తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని యాత్రలు నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప దేవాలయ చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.
రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక్కించారని బాలబ్రహ్మం ఆవేదన వ్యక్తం చేశారు. రేచర్ల రుద్రుడు వేయి స్తంభాల గుడిని నిర్మించినట్టుగా చరిత్రలో నమోదైనప్పటికీ ఆనాటిి కాకతీయ పాలకుడైన రుద్రుడిని రామప్ప ఆలయానికి జత చేయడం కొందరు కుసంస్కారుల, కుహనా మేధావుల కుట్రపూరిత చర్యగా సినీ నిర్మాత, రచయిత కొత్తపల్లి సీతారాం పేర్కొన్నారు. తెలంగాణ సర్కారు యునెస్కో కు నివేదికలు పంపినప్పుడే ఈ కుట్రకు బీజాలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ప్రముఖ సినీ గేయ రచయిత స్వర్గీయ సి.నారాయణరెడ్డి రాసిన రామప్ప అనే పుస్తకంలో, అలాగే రాగమయి అనే మరో కావ్యంలో ఆ శిల్పిని రామప్పగా పేర్కొనడం జరిగిందని, రామప్ప శిల్ప కళా నైపుణ్యానికి ఆనాటి పాలకురాలు రుద్రమదేవి మనసు పడిందని వారి మధ్య అవ్యక్తమైన, అవ్యాజమైన, అద్భుతమైన ప్రేమాయణం కూడా కొనసాగినట్లు సినారె వంటి ప్రముఖ రచయితలు కూడా పేర్కొన్నారని సీతారాం గుర్తు చేశారు. అసలు ఆ ఆలయానికి శిల్పి పేరు మీద రామప్ప అనే పేరు పెట్టింది కూడా సాక్షాత్తూ ఆనాటి పాలకుడు రేచర్ల రుద్రుడేనన్న విషయం గమనించాలని ఆయన ప్రజలకు, మేధావులకు విజ్ఞప్తి చేశారు. చరిత్రలో నమోదైన అంశాలను విస్మరించి స్వీయ కల్పితాలతో యునెస్కోకు రిపోర్టులు ఇవ్వడం వల్లే రామప్ప పేరు కాస్తా బ్రాకెట్లోకి వెళ్లిపోయిందన్నారు.
అయితే ప్రజలందరికీ తెలిసింది రామప్పేనని, రామప్ప పేరును ప్రజల మస్తిష్కాల్లోంచి ఎవ్వరూ చెరిపివేయజాలరని, అయితే మేధావుల ముసుగులో, చరిత్రకారుల పేరుతో కొందరు చేస్తున్న కుత్సితపు చేష్టలను ప్రజలెప్పుడూ తిరస్కరిస్తారని సీతారాం అన్నారు. ఇందులో భాగంగానే తాము రానున్న రోజుల్లో మరిన్ని యాత్రలు నిర్వహిస్తామని, అయితే ఉమ్మడి రాష్ట్రంలో వెనుక వేయబడ్డ ప్రాంతంగా పేరున్న తెలంగాణకు తన శిల్పకళా చాతుర్యంతో అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప పేరుకు అన్యాయం తలపెట్టే ప్రయత్నాలను పాలకులు ఎంతో ముందుచూపుతో కనిపెట్టాలని, అలాంటివాటికి ఎప్పటికప్పుడు చెక్ పెట్టినప్పుడే న్యాయం నాలుగు పాదాలమీద నడిచినట్టు కీర్తి పొందుతుందని సీతారాం అభిప్రాయపడ్డారు.
ఈ యాత్ర పొడవునా జయహో రామప్ప, అమర శిల్పి రామప్ప అంటూ యాత్రికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. పురుషులతో పాటు పెద్దసంఖ్యలో మహిళలు కూడా పాల్గొనడం విశేషం. నాగర్ కర్నూలు జిల్లాలోని యథార్థ పీఠం అధిపతి జనార్దనస్వామి ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Comments
Post a Comment
Your Comments Please: