ఈ మధ్య కొద్ది నెలలుగా టెండర్ కట్స్ పేరుతో ఓ భారీ వ్యాపార ప్రకటన ఖరీదైన ఇంగ్లిష్ పేపర్లో, ఫ్రంట్ పేజ్‍లో దర్శనమిస్తోంది. త్వరలో హైదరాబాద్ లో మటన్, చికెన్, ఎగ్స్, ఫిష్, ప్రాన్స్.. ఇలా మాంసాహార ఉత్పత్తులు మీరు కోరుకున్న చోటికి డోర్ డెలివరీ అంటూ ఊదరగొడుతోంది. ఇప్పుడైతే హైదరాబాద్ లోని 11 సెంటర్లలో టెండర్ కట్స్ దుకాణాలు రెడీ అయ్యాయని కూడా తాజాగా మరో ప్రకటన వెలువడింది. అది వ్యాపార ప్రకటన కాబట్టి అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేం లేదు. ఈ యాడ్ లో చక్కగా బొట్టు పెట్టుకున్న ఈ హిందూ మహిళ చేత ఎంతో గర్వంగా పోజిప్పించి టెండర్ కట్స్ మాంసానికి బ్రాండ్ అంబాసిడర్ లెవెల్లో ప్రొజెక్ట్ చేశారు. ఇక ఎడమవైపు పైన 100 PER CENT HALAL అంటూ స్టార్ గుర్తులో హైలైట్ చేయడమే ఈ నాలుగు మాటలు మాట్లాడుకోవడానికి దారితీస్తోంది.
హలాల్ అనేది ముస్లింల విశ్వాసాల ప్రకారం దేవునికి సమర్పించుకునే నైవేద్యం. ముస్లిమేతరులు ముస్లిమేతర పద్ధతుల్లో సమర్పించుకునే నైవేద్యాన్ని సంప్రదాయ ముస్లింలు ఎవరూ ముట్టుకోరు. మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా చెబుతున్న షరియా సూత్రాలను ఇండియన్ ముస్లింలు పెద్దసంఖ్యలో తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. బయటి దేశాల్లో దీనిమీద పెద్ద పట్టింపులేవీ లేవని గమనించాలి. హలాల్ పద్ధతిని ఎత్తేసిన యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి. ఇక ముస్లిమేతరుల్లో సిక్కులు ఝట్కా పద్ధతి మాంసాన్నే వినియోగిస్తారు. ఇతర పద్ధతిని వీరు ఏమాత్రం అంగీకరించరు. ఝట్కా అంటే ఒక్క వేటుతో జంతువు మెడ నరకడం. హలాల్ అంటే మెడను సగం కోయడం. ఝట్కాలో ఉన్న మరణానికి, హలాల్ లో ఉన్న మరణానికి చాలా తేడా ఉంటుందని ఇప్పటికే జంతుప్రేమికులు చాలా సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉన్నారు. ఆహారంగా వినియోగించుకునే జంతువును బాధ తెలియకుండా చంపడం కొద్దిగా మెరుగైన పద్ధతిగా చాలా మంది భావిస్తున్నారు. హలాల్ చేసిన తరువాత ప్రాణం పోయేదాకా ఆ జంతువు పడే బాధ వర్ణనాతీతంగా ఉంటుందని వేరే చెప్పాల్సిన పన్లేదు. ఇక హిందువులు చాలా ఫ్లెక్సిబుల్. వారు కొంటున్న మాంసం హలాలా.. ఝట్కానా.. అనేది వారు పెద్దగా పట్టించుకోరు. బోనాలు, ఎల్లమ్మ, పోచమ్మ కొలుపులు, ఇతర దేవతలకు జంతు బలులు ఇచ్చేటప్పుడు జంతువు మెడ పూర్తిగా కోసి నైవేద్యంగా సమర్పించుకోవడం ఆచారం. దాన్ని తప్పకుండా పాటిస్తారు. ఇది కాకుండా రోజువారీ మాంసాహార వినియోగంలో హలాల్, ఝట్కా సంప్రదాయాల జోలికి వారు వెళ్లడం లేదు. ఇది ఒక కోణమైతే.. హండ్రెడ్ పర్సెంట్ హలాల్ పేరుతో హిందూ మహిళను చూపించి వ్యాపార ప్రకటన ఇచ్చుకోవడం మోసం కాదా అనేదే పాయింటు. ముస్లింలకే పరిమితమైన హలాల్ ను ముస్లిమేతరులు అందరి మీదా రుద్దడం కాదా? సాధారణ హిందూ గృహిణి బొమ్మను పెద్దగా చూపించి, హండ్రెడ్ పర్సెంట్ హలాల్ ను చిన్నగా చూపించి ప్రజలందరినీ మభ్యపెట్టడం కాదా?
మన దేశం నుంచి మాంసాహారం పెద్దఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఇప్పటివరకూ APEDA (అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్ పోర్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ) ఆహార ఉత్పత్తుల ఎగుమతి చట్టం ప్రకారం మాంసాహారం హలాల్ పద్ధతిలోనే ఎగుమతి అయ్యేది. అయితే దీనిపై పలు సిక్కు సంఘాలు, హిందూ సంఘాలు, ఎన్జీవోలు, కొన్ని క్రిస్టియన్ సంస్థలు కూడా చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాయి. విదేశాలకు మాంసం ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా హలాల్ చేయాల్సి వచ్చేది. దీంతో మాంసం ఎగుమతి అంతా కేవలం ముస్లింల చేతుల్లోకి వెళ్లిపోయింది. గత జనవరిలో కేంద్రం అపెడా చట్టాన్ని సవరించడం ద్వారా హలాల్ అనే పదాన్ని తొలగించారు. దీంతో మాంసం ఎగుమతిలోకి భారతీయులంతా వచ్చినట్లయింది. హలాల్ సర్టిఫికేషన్ తో ప్రభుత్వానికేం సంబంధం లేదని, అది మాంసం ఆర్డర్ చేసే దేశాలకు సంబంధించిన వ్యవహారమని చట్టం తేల్చి చెప్పింది. దీంతో షరియా మార్గదర్శకాలు అనుసరించి జారీ చేసే హలాల్ ఇండియా సర్టిఫికెట్ కు విలువ లేకుండాపోయింది. అయినా అదే సర్టిఫికెట్ ఆధారంగా చెన్నైకి చెందిన టెండర్ కట్స్ అనే సంస్థ మత విశ్వాసాలను, చట్ట సవరణను పట్టించుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ హలాల్ అంటూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుండడం గమనార్హం.
సెక్యులరిజానికి పెద్దపీట వేసే భారత్ లో ఒక వర్గంవారికి మాత్రమే వ్యాపారాన్ని ధారాదత్తం చేసే చట్టాలు సవరించాలన్న డిమాండ్ గత ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఫలితంగా ఇటీవల కేంద్రం అపెడా చట్టాన్ని సవరించింది. అయినా ఆ చట్టం స్ఫూర్తిని తుంగలో తొక్కి... హలాల్ అనే ప్రత్యేక విశ్వాసాన్ని జనమందరికీ రుద్దడం హరామ్ కాదా? హలాల్ పేరుతో హరామ్ చేయొచ్చా? ఇప్పటికే పలు వ్యాపార ప్రకటనలు తమ సెంటిమెంట్లు గాయపరిచాయన్న ఆందోళనలతో క్షమాపణ చెప్పిన సందర్భాలు కోకొల్లలు. ఆ ఉదాహరణలేవీ పరిగణనలోకి తీసుకోకుండా టెండర్ కట్స్ ఇంత సున్నితంగా హలాల్ చేయడం హర్షణీయమేనా?
Comments
Post a Comment
Your Comments Please: