ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే నిబంధన ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.
ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక్ మనిపిస్తాడు. ఈ విషయంలో అధికారులు కూడా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అసలు కారణం వారు చూసీ చూడనట్టు వదిలేయడం కాదనీ.. దేవస్థానం ఉన్నతాధికారులు ఆనంద్ తో కుమ్మక్కై తలా కొంత సొమ్ము పంచుకునే అవగాహనతోనే లైట్ తీసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. శ్రీశైలంలో ఎంతటి వీఐపీలు వచ్చినా ఎవరికీ ప్రైవేటుగా వీడియోలు గానీ, ఫొటోలు గానీ అనుమతించరు. కానీ దలారీ ఆనంద్ తల్చుకుంటే భక్తులకు స్పెషల్ దర్శనాలు చేయించి వారు కోరిన చోట ఫొటోలు తీసి పెడుతూ సొమ్ము చేసుకుంటున్నాడు. పలువురు బుల్లితెర నటులు సైతం ఆనంద్ ఆశీర్వాదంతో స్వామివారి ఆలయంలో ఫొటోలను తమ ఆల్బమ్స్ లో పెట్టుకుంటున్నారు. ఆలయంలో మూలవిరాట్ల ప్రదేశాల్లో, మండపాలలో, స్వామి స్వర్ణగోపురం ప్రదేశాల్లో, అమ్మవారి బంగారుగోపురాలు కనిపించే విధంగా ఫోటోలను తీసి ఒక్కో ఫొటోకు రూ. 500/-లు, ఆ పైనే తీసుకుంటున్నట్టు ఆరోపిస్తున్నారు. ఆ వచ్చిన సొమ్మును ఆలయ అధికారులు, సీయస్వో భాగాలు వేసుకొని పంచుకుంటున్నారని స్ధానికులు అనుకుంటున్నారు. మరి ఓ దళారీ చేతిలో పవిత్రమైన మల్లన్న పరువు కాస్తా మంట గలుపుతున్న ఆలయ అధికారులు ఇకనైనా.. నిబంధనలు పాటించి ఆలయ పవిత్రతను కాపాడుతారా? ఓ అవకాశం ఇచ్చి వేచి చూద్దాం అంటున్నారు మల్లన్న భక్తజనం.
Comments
Post a Comment
Your Comments Please: