ఉపాధి దెబ్బతిని, కుటుంబాలు అల్లకల్లోలమవుతున్న తరుణంలో విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని, ప్రభుత్వాలు తమవైపు దృష్టి సారించేదాకానైనా తమ జాతిలో ఔదార్యం గలవారు ముందుకు రావాలని, వృత్తిపనులకు దూరమైన పేద విశ్వబ్రాహ్మల్ని ఆదుకోవాలని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లోజు రాజు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పలు పేద కుటుంబాలకు విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందించినట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ఆదేశాల మేరకు, కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున ఇల్లంతకుంటలో సమావేశం నిర్వహించామని, ఈ సమావేశానికి మండల విశ్వబ్రాహ్మల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.
తమ జాతి ప్రజలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో మగ్గిపోతున్నారని, తెలంగాణ వచ్చిన తరువాత అనేక కులాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నా.. విశ్వబ్రాహ్మలు మాత్రం వివక్షకు గురవుతున్నారన్నారు. ఎందరో విశ్వబ్రాహ్మణ సోదరులు ఆత్మహత్యలకు పాల్పడ్డా వారి కుటుంబాలకు కనీస పరామర్శ సైతం దక్కడం లేదన్నారు. మరోవైపు ఇప్పటివరకు తమ జాతిలో అనేక సంఘాలు ఉనికిలో ఉండేవని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, ఒకే ఒక ఐక్య సంఘం ఆధ్వర్యంలో సరైన మార్గదర్శనం కింది స్థాయిదాకా అందుతుందన్నారు. ఐక్యసంఘం ఆధ్వర్యంలో వివిధ దశల్లో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని, తమకు అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞా పనలు అందించే ప్రక్రియ పూర్తయిన తరువాత ఉద్యమాల బాట పట్టాల్సి ఉంటుందని విశ్వబ్రాహ్మణ సామాజికవర్గాన్ని రాజు అప్రమత్తం చేశారు.
స్వప్రయోజనాల కోసమో, స్వార్థం కోసమో తాము సంఘ బాధ్యతలు తీసుకోలేదని, జాతి పట్ల పూర్తి సానుభూతితోనే పని చేయడానికి ముందుకొచ్చామన్నారు. అదే విధంగా కింది స్థాయిలో కూడా ప్రజలు తమకు తోచినవిధంగా సంఘం అభివృద్ధి కోసం పనిచేసి హక్కులు సాధించుకోవాలన్నారు. డబ్బున్నవారు డబ్బు, సమయం ఉన్నవారు సమయం, ఆలోచన ఉన్నవారు ఆలోచనలు ప్రజలతో పంచుకుంటే అనుకున్న లక్ష్యాన్ని త్వరలోనే సాధించుకోగలమన్నారు. 1969 కన్నా ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడితే.. అది కేసీఆర్ హయాం నాటికి ఫలించిందని, అలాగే విశ్వబ్రాహ్మణ జాతి కోసం ఈనాటి తరం కృషి చేస్తే వచ్చేతరం లబ్ధి పొందుతుందని, తెలంగాణ సాకారమే అందుకు ఓ నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పాములపర్తి వేణుగోపాల్, స్థానిక అధ్యక్షుడు ఊకంటి మల్లాచారి, ప్రధాన కార్యదర్శి అప్పాల సురేశాచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: