళలు బతుకమ్మలు ఏర్పాటుచేసి ఆడుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న వీరులపాడు ఎస్ఐ హరి ప్రసాద్ మహిళలతో దురుసుగా ప్రవర్తించారు. సుమారు రెండు గంటలకు పైగా బతుకమ్మలతో వచ్చిన మహిళలను నిర్దాక్షిణ్యంగా అక్కడే నిలబెట్టారు. బతుకమ్మలు ఆడటానికి వీల్లేదని హుకుం జారీ చేశాడు.గ్రామస్తులపై దుర్భాషలాడుతూ ఈరోజు నుండి బతుకమ్మలు ఎలా ఆడతారో చూస్తాను అంటూ హరిప్రసాద్ బెదిరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ ఎస్సై వినకపోవడం విశేషం. పైగా నేనుండగా అసలు బతుకమ్మలు ఎలా ఆడతారో చూస్తానంటూ భీష్మించుక్కూర్చున్నారు. చేసేదిలేక మహిళలంతా బతుకమ్మలను స్థానికంగా ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు. ఎస్సై తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల మనోభావాలు లెక్కచేయకుండా హిందువులు జరుపుకునే పండుగైన బతుకమ్మ విషయంలో ఎస్ఐ ప్రవర్తించిన తీరు మనోవేదన కలిగించిందని, ఒక పోలీస్ అధికారి అయి ఉండి ఆయన ప్రవర్తించిన తీరు విస్మయాన్ని కలుగజేసిందని గ్రామస్తులు వాపోయారు. దీనిపై హిందూ ధర్మ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విషయం తెలుసుకున్న నందిగామ డీఎస్పీ రమణమూర్తి బతుకమ్మ విషయంలో ఎస్ ఐ ప్రవర్తించిన తీరు సరికాదని ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేశామన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: