- నిరుద్యోగ దీక్ష ఢిల్లీలో చేయి..మోడీ ఇస్తానన్న 14 కోట్ల ఉద్యోగాలు ఏవి..?
- కేంద్రంలో ఖాళీగా ఉన్న 9 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదు..?
- కేంద్రం భర్తీ చేసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- రేవంత్ రెడ్డి, బండి సంజయ్ రాజకీయ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు
చేవెళ్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన వయసు కు మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ ది నిరుద్యోగ దీక్ష కాదు దొంగ దీక్ష అని విమర్శించారు.నిరుద్యోగ దీక్ష ఢిల్లీలో చేయాలన్నారు. మోడీ ఇస్తానన్న 14 కోట్ల ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 9 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని సంజయ్ ను నిలదీశారు.కేంద్రం భర్తీ చేసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ఇచ్చినన్ని ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. తెలంగాణ కంటే మీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినా దేనికైనా సిద్ధమని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినా మంత్రి పదవికే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ రాజకీయ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని విరుచుకు పడ్డారు.
Comments
Post a Comment
Your Comments Please: