డాక్టర్ కొడుకు డాక్టర్.. యాక్టర్ కొడుకు యాక్టర్.. లాయర్ కొడుకు లాయర్ అవడంలో వింతేం లేదు. అలా కాకుండా తాను పూర్తిగా కొత్తదారిని ఎంచుకొని తమ కుటుంబంలో ఓ కొత్త ట్రెండును సృష్టించాడు ఓ కొడుకు. సొంతూరి ప్రజల పొగడ్తలు పక్కనపెడితే, తల్లిదండ్రుల కళ్లలో కళ్లలో ఆనందాన్ని చూడగలిగాడు. ఆ కుర్రాడే మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నందారానికి చెందిన రాజమూరి నితిన్ కుమార్ రెడ్డి. తండ్రి వకీలు కావడంతో ఆయన ప్రాక్టీసుతో పాటు కొడుక్కి మంచి చదువు చెప్పించాలని మహబూబ్ నగర్ షిఫ్టయ్యారు. చిన్నప్పటి నుంచే చదువుల మీద పూర్తి ఏకాగ్రత కనబరిచే నితిన్.. కష్టాన్ని ఇష్టంగా చేసుకొని చదివితే ఫలితం వచ్చి తీరుతుందని, అందుకు తానే ఓ ఉదాహరణగా నిలిచాడు.
పెద్దయ్యాక ఎవరేం కావాలో చిన్నప్పుడే తల్లిదండ్రుల మాటల రూపంలో పిల్లల చెవుల్లో బీజాలు పడతాయంటారు. ఆ బీజాలే వారిని చదువుల మీద నిలబెడతాయి. ఉన్నతమైన లక్ష్యాల వైపు నడిపిస్తాయి. సమాజంలో తన పాత్రేంటో తెలియజేస్తాయి. తల్లిదండ్రుల రుణమే కాదు.. సమాజ రుణం కూడా తీర్చుకోవాలనే అవగాహన కలిగిస్తాయి. అలాంటి నేపథ్యం నుంచి వచ్చినందుకు తాను నిజంగా గర్విస్తున్నానంటారు నితిన్. పల్మనాలజీ-ఎండీ (శ్వాసకోశ సంబంధ కోర్సు)లో 2017 సంవత్సరానికి గాను నితిన్ ఫస్ట్ ర్యాంక్ కొట్టారు. అందుకు ఉమ్మడి ఏపీ లెవల్లో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీవారు ఇటీవలే బంగారు పతకాన్ని అందజేశారు. 2014-17 మధ్య పల్మనాలజీ పూర్తి చేసిన నితిన్, 2018-21 మధ్య బెంగళూరులోని సెయింట్ జాన్స్ కళాశాలలో డీఎం పల్మనాలజీ పూర్తి చేశారు. ఇప్పుడు మహబూబ్ నగర్ లోని రాజేంద్రనగర్ శెట్టి కాంప్లెక్స్ దగ్గర చెస్ట్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఛాతీవైద్య నిపుణుడిగా ప్రజల ప్రశంసలందుకుంటున్నారు. రానున్న రోజుల్లో కార్డియాలజీ నిపుణుడిగా రాణించాలనేది తన లక్ష్యంగా చెబుతారు.
ప్రజలకు వైద్య సేవలందించడంలోనే తనకు ఆత్మ సంతృప్తి దొరుకుతుందని, హృద్రోగాలకు కారణమవుతున్న అంశాలపై అధ్యయనం చేసి కొత్త ఆవిష్కరణలు చేయాలని ఉందని, పేద-మధ్య తరగతి ప్రజల జీవితాల్లో తన శక్తివంచన లేకుండా సేవ చేయడమే లక్ష్యమని చెెబుతారు. ఇక తాను చదువుల విషయంలో ఎంత శ్రద్ధగా ఉండేవాడో ఆటల విషయంలో కూడా అదే కచ్చితత్వాన్ని కొనసాగించానంటారు. ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కచ్చితంగా గ్రౌండ్ లోనే ఉండేవాడినని, ప్రత్యేకమైన పోటీలు నిర్వహించినప్పుడు మరికాస్త టైమ్ గ్రౌండ్ కే కేటాయించేవాడినని, ఆ రెండు గంటలు మినహా మిగతా టైమంతా చదువులకు, ప్రిపరేషన్స్ కే కేటాయించేవాణ్నని చెబుతారు. ఆ సమతూకం పాటించడం వల్లనే శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉన్నానంటారు. తాను ఇప్పటికీ దాదాపు ఇదే ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 10 గంటలకు నిద్రకు ఉపక్రమిస్తానని చెబుతారు. ఎంబీబీఎస్ కోర్సు ఐదేళ్లలో ప్రతి సంవత్సరం బెస్ట్ స్టూడెంట్ అవార్డు తనకే రావడానికి ఇదే సీక్రెట్ అంటారు. పీజీ లో యూనివర్సిటీ ఫస్ట్ రావడం ఎంతో ఆనందంగా ఉందని, కాసింత గర్వంగా కూడా ఉందంటున్న నితిన్... ఎండీ పల్మనాలజీలో ఫస్ట్ ర్యాంక్ పొంది వైద్య నిపుణుల దృష్టిని తనవైపు మరల్చుకోవడం విశేషం.
Comments
Post a Comment
Your Comments Please: