స్వయంగా రచనలు చేయడం ద్వారానే కాకుండా తెలుగు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు, తెలంగాణ సారస్వత పరిషత్ వంటి సంస్థల ద్వారా తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి అత్యున్నతమైన సేవలందించిన డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి ఎంతో అభినందనీయులని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాంతా బయోటెక్నిక్స్ అధినేత, పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి ఆధ్వర్యంలోని శాంతా-వసంతా ట్రస్టు తెలంగాణ సారస్వత పరిషత్తులోని డా. దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి డా.వరప్రసాదరెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి అందజేశారు. అలాగే పరిషత్ ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్యకు తెలుగు భాషా సేవారత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా, వరప్రసాదరెడ్డి సభాధ్యక్షులుగా పాల్గొని పురస్కార గ్రహీతలకు లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, సన్మానపత్రం అందజేశారు. శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ శాంతా బయోటెక్నిక్స్ ద్వారా హెపటైటిస్-బి తో పాటు అనేక వ్యాధులకు వ్యాక్సిన్లకు తయారు చేయడమే కాకుండా సాహిత్యం, భాషా సంస్కృతులకు డా. వరప్రసాదరెడ్డి అనుపమానమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. డా.ఎల్లూరి శివారెడ్డి, డా.జుర్రు చెన్నయ్యలను ఉన్నత పురస్కారాలతో గౌరవించడం వరప్రసాదరెడ్డి ఉత్తమ సంస్కారానికి నిదర్శనమని అన్నారు. డా.వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ శివారెడ్డి మంచి సాహితీవేత్తగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులుగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, సారస్వత పరిషత్ అధ్యక్షులుగా బహుముఖీనంగా తెలుగు సాహిత్యానికి సేవలందించారన్నారు. మహాభారతంపై పరిశోధన చేసిన అనుభవంతో త్వరలో భారతంపై ప్రత్యేక ప్రసంగాలు చేయాలని కోరారు. పురస్కారాలు అందుకున్న తరువాత ఎల్లూరి శివారెడ్డి, చెన్నయ్య తమ స్పందనలను ఎంతో హృద్యంగా సభతో పంచుకున్నారు.
కార్యక్రమం అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి ప్రజాసమస్యలపై వినతిపత్రాలు తీసుకొని అక్కడికక్కడే పరిష్కారాల కోసం సంబంధిత అధికారులను పురమాయించారు. అభిమానులతో ఆనంద క్షణాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రసమయి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ఎం.కె. రాము, సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావు, సాహితీవేత్తలు, భాషాభిమానులు పాల్గొన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: