ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులకు లీగల్, క్రైమ్ రిపోర్టింగ్ లో మరింత లోతైన అవగాహన కల్పించేందుకు నిర్వహించిన రెండు రోజుల వర్క్ షాప్ కు మంచి రెస్పాన్స్ లభించింది. న్యాయ పంచాయతీలు మొదలుకొని కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులు, కోర్టు హియరింగ్స్ లో వెల్లడయ్యే ఆసక్తికరమైన అంశాలు, క్రైమ్ రిపోర్టింగ్ లో కీలకమైన అంశాలు, వివిధ రాష్ట్రాల పోలీసింగ్ లో ప్రజలకు కనిపించని కోణాలు, వాటిని వెలికి తీయాల్సిన పద్ధతులపై ఇండియా జస్టిస్ రిపోర్ట్స్-101 రిపోర్టర్స్ సంయుక్తంగా శని, ఆదివారాల్లో ఆన్ లైన్ వర్క్ షాప్ నిర్వహించాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల్లో పనిచేసిన పలువురు జర్నలిస్టులు, ఎన్జీవో సంస్థల నిర్వాహకులు, మాజీ డీజీపీ స్థాయి అధికారులు, సీబీఐ అధికారులు ఫ్యాకల్టీలుగా పాల్గొని జర్నలిస్టులకు మార్గదర్శనం చేశారు.
దేశంలో సుమారు 44 మిలియన్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, అవి పరిష్కారానికి నోచుకోవాలంటే కోర్టు వ్యవహారాల డిజిటైజేషన్ తో పాటు పెద్దసంఖ్యలో స్టాఫ్ రిక్రూట్ మెంట్ చేసుకోవాల్సి ఉందని రిటైర్డ్ జడ్జి అజయ్ కుమార్ కుహర్ అన్నారు. అలాగే న్యాయమూర్తుల మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని, ఇది కేసుల పరిష్కారాన్ని ప్రభావితం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గత ఐదారేళ్లుగా న్యాయమూర్తులు చాలా వేగంగా కేసులు క్లోజ్ చేయడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. ప్రభుత్వాల్లో, వ్యవస్థల కార్యకలాపాల్లో వెలుగుచూడని అంశాలు బయటకు రావాలంటే ఆర్టీఐ ని మించిన మరో మార్గం లేదంటూ దాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవాలో సంజయ్ హజారికా వివరించారు.
ఇక పోలీసు వ్యవస్థలో సెంట్రల్ రిక్రూట్ మెంట్, స్టేట్ రిక్రూట్ మెంట్ నుంచి పోలీసు చట్టాలు ఎక్కడ, ఎప్పుడు మొదలయ్యాయో దేవయాని శ్రీవాత్సవ అద్భుతంగా వివరించారు. దేశంలోనే అత్యద్భుత పనితీరు కనబరుస్తున్న పోలీసు డిపార్టుమెంటుగా కేరళ పోలీసు విభాగం పేరు తెచ్చుకుందని ఆ రాష్ట్ర మాజీ డీజీపీ జాకోబ్ పన్నూస్ వివరించారు. కేరళలో 2006లోనే కమ్యూనిటీ పోలీసింగ్ మొదలైందని, 1979లో పోలీస్ అసోసియేషన్స్ ప్రారంభం అయ్యాయని, ఇక 1959లోనే కేరళలో పోలీసు సంస్కరణల గురించి చర్చ మొదలైతే.. ఇతర రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే ఆ దిశగా ఆలోచిస్తున్నాయని జాకోబ్ అన్నారు. ఇక పోలీసులు, క్రైమ్ రిపోర్టర్లు ఒకరినొకరు అనుమానించడం, విషయ సేకరణ కోసం ప్రశ్నించడం ద్వారానే ప్రజలకు వివరాలు తెలుస్తున్నాయని, రిపోర్టింగ్ చేసే సమయంలో వాస్తవాలకు రంగులద్దకుండా ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే జర్నలిస్టులకు పోలీసు అధికారుల్లో మంచి గుర్తింపు ఉంటుందని విపుల్ ముద్గల్ వివరించారు. అలాగే మన పోలీసు వ్యవస్థకు ప్రజల్లో మంచిపేరు రావాలంటే ప్రభుత్వాలు ఎఫీషియెంట్ పోలీసింగ్ కోసం కాకుండా అకౌంటబుల్ పోలీసింగ్ కోసం కృషి చేయాలని ముద్గల్ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులు చేసే ఏ ప్రజెంటేషన్ అయినా డాటాతోనే ఆకట్టుకుంటుందని, ఆ డాటాను ఎలా సేకరించాలో అవినాష్ సింగ్ వివరించారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్స్ నుంచి మాయాదారువాలా ఈ వర్క్ షాప్ ను పర్యవేక్షించగా, 101 రిపోర్ట్స్ నుంచి ఐశ్వర్యామూర్తి మోడరేటర్ గా వ్యవహరించారు.
Comments
Post a Comment
Your Comments Please: