ఏ దారెటు పోతుందో ఎవరికెరుక? ఆ దారి వేసినవారికి తప్ప. ఎవరెన్ని పరుగులు కొట్టారన్న కొలబద్దే మ్యాజిక్ ఫిగర్ ను శాసిస్తున్న నడుస్తున్న రాజకీయాల్లో ఏ పార్టీ ప్రయాణం ఏ దిశగా సాగుతుందని ఆలోచించే తీరుబడి గానీ, అవసరం గానీ అటు ప్రజలకైనా, ఇటు పార్టీలకైనా అక్కర్లేని మ్యాటరైపోయింది. బిహార్లో 5 సీట్లు అందుకొని ఫస్ట్ ఇన్నింగ్స్ తోనే జోష్ పెంచుకున్న మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) పార్టీని లైట్ తీసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఆవేశం కన్నా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ముందుకెళ్తుండడం జాతీయ పార్టీలకు సైతం కనువిప్పు కావాల్సిన సందర్భం. బిహార్లో ఎంఐఎం సూపర్ పర్ఫామెన్స్ చూసిన ఎవరైనా ఈ మాటే చెప్పుకుంటున్నారు.
మొదట్నుంచీ యాంటీ బీజేపీ, యాంటీ నేషనలిస్ట్ పాలసీలతో ముందుకెళ్తున్న ఎంఐఎం.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు బహుదూరం జరిగిపోయింది. మునుగుతున్న నావలో ఎవరైనా ఎంతకాలం కొనసాగుతారు? ఆ పార్టీ నేతలే రాజకీయ భవిష్యత్తు వెదుక్కుంటూ అత్యంత శక్తిమంతంగా ఎదిగిన బీజేపీ గూటిలో చేరిపోతున్నారు. మరికొందరేమో ప్రాంతీయ పార్టీలతో కలిసిపోతున్నారు. అలాంటప్పుడు కేవలం సెక్యులరిజం, భావసారూప్యం అనే పనికిమాలిన భుజ కిరీటాలు తగిలించుకోవడం కోసం... కాలిపోతున్న కొంపలో ఎవరైనా నిద్రపోతారా? అందుకే 2019 ఎన్నికల్లోనే సొంతంగా పోటీ చేసి సత్తా చాటుకోవాలని అసద్ భావించారు. ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న సీమాంచల్ మీద కన్నేశారు. అప్పుడు స్కోర్ కార్డు పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ ఇప్పుడదే సొంతింటి పాత చింతచెట్టు బిహార్లో 5 కాయలు కాసింది. ఇదే విషయం నిన్నటి మిత్రుడైన కాంగ్రెస్ కు ఓ పట్టాన బుర్రకెక్కడం లేదు. మనం కోల్పోయిందేంటి? లోపం ఎక్కడ జరిగింది? సరిదిద్దుకోవడం ఎలా? అనే అర్థం కాని ప్రశ్నల చిక్కుముళ్లు కాంగ్రెస్ శిబిరంలోని సీనియర్లను బేజారెత్తిస్తున్నాయి.ఇప్పుడందరి దృష్టీ అసదుద్దీన్ మీదే ఎందుకు ఫోకస్ అయిందంటే.. తన పంచె తాను సర్దుకుంటూ పక్కవాడి పంచె కూడా సర్దుతున్నట్టు కనిపించడంలో అసదుద్దీన్ అత్యద్భుతమైన ప్రతిభ కనబరిచారు. బడుగులు, బలహీనులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అనే నినాదం ఎత్తుకుంటూనే తాను ఆధారపడింది మాత్రం పూర్తిగా మైనారిటీల ఓట్ల మీదనే. ఇంకా చెప్పాలంటే కేవలం ముస్లింల ఓట్ల మీదనే అనేది నిర్వివాదాంశం. అంటే ముస్లింల ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాక దాన్ని మరింత పటిష్టం చేసుకునే పనిలో అసద్ భాయి చాలా ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నారు. మొదట్నుంచీ మైనారిటీల కోసమే పుట్టి, మైనారిటీల కోసమే పనిచేస్తున్న పార్టీ... మెజారిటీ ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలను పట్టించుకుంటుందా? సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా, విదేశీ ముస్లింలు, అక్రమ చొరబాటుదార్లకైనా పౌరసత్వం నిరాకరించరాదంటూ దేశవ్యాప్త ఉద్యమాల్లో పాల్గొన్న ఎంఐఎం.. ఎప్పుడైనా హైదరాబాద్ లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల విషయంలో పల్లెత్తు మాట మాట్లాడిందా? అక్కడిదాకా ఎందుకు? ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ గానీ, ఆయన పార్టీ మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ గానీ నేరుగా హిందువులనే బెదిరించినప్పుడైనా, ఇంకా దేశద్రోహ వ్యాఖ్యలు చేసిన ముస్లిం నాయకుల విషయంలోనైనా ఒవైసీ మాట్లాడారా? కనీసం మాటవరుసకైనా ఖండించాలని ఆయనకు అనిపించిందా? అంటే అర్థమేంటి? ఎంఐఎం ప్రస్థానం ఏ దిశగా సాగుతోంది? ఏ శక్తులను ఎందుకోసం కలుపుకుంటోంది? ఆయనకుండే మైనారిటీ ఓట్ల పాజిటివ్ స్ట్రెంగ్త్ ఆయన కూటమిలోని ఇతర పార్టీలకు ఉంటుందా? ఎంఐఎం ఏ దిశగా ప్రయాణిస్తుందో చూచాయగా చెబుతున్న బిహార్ ఫలితాలే రేపటి రాజకీయ సమీకరణాలను శాసించబోతున్న బిట్టర్ ఫ్యాక్టర్.
Comments
Post a Comment
Your Comments Please: