ఎవరైనా సెలవు రోజు ఏం చేస్తారు?
ఆ వారం రోజులు పడిన శ్రమ అంతా మరచిపోవాలని చూస్తారు. "సేద" దీరే సమయం కోసం ఎదురుచూస్తారు. ఇక రేపటి గురించి కలలు కనేవారైతే వచ్చే వారం రోజుల్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఎవర్ని కలవాలో పక్కాగా ప్లాన్ వేసుకుంటారు. కూడికలు, తీసివేతల లెక్కల్ని గణించుకొని ముందడుగు వేస్తారు.
మరి.. కొడిచర్ల రమేశ్ ఏం చేస్తాడో తెలుసా?
షేవ్ చేస్తాడు. అవును మీరు చదివింది నిజమే. సెలవు రోజుల్లో ఆయన సేవ చేస్తాడు. షేవింగ్, కటింగ్.. ఇలా తన కులవిద్య అయిన క్షవర వృత్తినే ప్రతి మంగళవారం సెలవు దినాన సేవ కోసం కేటాయిస్తాడు. ఉదయాన్నే 6 గంటలకల్లా ఇంటి నుంచి బయటపడి ఏ వృద్ధాశ్రమానికో, అనాథాశ్రమానికో వెళతాడు. ప్రతి వారం ఏదో ఒక అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి బాబాయిల్ని, చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తాడు. జుట్టు బాగా పెరిగి చికాగ్గా కనిపించే అనాథలను ఎంతో నాగరికంగా తయారుచేసి ఆశ్రమ నిర్వాహకులకు ఎంతో ఆత్మీయ నేస్తంగా మారాడు.
డబ్బున్న మారాజులు తమ పేరెంట్స్ ని ఖరీదైన వృద్ధాశ్రమాల్లో చేర్పించి డాలర్లు పోగేసుకునేందుకు విమానాల్లో విదేశాలు చెక్కేస్తుంటే.. చిల్లిగవ్వ కూడా పోగేసుకోవాలనే ధ్యాసే లేని రమేశ్ మాత్రం క్షవర సేవ కోసం తనకున్న టూ-వీలర్ మీదనే రథయాత్రను కొనసాగిస్తున్నాడు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి ప్రాంతానికి చెందిన కొడిచెర్ల రమేశ్ ది స్వతహాగా సేవాభావం. మాటల్లో, మౌనంలో ఆయనలో ఎక్కడ చూసినా సేవాభావమే తొంగి చూస్తుంటుంది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయినా, నరేంద్ర మోడీ పుట్టిన రోజు అయినా, సావిత్రిబాయి ఫూలే కు నివాళి అర్పించే రోజైనా, సైనిక అమరవీరులను స్మరించుకునే రోజైనా, తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ వర్దంతి అయినా, ఆఖరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజైనా సరే... ప్రాముఖ్యత గల ఏ రోజు వచ్చినా ఏదో ఒక ఆశ్రమంలోనో, హైదరాబాద్ సిటీలోని ఏదోక స్లమ్ ఏరియాలోనో వాలిపోతాడు. అక్కడుండే పేదలకు ఉచితంగాా క్షురకర్మ చేసి వారి ఆదరాభిమానాలు చూరగొంటున్నాడు. రమేశ్ సేవా పరాయణతకు మెచ్చిన అనేక స్వచ్చంద సంస్థలు ఆయనకు అనేక సత్కారాలు అందజేశారు. వారందరికీ రమేశ్ అంటే కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువ.
రక్త సంబంధాలు కూడా డబ్బు మారకంతో కలుషితం అయిపోతుంటే.. రమేశ్ నాయీ స్వచ్ఛమైన, స్వచ్ఛంద సేవాకార్యం మాత్రం ఎందరో దేవుడిచ్చిన బాబాయిలను, తమ్ముళ్లను సంపాదించి పెట్టింది. ఇంతమంది ఆత్మీయులను ఎలా సంపాదించుకున్నావని రమేశ్ ని అడిగితే.. చాలా సింపుల్ గా.. "నాకేం వచ్చింది అని కాకుండా.. నేనేం ఇవ్వగలను" అనే ప్రశ్న వేసుకుంటే దాన్ని మించిన సౌభాగ్యం లేదంటాడు.
Comments
Post a Comment
Your Comments Please: