ఏపీలో ఏ జిల్లా చూసుకున్నా విధ్వంసకాండ మాత్రం కామన్ గా మారింది. జ్యోతిర్లింగ రూపంలో పరమశివుడు కొలువుదీరిన శ్రీశైలం నుంచి దేశప్రజలందరికీ ఆరాధ్య దైవమైన రామతీర్థం రాములవారి క్షేత్రం దాకా ఎక్కడ చూసినా మత విద్వేషం బుసలుకొడుతోంది. హిందువుల సెంటిమెంట్లను పనిగట్టుకొని గాయపరచడమే ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తోంది. అయినా పాలకులకు గానీ, అధికారులకు గానీ ఆ విషయాలేవీ పట్టటం లేదు. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగానూ అదే రిపీటైంది.
Also Read: తక్కువ తేడాతో ఎక్కువ సీట్లు: ఇదెలా సాధ్యం? ఎవరి కుట్ర?
Also Read: ఒవైసీ వ్యూహం వెనుక ఏముందంటే..
పిల్లి కళ్లు మూసుకుంటే ఎలుకొచ్చి వెక్కిరిస్తుందని సామెత. ఆ ఎలుక ఇంకా ఏం చేస్తుందో మాటల్లో చెప్పడం బాగుండదు కానీ.. ఆంధ్రాలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయి, ఆనందం అనుభవిస్తున్న సమయంలో.. ఏపీలో మాత్రం దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్ది సమయంలో తెల్లవారుతుందనగా రాజమండ్రిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి చేతులు విరిచేశారన్న వార్త మీడియా ద్వారా ప్రపంచానికి చేరింది. అంతకు కొద్ది గంటల ముందే, డిసెంబర్ 30న విజయనగరం జిల్లా రామతీర్థం కొండమీదున్న రాముడి విగ్రహం తల నరికి బావిలో పడేశారు. ఆ దృశ్యం చూస్తుంటే.. రామరాజ్యం గురించి మన గాంధీజీ కానీ, మన పెద్దవారు కానీ గొప్పగా చెప్పిన మాటలు.. మన ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఎంతగా ప్రతిఫలిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్రాలో కేవలం ఈ రెండు సంఘటనలేనా? అబ్బో.. ఇలాంటి ఘనకార్యాలు ఏపీలో చాలానే జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలోనూ హిందూ దేవతా విగ్రహాల విధ్వంసకాండ నిరాటంకంగా సాగిపోయింది. ఇప్పటికీ సాగిపోతోంది. హిందూ సెంటిమెంట్ల గురించి తప్ప అన్ని ఇతర మతాల సెంటిమెంట్లకూ టాప్ ప్రయారిటీ ఇచ్చే పాలకులు... దేవలయాలపై దాడులపై శ్వేతపత్రం విడుదల చేయకపోవచ్చు కానీ.. గూగులమ్మను అడిగితే ఆ జాబితా ఏదో ప్రపంచం కళ్లముందు పెడుతుంది. గతేడాది సెప్టెంబర్ 17న కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేటలో కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలోని నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇది చాలా పురాతన దేవాలయం 12వ శతాబ్దంలో కాకతీయులు ఇక్కడ వీరభద్రస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ మరుసటి రోజే యేలేశ్వరంలో హనుమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. సెప్టెంబర్ 6న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథాన్ని కాల్చేశారు. ఈ రథానికి వందల ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉంది. ప్రజలంతా పట్టరాని ఆగ్రహంతో ఆందోళనలు చేశారు. దుండగులెవరో పట్టిచూపే సీసీటీవీలు కూడా ఆ టైమ్ కి పని చేయకపోవడంలోనే.. అంతర్వేది ఘటనలో కాకతాళీయత ఎంతుంది.. కాకమ్మ కబుర్లు ఎన్నున్నాయి అనేది చెప్పకనే చెబుతోంది. అందుకే అధికారులు ఈవో ను సస్పెండ్ చేసి ప్రజాగ్రహాన్ని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ఏపీలో హిందూ దేవాలయాలపై దాడుల లిస్టు కొండవీటి చాంతాడును మించిపోతుంది. అమ్మల గన్నయమ్మ బెజవాడ దుర్గమ్మగా భక్తుల కష్టాలు తీర్చే అమ్మవారి రథం మీది విగ్రహాలు కూడా మాయమైపోయాయి. దుర్గగుడిలో వెండి విగ్రహాలకే రక్షణ లేదంటే.. చిన్నచిన్న పుణ్యక్షేత్రాల సంగతేంటి? అంతకుముందు సెప్టెంబర్ 26న గంగాధర నెల్లూరులో దుండగులు నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నెల్లూరులో ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథాన్ని కాల్చి బుగ్గి చేశారు. బూడిద కుప్ప తప్ప.. రథం ఆనవాళ్లు కూడా మిగల్చలేదు. ఇక తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో హిందూ దేవీ-దేవతా విగ్రహాల విధ్వంసం ప్రపంచాన్ని నివ్వెరపరచింది. గణేశుడు, హనుమాన్, సాయిబాబా, దుర్గామాత ల విగ్రహాలను ధ్వంసం చేసి.. యవనులు, హూణుల కన్నా తామేం తక్కువ కాదని చాటుకున్నారు. ఆ విగ్రహాలు కూల్చడానికి భారీ సమ్మెటలే వాడారంటే... హిందూ ధర్మం మీద, హిందువుల ఆచరణల మీద.. ఈ దుర్మార్గులకు ఎంత విద్వేషం ఉందో ఊహించవచ్చు. మొన్నటికి మొన్న క్రిస్మస్ రోజున.. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సోదరుడు గోవిందమాలలో ఉండి ఏసుకీర్తనలు ఆలాపించాడు. పక్కనే ధర్మశ్రీ కూడా ఉన్నారు.
అసలు హిందూ దేవాలయాల వల్ల ఇతరులకు ఏం నష్టమొచ్చింది? వారికొచ్చిన ఇబ్బందేంటి? నిశ్శబ్దంగా తమ సంప్రదాయాలు పాటించడమే హిందువులు చేస్తున్న తప్పా? ఇన్ని జరుగుతున్నా పాలకులకు చీమ కుట్టినట్టయినా ఎందుకు ఉండడం లేదు? ఎమ్మెల్యేదో, ఎంపీదో బొచ్చు కుక్క కనిపించకపోతే నానా హైరానా పడిపోయే అధికారులు, బడాబాసులు.. కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్లకు మాత్రం విలువ ఇవ్వకపోవడంలో ఆంతర్యమేంటి? ఏపీలో ఇలాంటి దురాగతాలు అర్ధసెంచరీ దాటిపోయాయి. అసలు ఈపాటికే సీబీఐ విచారణకు రూట్ క్లియర్ చేయాల్సింది. కానీ ఎందుకని పట్టించుకోవడం లేదు? మన దేశంలోని మెజారిటీ ప్రజలు సహజంగానే శాంతి స్వభావులు. వారిలో ఎన్ని విభేదాలున్నా, ఎన్ని హెచ్చుతగ్గులున్నా సెంటిమెంట్లు హర్టయితే మాత్రం సహించజాలరు. ప్రజల సెంటిమెంట్లు హర్టయిన చోట ప్రభుత్వాలకు ఏం రుచి చూపారో ఇప్పటికే చూశాం. అలాంటి పరిస్థితిని ఏపీ పాలకులు తెచ్చుకోకుంటే మంచిదని కోరుకోవడం మినహా.. ఇతరులు చేయగలిగిందేమీ లేదు.
Comments
Post a Comment
Your Comments Please: