Skip to main content

ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్ల రూపాయలు పంటసాయంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు – కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. సమావేశంలో మంత్రులు కేటీ రామారావు, ఎస్.నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, జనార్దన్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఏడీఏ విజయ్ కుమార్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల పంటల కొనుగోళ్ల వల్ల చాలా నష్టం జరిగినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. వరి ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనిగలు, పొద్దు తిరుగుడు పువ్వు, మినుములు తదితర పంటల కొనుగోళ్ల వల్ల ఇప్పటివరకు దాదాపు రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చిందని అధికారులు చెప్పారు.  రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు చేసినప్పటికీ ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మాల్సి వస్తున్నది. దీనివల్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి తలెత్తుతున్నదని వారు అభిప్రాయ పడ్డారు. కేవలం ధాన్యం కొనుగోళ్ల వల్లనే రూ.3,935 కోట్ల నష్టం వచ్చిందని వివరించారు. మక్కల కొనుగోళ్ల వల్ల రూ.1547.59 కోట్లు, జొన్నల వల్ల రూ.52.78 కోట్లు, కందుల వల్ల రూ.413.48 కోట్లు, ఎర్రజొన్నల వల్ల రూ.52.47 కోట్లు, మినుముల వల్ల రూ.9.23 కోట్లు, శనిగల వల్ల రూ.108.07 కోట్లు, పొద్దుతిరుగుడు కొనుగోళ్ల వల్ల రూ.14.25 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు వివరించారు. ఇలా నికరంగా వచ్చిన నష్టంతోపాటు హమాలీ, ఇతర నిర్వహణా ఖర్చులన్నీ కలుపుకుంటే రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు అధికారులు చెప్పారు. 

‘‘ ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే మానవతా దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. ప్రతిసారి అలాగే చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. రైస్ మిల్లరో, దాల్ మిల్లరో కాదు.  కొనుగోళ్లు – అమ్మకాలు ప్రభుత్వం బాధ్యత కాదు. కాబట్టి వచ్చే ఏడాది నుండి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. అయితే, వ్యవసాయ మార్కెట్లలో అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా, పద్ధతి ప్రకారం నిర్వహించాలి. రైతులంతా ఒకేసారి తమ పంటను మార్కెట్ కు తీసుకురాకుండా వంతుల ప్రకారం తీసుకురావాలి. రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, వ్యవసాయ విస్తరణాధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏ గ్రామానికి చెందిన రైతులు ఎప్పుడు మార్కెట్ కు సరుకులు తీసుకు రావాలో నిర్ణయించాలి. దాని ప్రకారం రైతులకు టోకెన్లు ఇవ్వాలి. చెప్పిన రోజు మాత్రమే సరుకును మార్కెట్ కు తీసుకరావడం వల్ల రైతులకు సౌలభ్యంగా ఉంటుంది. ఈ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలి ’’ అని సమావేశంలో పాల్గొన్న వారంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.  

‘‘ తెలంగాణలో వ్యవసాయం బాగా విస్తరిస్తున్నది. వ్యవసాయశాఖ అనేక పనులు నిర్వహించాల్సి వస్తున్నది. వ్యవసాయ అధికారులపై ఇతర బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. రైతులకు ప్రతిఏటా రెండుసార్లు రైతుబంధు పంటసాయం అందించే పనులను వ్యవసాయ అధికారులు చూడాలి. రైతు బీమాను పకడ్బందీగా అమలు చేయాలి. రైతు బీమా కార్యక్రమం ప్రారంభించిన నాడు కేవలం రూ.630 కోట్ల కిస్తీ మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. కానీ, చాలామంది రైతులు తమ కుటుంబ సభ్యులందరికీ బీమా వర్తింపజేయాలనే ఉద్దేశంతో తమకున్న భూమిని కుటుంబ సభ్యుల పేర రిజిస్టర్ చేయించారు. దీంతో రైతుల సంఖ్య పెరిగింది. ప్రీమియం దాదాపు రెట్టింపైంది. కిస్తీ ఏడాదికి రూ.1,144 కోట్లు కట్టాల్సి వస్తున్నది. అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనే నిర్ణయించుకుంది. వ్యవసాయ అధికారులే రైతుబీమా పథకం అమలును పర్యవేక్షించాల్సి ఉంది.  వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి. సకాలంలో నాణ్యమైన, కల్తీలేని విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందేట్లు చూడాలి. కల్తీలను, నకిలీలను గుర్తించి అరికట్టాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మరిన్ని పరిశోధనలు జరగాలి. కొత్త వంగడాలను సృష్టించాలి. వ్యవసాయదారులకు ఆధునిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలి. వ్యవసాయ విస్తరణ పనులు చేయాల్సి ఉంది. తెలంగాణలో సాగునీటి వసతి పెరిగినందున వ్యవసాయం కూడా బాగా పెరిగింది. వ్యవసాయశాఖ చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి.  ఆ పనులను చిత్తశుద్ధితో పర్యవేక్షించాలి ’’ అని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. 

‘‘ రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతున్నది. ఈ రైతువేదికల్లో రైతులు, వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశం కావాలి. తమ స్థానిక పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేయాలనే విషయంలో అక్కడే నిర్ణయాలు తీసుకోవాలి. మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం ఎక్కడికక్కడ రూపొందించుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ రైతు ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదు. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలి. పంటను ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే అమ్ముకోవాలి. ఈ విధానం ఉత్తమం’’ అని సమావేశంలో విస్తృత అభిప్రాయం వ్యక్తమైంది.


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తో...